Ganesh Chaturthi 2023: వినాయ‌క చ‌వితి 18, 19 తేదీల్లో ఏ రోజు జ‌రుపుకోవాలి - పండితులు ఏమంటున్నారు!

Ganesh Chaturthi in 2023: ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజు జ‌రుపుకోవాల‌నే విష‌యంలో సందిగ్ధం నెల‌కొంది. దీనిపై పండితులు స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఏ రోజు జ‌రుపుకోవాలో స్ప‌ష్టంచేశారు.

Continues below advertisement

Ganesh Chaturthi in 2023: చిన్నా, పెద్దా వ‌యో భేదం లేకుండా ప్రతీ ఒక్కరు భక్తి శ్రద్దలతో చేసుకునే పండుగ వినాయక చవితి. అయితే ఈ నెల 18 లేదా 19 తేదీల్లో ఎప్పుడు జరుపుకోవాల‌నే సందిగ్ధం కొనసాగుతోంది. చవితి తిథి 18, 19 తేదీల్లో రెండు రోజుల్లోనూ ఉండ‌టంతో పండుగ నిర్వహణపై వివిధ వ‌ర్గాల్లో ఏ రోజు పండుగ చేసుకోవాల‌నే అనుమానాలు త‌లెత్తాయి. అయితే పండితులు ఈ సందిగ్ధ‌త‌కు తెర‌దించారు.

Continues below advertisement

ఏటా భాద్రపద శుద్ధ‌ చవితి రోజు వినాయక చవితి పండుగను దేశ‌మంతా జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబరు 18, 19 తేదీల్లో రెండు రోజులూ చ‌వితి తిథి ఉంది. దీంతో చవితి పండగ ఏరోజు జరుపుకోవాలన్న సందేహం మొదలైంది. ఏదైనా పండుగ చేసుకోవాలంటే ఆ పండుగకు సంబంధించిన శుభ ఘడియలు ఉన్న సమయంలోనే జరుపుకోవాలి. పండితులు కూడా అదే చెబుతుంటారు.

Also Read : వినాయకుడి పూజకు తులసిని వాడకూడదట - ఎందుకో తెలుసా?

ఈ క్రమంలో ఈ ఏడాది వినాయక చవితి పండుగ జరుపుకునే సమయంలో శుభ ఘడియలు ఎప్పుడు సెప్టెంబర్ 18వ తేదీనా,  19వ తేదీనా అనే గందరగోళం నెలకొంది. అంటే పండుగ తగులు మిగులు వస్తే ఇలాంటి గందరగోళం ఉంటుంది. అలాగే ఈ ఏడాది గణేష్ చతుర్థి తిథి విషయంలో కూడా తగులు మిగులు వచ్చాయి. దీనిపై పండితులు స్ప‌ష్ట‌త‌ ఇచ్చారు.

దీనిపై వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో నెలరోజుల కిందటే 100 మంది సిద్ధాంతులతో చర్చించి వినాయక చవితి తేదీపై నిర్ణయం తీసుకుంది విద్వత్ సభ. ఇదే విషయాన్ని తెలంగాణా ప్రభుత్వానికి నివేదించింది. ప్ర‌భుత్వ‌ సెలవుల జాబితాలో ఇప్పటికే 18వ తేదీని అధికారిక సెల‌వు దినంగా ప్రకటించింది.మరోవైపు వెయ్యేళ్ల‌ చరిత్ర ఉన్న స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం కూడా ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త‌ ఇచ్చింది. చవితి తిథి ఈ నెల 18వ తేదీనే జ‌రుపుకోవాల‌ని సూచించింది.

ఈ‌ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి 18వ తేదీ సోమవారం ఉదయం 10:15 నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం 10:43 నిమిషాలు వరకూ ఉంటుందని పండితులు వివరించారు. అంటే ఆ రోజే చ‌వితి పూజ చేసుకోవాలి. క‌థ‌లో చెప్పిన ప్ర‌కారం చ‌వితి తిథి 18వ తేదీ రాత్రి మాత్ర‌మే ఉంది. అందువ‌ల్లే ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కాణిపాకం ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. 

వినాయకచవితి పండుగను ఈ నెల 18వ తేదీ సోమవారం రోజునే జరుపుకోవాలని తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యుడు, ఆగమ పండితుడు వేదాంతం విష్ణుభట్టాచార్యులు తెలిపారు.

Also Read : ఈ అష్ట వినాయకులను దర్శిస్తే... విజయాలన్నీ మీవే

2000, 2009, 2010, 2019 సంవత్సరాల్లో కూడా తిథి విష‌యంలో ఇటువంటి సందిగ్ధ పరిస్థితి త‌లెత్తిన‌ప్పుడు తదియతో కూడిన చతుర్ధినే పర్వదినంగా జరుపుకోవాలని నిర్ణయించారని గుర్తు చేశారు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Continues below advertisement