Covid New Variant : కొవిడ్ (Corona Virus) సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1(JN-1) కేసులు...దేశంలో భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 511 కొత్త పాజిటివ్ (Positive)లు వెలుగులోకి వచ్చాయి. కొత్త వేరియంట్ కేసులు పది రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ నమోదయ్యాయి. కర్ణాటకలో అత్యధికంగా 199 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కేరళలో  148, గోవాలో 47, గుజరాత్‌లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 602 కరోనా కేసులు నమోదైతే...అందులో జేఎన్‌.1 కేసులే 511 ఉన్నాయి. కొత్త కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,440కు చేరింది. వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గా జేఎన్‌.1ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 


రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మాండవీయ దిశానిర్దేశం


మరోవైపు కేంద్రం ప్రభుత్వం వైరస్ కట్టడికి అన్ని ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇండియాలో ఉపరకం కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అన్ని రాష్ట్రాలతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మన్సుఖ్ మాండవీయ సమీక్ష నిర్వహించారు. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించాలి. సాధారణంగా కొవిడ్‌-19 సోకినప్పుడు కనిపించే లక్షణాలే కనిపించొచ్చు. అయితే ఈ వేరియంట్‌ సోకినప్పుడు ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతం ఏమీలేదు. దీనివల్ల ప్రజారోగ్యానికి ముప్పు పెరిగే ప్రమాదం ఉందన్న సంకేతం కూడా లేదు.


ఇప్పుడున్న లేబొరేటరీల్లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల ద్వారా జేఎన్‌.1 వేరియంట్‌ను కనిపెట్టవచ్చు. వైరస్ కట్టడికి అన్ని ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. జిల్లాల వారీగా ఆసుపత్రులకు వచ్చే ఇన్‌ఫ్లుయెంజా లైక్‌ ఇల్‌నెస్‌, సీవియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ ఇల్‌నెస్‌ రోగులను నిరంతరం పర్యవేక్షించాలి. వారి వివరాలను ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసి కేసుల పెరుగుదలను తొలి దశలోనే పసిగట్టాలి. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు అధికంగా చేపట్టి పాజిటివ్‌ నమూనాలను జన్యు పరిణామ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్‌ లేబొరేటరీలకు పంపి కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలి. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వైరస్‌ విస్తరించకుండా అడ్డుకోవడానికి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. శ్వాశకోశ సంబంధ పరిశుభ్రత పాటించేలా చూడాలి.


మిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌1 లక్షణాలు
జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి మిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌1 లక్షణాలు. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.  తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. గుంపుల్లోకి వెళ్లకపోవడం, మాస్క్‌ ధరించడం తప్పనిసరిగా పాటించాలి. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. న్యుమోనియా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలోనూ కొవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలు ఉంటున్నాయి. న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో వచ్చే పిల్లలందరికీ కరోనా పరీక్షలూ చేస్తున్నారు.  కరోనా వైరస్‌ కారణంగా న్యుమోనియా సోకుతోందని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.