Kalashtami January 2024 Date: కాలభైరవుడి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలా కృష్ణపక్షం ముందు వచ్చే అష్టమిని కాలాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజు కాలభైరవుడిని పూజించాలనే నియమం ఉంది. 2024 సంవత్సరంలో మొదటి కాలాష్టమి జనవరి 4 న వచ్చింది. కాలాష్టమి రోజు రాత్రి తంత్ర శాస్త్రం నేర్చుకున్న అభ్యాసకులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది కాల భైరవుని అనుగ్రహం కొరకు చేసే వ్రతం. ఆదిత్య పురాణం లో కాలాష్టమి గురించిన వివరణ ఉంటుంది.


Also Read: సంక్రాంతికి అందరూ ఊరెళ్లిపోవాలి అనుకుంటారెందుకు!


బ్రహ్మ గర్వం అణచేందుకు శివుడు హూంకరించగా, ఆ హూంకారంనుండి ఒక భయంకర రూపం వెలువడుతుంది. ఆరూపమే కాలభైరవస్వామి. శివుడి ఆదేశం మేరకు బ్రహ్మ మధ్యతలను కాలభైరవుడు చిటికెన వేలుగోటితో తెంపేస్తాడు. అలా బ్రహ్మ శిరస్సు తెగిపడిన ప్రదేశమే 'బ్రహ్మకపాలం'గా ప్రసిద్ధిచెందింది. కాశీనగరంలో అడుగుపెట్టగానే కాలభైరవుడికి బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుందనీ, కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉండమని శివుడుఆదేశిస్తాడు. అలా కాశీక్షేత్రానికి చేరుకున్న కాలభైరవుడు భక్తులతో పూజలందుకుంటూ విరాజిల్లుతున్నాడు. కాశీ క్షేత్రంలో ఆ ప్రాంతమే కపాలమోచన దివ్య తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు, ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు. స్థానికులు లాట్ భైరవ అని పిలుచుకుంటారు. ఇక్కడ కాలాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.


Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి! 


8 నామాలతో దర్శనమిచ్చే భైరవుడు
అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు అనే ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తాడు. ఎదుట నిలిచిన ఏలాంటి శక్తి అయినా కాలభైరవుడి శక్తిని తట్టుకోవడం కష్టం...


భైరవః పూర్ణ రూపోహి శంకరస్యపరాత్మనః
మూఢాస్త్రంపై జానంతి మోహితాశ్శివమాయయా
అని చెబుతుంది శతరుద్రసంహిత. శివపురాణం, కాశీఖండం కాలభైరవుడి గొప్పదనాన్ని కొనియాడాయి. మనల్ని ఆవహించిన మాయాపొరలను తొలగించుకున్న రోజు మాత్రమే కాలభైరవుడు దర్శనమిస్తాడట. 




 



Also Read: సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడే ఎందుకు ప్రత్యేకం, సంక్రాంతి పెద్దపండుగ ఎలా అయింది!


కాలాష్టమి రోజు ఏం చేయాలి - ఏం చేయకూడదు
కాలాష్టమి నాడు కాలభైరవుడికి నిమ్మకాయల మాల సమర్పించాలి. పేదలకు దానం చేయాలి. కాలభైరవుడిని భక్తిశ్రద్ధలతో స్తుతించాలి. ఈ రోజు ముఖ్యంగా పదునైన వస్తువులు వినియోగించకూడదు, ఎవ్వరికీ హాని తలపెట్టకూడదు, మాంసాహారం తినకూడదు.  కాలభైరవపూజ ప్రదోషకాలంలో అంటే సాయంత్రం 5.30 - 6.30 గంటలమధ్య చేస్తే మంచిది.  కాలభైరవ సహస్రనామస్తోత్రం, శ్రీకాలభైరవాష్టకం, తీక్షదంష్ట్ర కాలభైరవ అష్టకం, భైరవ కవచం పఠించినా, విన్నా కూడా భైరవానుగ్రహం లభిస్తుంది. ఈ రోజు కాలభైరవ హోమంచేయించుకుంటే సకల గ్రహబాధలు అనారోగ్యబాధలు తొలిగిపోతాయి. కాలాష్టమి నాడు కాలభైరవుడిని పూజించడం వల్ల జీవితంలో చేసిన పాపాలు, కర్మ, దుఃఖం తొలగిపోతాయని ...ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల కాల భైరవుని ఆశీస్సులు పొందుతారని... శివాలయానికి కానీ, కాలభైరవుడి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే అపమృత్యు భయం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.


Also Read: ఈ రాశివారు ఫ్యూచర్ కోసం నిర్ణయాలు తీసుకునే సమయం ఇది, జనవరి 04 రాశిఫలాలు


2024 లో కాలాష్టమిల తేదీలు ఇవే (Masik Kalashtami 2024 Dates)
జనవరి 4, ఫిబ్రవరి 2, మార్చి 3, ఏప్రిల్ 1, మే 1, మే 30, జూన్ 28, జూలై 27, ఆగష్టు 26, సెప్టెంబరు 24, అక్టోబరు 24, నవంబరు 24, డిసెంబరు 22


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం