Characteristics of Kaliyuga:  సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అత్యధికులు స్టాలిన్ మాటలను వ్యతిరేకిస్తుంటే కొందరు మాత్రమే సమర్థిస్తున్నారు. అయితే దీనిపై వేదపండితులు కూడా తమ అభిప్రాయాలను చెబుతూ కలిపురుషుడి లక్షణాలు, కలియుగంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో చెబుతున్నారు..అవేంటో చూద్దాం...


మొత్తం నాలుగు యుగాలు... సత్యయుగం, త్రేతాయుగం, ద్వారపయుగం, కలియుగం.


మొదటి యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే..రెండో యుగంలో మూడు పాదాలపై..మూడో యుగంలో రెండు పాదాలపై నడిచింది. ప్రస్తుతం కలియుగంలో ధర్మ ఒంటికాలిపై కుంటుతూ నడుస్తోంది. ఈ యుగంలో కలిపురుషుడి పుట్టుకే ఆశ్చర్యంగా ఉంటుంది. క్రుద్దుడు అనే యువకుడు హింస అనే తోడబుట్టిన చెల్లెల్నే పెళ్లిచేసుకుంటాడు. వారికి కలిగిన కుమారుడే "కలిపురుషుడు". అంటే ఎంత వేద విరుద్దంగా అతడు జన్మించాడో అర్ధమవుతుంది.అందుకే వేదం, ధర్మంపై కలిపురుషుడికి పెద్దగా శ్రద్ధ ఉండదు. అలాంటి వాడు పాలకుడైతే ప్రజలు ఎంత అధర్మంగా బతుకుతారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంటుంది. పరమేశ్వరుడు నిషిద్ద కర్మగా చెప్పాడో దానిపై ఆసక్తి చూపించేలా మనుషుల బుద్ధి మార్చేయడమే కలిపురుషుడి పని. 


Also Read: సెప్టెంబరు 08 రాశిఫలాలు, ఈ 2 రాశులవారికి ధనలాభం - ఆ రాశివారికి సంతోషం!


కలియుగంలో ఇలా ఉంటారు


కలియుగం ప్రారంభమవగానే  మనుషుల్లో పవిత్రత నశిస్తుంది. నిజం మాట్లాడటమే మహాపాపం అన్నట్టు భావిస్తారు. వేదాలను నిందిస్తూ, ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఇదే అద్భుతమైన జీవితం అంటూ బతికేస్తారు. కలియుగంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే..


పరాపవాద నిరాః పరద్రవ్యాభిలాషిణః |
పరస్త్రీసక్త మనసః పరహింసా పరాయణాః ||


మొత్తం నాలుగు ’పర’లు ఉన్నాయి.  పరులపై నిందలు చేస్తూ, ఆ నిందలే కాలక్షేపంగా మార్చుకుంటారు..ఇంకా పరద్రవ్యాలమీద, పరస్త్రీలమీద అభిలాష కలిగి ఉంటారు. పరహింసా పరాయణులై ఉంటారు.


దేహాత్మ దృష్టయా మూఢా నాస్తికాః పశుబుద్ధయః !
మాతృపితృ కృత ద్వేషాః స్త్రీ దేవాః కామకింకరాః ||


సర్వపాపాలకూ మూలం దేహం. ఈ దేహాన్ని తృప్తిపరచడానికి సర్వపాపాలూ చేస్తారు. దేహానికి అతీతమైనది ధర్మం అని చెప్పినా చెవికి ఎక్కించుకోరు. దాంతో మూఢత్వం ఏర్పడి నాస్తికులుగా మారి తిరిగి ధర్మాన్ని నిందిస్తారు


“నాస్తికో వేదనిందకః” 


వేదనిందకులై శాస్త్రాలపై విశ్వాసం లేనివారై పశుబుద్ధులతో తల్లిదండ్రులపై ద్వేషబుద్ధి కలిగి ఉంటారు. కలియుగంలో స్త్రీలే దేవతలు. కామానికి తలొంచని పురుషుడు ఉండడు. ధనార్జనే ప్రధాన ధ్యేయం. వేదవిద్యలను, జ్ఞానాన్ని అమ్మకుంటారు. విద్యల ప్రయోజనం ధనమే అన్నట్టు మారిపోతుంది. జీవిత పరమార్థాన్ని చెప్పే విద్యలను కూడా సంపాదనకోసమే అన్నట్టు నేర్చుకుంటారు.


Also Read: వినాయ‌క చ‌వితి 18, 19 తేదీల్లో ఏ రోజు జ‌రుపుకోవాలి - పండితులు ఏమంటున్నారు!


త్యక్త స్వజాతి కర్మాణః ప్రాయశః పరవంచకాః |
త్రికాల సంధ్యయా హీనా బ్రహ్మబోధ వివర్జితాః ||


బ్రాహ్మణులు తాము చేయాల్సిన కర్మలు విడిచిపెట్టి ఇతరులను వంచిస్తూ తిరిగేస్తారు. త్రికాలసంధ్యావందనాలు వదిలేసి బ్రహ్మజ్ఞానం లేకుండా ఉంటారు.


అదయాః పండితం మన్యాస్స్వాచార వ్రతలోపకాః |
కృష్యుద్యమరతాః క్రూర స్వభావా మలినాశయాః ||


దయలేనివారు, ధర్మం తెలియనివారు పండితుల్లా కీర్తినందుకుంటారు..నిజమైన పండితులకు, వారి ఆచారాలకు, వ్రతాలకు భంగం కలిగిస్తుంటారు


క్షత్రియాశ్చ తథా సర్వే స్వధర్మ త్యాగశీలినః |
అసత్సంగాః పాపరతా వ్యభిచార పరాయణాః ||
అశూరా అరణ ప్రీతాః పలాయన పరాయణాః |
కుచౌర వృత్తయశ్శూద్రాః కామకింకరచేత సః ||


ఇక్కడ క్షత్రియులు అంటే పాలకులు. పాలించేవారంతా స్వధర్మాన్ని విడిచిపెట్టి చెడ్డవారితో స్నేహం చేస్తారు. దొంగలే పాలకులవుతారు….పాలకులు దొంగల్లా ప్రవర్తిస్తారు. పదవి, అధికారం, సంపాదన తప్ప ..ధర్మాధర్మ విచక్షణ కోల్పోతారు. దేవుడికి సంబంధించిన ఆస్తులు కాజేస్తారు. హింసాపరులుగా మారుతారు. 


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.  ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.