''నేను ఈ విధంగా చెబుతున్నందుకు సారీ! కానీ, ప్రపంచంలో ఏం జరుగుతోంది?'' అని కథానాయిక రష్మికా మందన్నా (Rashmika Mandanna) ప్రశ్నించారు. ఇద్దరు గిరిజన మహిళలను మణిపూర్ (Manipur Incident)లో నగ్నంగా, నడిరోడ్డు మీద  అందరూ చూస్తుండగా నడిపించిన ఘటన మీద ఆమె స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్ట్ చేశారు. 


''నేను ఇప్పుడు చదివిన వార్తను నమ్మలేకపోతున్నాను. నన్ను ఆ ఘటన చాలా కలవరపెడుతోంది. ఆ మహిళలను తలచుకుంటే హృదయం తరుక్కుపోతోంది. దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను'' అని రష్మిక పేర్కొన్నారు. 




అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ సైతం!
హిందీ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్లు కియారా అడ్వాణీ, ప్రగ్యా జైస్వాల్, వాణీ కపూర్, నటులు సోనూ సూద్, రితేష్ దేశ్‌ముఖ్, ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ సహా పలువురు తారలు మణిపూర్ ఘటన (Manipur Violence)పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 


మణిపూర్ మహిళలపై దాడి భయంకరమైనది!
''మణిపూర్ మహిళలపై జరిగిన దాడి భయంకరమైనది. వీలైనంత త్వరగా ఆ మహిళలకు న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను. ఈ దాడికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలి'' అని ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో నటిస్తున్న కియారా అడ్వాణీ పేర్కొన్నారు. మణిపూర్ ఘటన వెన్నులో వణుకు పుట్టించేలా ఉందని మరో కథానాయిక వాణీ కపూర్ తెలిపారు. ఆ దారుణాతి దారుణమైన ఘటనను ఎంత ఖండించినా సరే సరిపోదన్నారు. త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మణిపూర్ ఘటన హార్ట్ బ్రేకింగ్ అని హీరో ప్రగ్యా జైస్వాల్ పోస్ట్ చేశారు.  




ఆ ఆలోచన కూడా రాకూడదు - అక్షయ్
మణిపూర్ మహిళలపై దాడికి పాల్పడిన వాళ్ళకు విధించే శిక్ష, మరొకరిలో ఈ విధమైన చర్యలకు పాల్పడాలనే ఆలోచన కూడా రాని విధంగా ఉండాలని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. 






ఇది మానవత్వంపై దాడి - రితేష్
మహిళల గౌరవంపై దాడి చేయడం అంటే మానవత్వం మీద దాడి చేయడమేనని హిందీ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశారు. మణిపూర్ మహిళలపై జరిగిన దాడి వీడియో చూస్తే తనలో కోపం కట్టలు తెంచుకుందని తెలిపారు. ఆ దాడి తనను ఎంతగానో కలచి వేసిందని, దోషులకు శిక్ష పడాలని ఆయన పేర్కొన్నారు.






Also Read : చెంచుల పాపగా పెంచుతాం - ఒక్క వీడియోలో రామ్ చరణ్, ఉపాసన పెళ్లి నుంచి క్లీంకార జననం వరకు


 


మణిపూర్ ఘటనకు కారణం ఏంటి?
మణిపూర్ మహిళల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా పలువురు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు, ఈ ఘటనకు బీజం మేలో పడిందని తెలుస్తోంది. గిరిజన తెగ మైతాయ్ తమకు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కోరుతూ లోయలో ఆందోళనలు ప్రారంభించింది. దానిని తిప్పి కొట్టేందుకు కుకి గిరిజనులు నిరసన తెలపడంతో హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా... వేలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఆ ఘర్షణల కారణంగా ఓ తెగ ప్రజలు మరొక తెగ మహిళలను నగ్నంగా రోడ్లపై నడిపించారు. 


Also Read హ్యాట్రిక్ ప్లాపుల్లో ఉన్న హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ! 






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial