ఏటా ఆషాడ శుద్ధ విదియ రథయాత్ర జరుగుతుంది. ఆషాడ మాసం అధికం వచ్చినప్పుడు మాత్రం రథయాత్రకు ముందు నవకళేబర ఉత్సవం నిర్వహించి కొత్త విగ్రహాలు గర్భగుడిలో పెట్టి ఆ తర్వాత రథయాత్ర చేస్తారు. హిందూ ధర్మం ప్రకారం జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చక తప్పదనే సత్యాన్ని గుర్తు చేసేందుకే జగన్నాథుడి విగ్రహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తారు. గర్భగుడిలోంచి విగ్రహాలను బయటకు తీసుకొచ్చి దహన క్రియలు చేస్తారు. ఒడిశా రాష్ట్రం మొత్తం ఉమ్మడిగా 11 రోజుల పాటూ మైల పాటిస్తుంది.


అధిక ఆషాడంలో మాత్రమే
పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్రకు ముందు జరిగే న‌వ క‌ళేబరోత్స‌వం కార్య‌క్ర‌మం ఏటా జరగదు. కేవ‌లం అధిక ఆషాఢ మాసం వ‌చ్చిన‌ప్పుడే ఈ వేడుకను నిర్వ‌హిస్తారు. చివ‌రిసారిగా 2015లో ఈ వేడుక జ‌ర‌గ్గా.. మ‌ళ్లీ 2035లో నిర్వ‌హిస్తారు. సాధార‌ణంగా ఈ న‌వ క‌ళేబరోత్స‌వం 8, 11, 19 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో జ‌రుగుతూ ఉంటుంది. గ‌తంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవ‌త్స‌రాల్లో ఈ వేడుక నిర్వ‌హించారు.


Also Read: పూరి జగన్నాథుడి విగ్రహాల్లో ఓ బ్రహ్మపదార్థం ఉంటుంది, అదేంటో తెలుసా!


అధిక ఆషాడంలోనే నవకళేబర ఉత్సవం ఎందుకు?
మహాభారతం పరంగా శ్రీ కృష్ణుడు నిర్యాణం ( అవతార పరిసమాప్తి) జరిగింది  జ్యేష్టమాసం చివర్లో. కానీ అధిక ఆషాడం వచ్చిన కొన్ని రోజుల తర్వాత అర్జునుడు చూశాడు. కృష్ణుడంటే అమితమైన ఇష్టం ఉండే అర్జునుడు ఆ శరీరం చూసి తీవ్రమైన వేదనలో మునిగిపోతాడు. ఆ తర్వాత తన సోదరులు అందరితో కలసి దహన సంస్కారాలు నిర్వహిస్తాడు. అందుకే అధిక ఆషాడ శుద్ధ పాడ్యమి రోజు దహన క్రియలు చేస్తారు. ఆ పదకొండురోజులు మైలు పాటిస్తారు. పదకొండు రోజుల తర్వాత శుద్ధి చేస్తారు. సరిగ్గా పన్నెండో రోజున సముద్రం ఒడ్డుకి కొట్టుకొచ్చిన దుంగలతో మళ్లీ విగ్రహాలు చెక్కించి గుడిలో పెడతారు(ప్రతిష్ఠించరు). ఇలా అధిక ఆషాడం వచ్చిన ప్రతిసారీ చేస్తారు. 


విగ్రహాలను ఎందుకు ప్రతిష్ఠించరు?
ఏ దేవాలయంలో అయినా గర్భగుడిలో దేవుడి విగ్రహాలు ప్రతిష్టిస్తారు కానీ పూరీ జగన్నాథుడి విగ్రహాలను ఎందుకు ప్రతిష్టించరనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే ఏ ఆలయంలో అయినా గర్భగుడిలో ఉన్న స్వామిని కదపరు..ఉత్సవ విగ్రహాలనే ఊరేగిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ప్రధాన విగ్రహాలనే ఓ చోట నుంచి మరో చోటుకి మార్చడం వల్ల వాటికి ఉండే తేజస్సు రానురాను తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా విగ్రహాల ప్రతిష్ఠ చేసేటప్పుడు వాటి కింద యంత్రం వేస్తారు, నిత్యం ఆరాధనోత్సవాలు,అభిషేకాలతో స్వామివారి తేజస్సు మరింత పెరుగుతుంది. కానీ ఈ విగ్రహాలను జనం మధ్యలోకి తీసుకెళ్లి తిరిగి తీసుకురావడం వల్ల వాటి తేజస్సు తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చక తప్పదనే సత్యాన్ని గుర్తు చేయడానికే పూరిలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల జీర్ణించిన విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం అనాదిగా వస్తోందని చెబుతారు. 


విగ్రహంలో బ్రహ్మ పదార్థం
విగ్ర‌హాలు చెక్క‌డం, రంగులు అద్ద‌డం పూర్త‌య్యాక యాత్ర‌కు ముందు రోజు అస‌లు ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తారు. పాత విగ్రహం నుంచి తీసిన బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలో ఉంచుతారు. అసలు ఆ బ్ర‌హ్మ ప‌దార్థం అంటే ఏంటి, అదెలా ఉంటుంది  అన్నది ఎవ‌రికీ తెలియ‌దు. దాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఆ ఆల‌యంలోని పండితులు కూడా చూడ‌లేదు. ఈ బ్ర‌హ్మ ప‌దార్థం మార్పిడి ప్ర‌క్రియ చాలా ర‌హ‌స్యంగా, అత్యంత నియ‌మ‌ నిష్ట‌ల‌తో జ‌రుగుతుంది. పూరీ జ‌గ‌న్నాథుని శ్రీ‌మందిరంలోనే ఈ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డానికి ముందు ఆలయాన్ని మొత్తం ఎవ‌రూ లేకుండా జ‌ల్లెడ ప‌డ‌తారు. బ్ర‌హ్మ ప‌దార్థాన్ని మార్చే న‌లుగురు దైతాధిప‌తుల క‌ళ్ల‌కు 7 పొర‌లుగా వ‌స్త్రాల‌ను క‌డతారు. ఆపై గర్భగుడిని చీకటిగా చేస్తారు, పూరీ పట్టణం మొత్తం కరెంట్ కట్ చేస్తారు. పాత విగ్రహాల నుంచి తీసిన బ్రహ్మపదార్థాన్ని కొత్త విగ్రహాల్లో ప్రవేశ పెట్టిన తర్వాత జగన్నాథుడి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 


Also Read: జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!


మూలవిరాట్టు ప్రత్యేకత
సాధారణంగా ఏ ఆలయంలోనైనా భగవంతుడు భార్యాసమేతుడై కొలువుతీరి ఉంటాడు. పూరీ క్షేత్రంలో జగన్నాథుడు మాత్రం తన సోదరుడు 'బలభద్రుడు 'తోనూ, సోదరి  'సుభద్ర 'తోనూ కొలువుతీరి సేవలందుకుంటాడు.