చిరు లీక్స్... దీని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అనుకోకుండా ఓ సినిమా వేడుకలో 'ఆచార్య' టైటిల్ లీక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. మెగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత చిరు లీక్స్ పేరుతో తన కొత్త సినిమా విశేషాలను చిరంజీవి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు? అంటే... 'చిరు లీక్స్' గురించి అల్లు అర్జున్ ప్రస్తావించారు కనుక!


'పుష్ప 2' డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్
'బేబీ' చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. రూ. 50 కోట్ల క్లబ్బుకు చేరువలో ఉంది. ఆ సినిమా అభినందన సభకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 'పుష్ప 2' అప్డేట్ చెప్పమని అభిమానులు అడిగారు. అప్పుడు ''పుష్ప 2 లీక్స్ ఆ? అబ్బో... ఇది చిరు లీక్స్ కంటే డేంజర్ గా ఉంది'' అని అన్నారు. 


''సినిమా పేరు 'పుష్ప 2 - ద రూల్'. ఒకటే ముక్క ఉంటుంది. మామూలుగా చెబుతానని కూడా అనుకోలేదు. కానీ, చెబుతున్నా... ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది. పుష్పాగాడి రూల్'' అంటూ సినిమాలో డైలాగ్ చెప్పారు అల్లు అర్జున్. పెద్ద ఫంక్షన్ పెడితే అభిమానులు ఎక్కువ మంది వస్తారని, అప్డేట్స్ అడుగుతారని, అందుకే చిన్నగా 'బేబీ' ఫంక్షన్ చేయమని చెప్పినట్లు అల్లు అర్జున్ తెలిపారు. 


Also Read కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్, అది మారదు : అల్లు అర్జున్


సూపర్ హిట్ సీక్వెల్ మీద అంచనాలు ఎన్నో!
పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'పుష్ప' చిత్రానికి సీక్వెల్ (Pushpa 2 Movie)గా 'పుష్ప 2' సినిమా రూపొందుతోంది. 'పుష్ప'లో 'తగ్గేదే లే' అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్, ఆ మేనరిజమ్ భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'పుష్ప 2'లో అటువంటి సిగ్నేచర్ డైలాగ్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  


Also Read హ్యాట్రిక్ ప్లాపుల్లో ఉన్న హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!



బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో గంగమ్మ జాతర గురించి ప్రపంచమంతా తెలిసేలా చేసింది. ఆ లుక్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 'పుష్ప ఎక్కడ?' అంటూ యూనిట్ విడుదల చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది. శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ ఉన్నట్లు చూపించారు. 'పుష్ప'లో కథానాయకుడిని కేవలం స్మగ్లర్ కింద చూపిస్తే... ఇప్పుడీ రెండో భాగంలో ఆయనను నాయకుడిని చేశారు. స్మగ్లింగ్ చేసి సంపాదించిన డబ్బుతో పేదలకు ఓ దారి చూపించడం మాత్రమే కాదు... వాళ్ళ పిల్లలకు విద్య, అవసరమైన వాళ్ళకు వైద్యం చేయించినట్టు తెలిపారు. అందులో 'అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వస్తే పుష్ప వచ్చాడని అర్థం' అని కేశవ చెప్పే డైలాగుతో పుష్ప ముఖాన్ని చీకటిలో చూపించారు. పుష్ప బతికి ఉన్నాడని ప్రజలు సంబరాలు చేసుకున్నారు.


సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మికా మందన్నా (Rashmika Mandanna) మరోసారి సందడి చేయనున్నారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial