మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అడుగు పెట్టారు. ప్రతి సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ, తనను తాను మెరుగు పరుచుకుంటూ... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) గా మారారు.
ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ అభిమానుల్ని సొంతం చేసుకుని, వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. అయితే... మెగాస్టార్ చిరంజీవి నీడ నుంచి అల్లు అర్జున్ బయట పడాలని ప్రయత్నిస్తున్నారని, చిరుకు దూరంగా జరుగుతూ తన బ్రాండ్ బిల్డ్ చేసుకుంటున్నారని సోషల్ మీడియాలోనూ, చిత్ర పరిశ్రమలోనూ కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. హైదరాబాద్ సిటీలో గురువారం రాత్రి జరిగిన 'బేబీ' అభినందన సభలో అల్లు అర్జున్ మాటలు వింటే ఆ సందేహాలు అవసరం లేదు.
కట్టే కాలే వరకు చిరంజీవి అభిమానినే! - అల్లు అర్జున్
చిరంజీవికి 'బేబీ' చిత్ర నిర్మాత ఎస్.కె.ఎన్ వీరాభిమాని. సోషల్ మీడియాలో చిరుపై ఎవరైనా కామెంట్ చేస్తే... ఘాటుగా బదులు ఇవ్వడం ఆయనకు అలవాటు. అల్లు శిరీష్ అది గమనించి... ఏలూరులో ఉన్న ఎస్.కె.ఎన్ (SKN Producer)ను తమ దగ్గరకు రమ్మని చెప్పారు. ఆ విషయాలు చెబుతూ... ''కట్టే కాలే వరకు నేను చిరంజీవి అభిమానినే. అది మారదు'' అని అల్లు అర్జున్ చెప్పారు. దాంతో పక్కన ఉన్న ఎస్.కె.ఎన్ గట్టిగా చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. మెగా, అల్లు అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.
'బేబీ' విపరీతంగా నచ్చింది! - అల్లు అర్జున్
తనకు 'బేబీ' సినిమా విపరీతంగా నచ్చిందని అల్లు అర్జున్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఎస్.కె.ఎన్ సినిమా ప్రొడ్యూస్ చేశాడని 'బేబీ' గురించి మా వాసు (బన్నీ వాసు) చెప్పాడు. ఆడియో విడుదలకు నేను రావాల్సింది. కానీ, కుదరలేదు. ఆ తర్వాత సినిమా చూశాను. పనులు ఉండటం వల్ల ముందు ఫస్టాఫ్ చూశా. నాకు విపరీతంగా నచ్చింది. తర్వాత సెకండాఫ్ చూశా. సాయి రాజేష్ అద్భుతంగా రాశారు. కొత్త హీరో హీరోయిన్లు అయినా అద్భుతంగా నటించారు'' అని చెప్పారు.
Also Read : ఏం జరుగుతోంది? దోషులకు కఠిన శిక్ష పడాలి - మణిపూర్ ఘటనపై రష్మిక, అక్షయ్
రూ. 50 కోట్ల క్లబ్బుకు చేరువలో 'బేబీ'
'బేబీ' సినిమాకు (Baby Movie) సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫోటో'కు ఆయనే రచయిత. ఆ సినిమా తర్వాత సాయి రాజేష్ నుంచి వస్తున్న చిత్రమిది. ఇందులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఓ హీరో. 'అల వైకుంఠపురములో' సహా కొన్ని సినిమాల్లో, 'సాఫ్ట్‌వేర్ డేవ్‌లవ్‌పర్' వెబ్ సిరీస్‌లో నటించిన వైష్ణవి చైతన్య ఈ సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ మరో హీరో. ఆరు రోజుల్లో ఈ సినిమా రూ. 43 కోట్లు కలెక్ట్ చేసింది. త్వరలో 50 కోట్ల క్లబ్బులో చేరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read : హ్యాట్రిక్ ప్లాపుల్లో ఉన్న హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial