Kalki: శ్రీ భాగవత పురాణం - కల్కి పురాణం ప్రకారం  కలియుగం-సత్యయుగం సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. శ్రీమహావిష్ణువు ఈ అవతారం 64 కళలతో నిండి ఉంటుంది. దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు. భాగవతంలోని ద్వాదశ స్కందం రెండో అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలున్నాయి.  కల్కి "శంభల" అనే గ్రామంలో విష్ణుయశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దుష్టశిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని చెబుతారు. "కలక" లేదా "కళంక" అంటే దోషాన్ని హరించేదని అర్థం. దోషాన్ని హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని పండితులు చెబుతారు. కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతుందనీ, ఆ సమయంలో తాను కల్కి గా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహా విష్ణువు చెప్పినట్టుగా పురాణాలలో ఉంటుంది.


Also Read: కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు వాస్తు పూజ ఎందుకు చేయాలి - దీని వల్ల లాభమేంటి!


కల్కి వచ్చెదెప్పుడు


కృతయుగం (సత్యయుగం) నుంచి ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాలెత్తాడు. రామావాతరం పూర్తయ్యాక కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించాడు. ద్వారకనీటమునిగి కృష్ణుడు అవతారంచాలించిన తర్వాత నుంచి కలియుగం ప్రారంభమైంది. సత్యయుగంలో దర్మం నాలుగు పాదాలపై నడిస్తే, త్రేతాయుగంలో ధర్మం మూడుపాదలపై, ద్వారపయుగంలో ధర్మం మూడుపాదాలపై నడిచింది. ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం ఒకపాదంపై నడుస్తోంది. ఇక ధర్మం అనే మాటే వినిపించని రోజున కల్కి అవతారంలో వచ్చి శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణ చేస్తాడని వ్యాస వాక్కు. ఇంతకీ శ్రీ మహావిష్ణువు పదో అవతారం అయిన కల్కి ఎప్పుడు వస్తాడంటే...



  • ఎక్కడా దైవపూజ ఉండదు, యజ్ఞయాగాదుల మాటే వినిపించదు

  • గోవులను వధిస్తూనే ఉంటారు, లోకులంతా మాంసాన్నే భక్షిస్తారు

  • వివాహ వ్యవస్థ నిలబడదు

  • తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు

  • భర్తను గౌరవించే భార్య - భార్యను గౌరవించే భర్త అస్సలు కనిపించరు

  • పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది

  • నిత్యం శోకంలో ఉన్నట్టు స్త్రీలు జుట్టు విరబోసుకుని తిరుగుతుంటారు

  • భూమ్మీద ఉన్న మనుషులంతా ఓ వ్యాధిబారిన పడతారు, వళ్లంతా పుండ్లు-వాటినుంచి నెత్తురు కారుతూ పురుగుల్లా మనుషులంతా అంతరించి పోతుంటారు

  • ఎక్కడ చూసినా వ్యాధులతో మంచం పట్టినవారే కనిపిస్తారు

  • పరమ పుణ్యాత్ములు అనేవారు మాత్రమే శరీరాలతో ఉంటారు


ఇలాంటి సమయంలో అవతరించిన కల్కి దుష్ట శిక్షణ చేసి కలియుగాన్ని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని ప్రారంభిస్తాడు. ఈ మధ్య కాలంలో జల ప్రళయం సంభవించి భూమిని మొత్తం ముంచెత్తుతుంది. అంటే మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది.


Also Read : రెండు నెలల పాటూ ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.