అడవిలో కొలువైన అమ్మవారు. రాళ్లు, ముళ్లు దాటి ప్రయాణం చేయాల్సి వచ్చినా అస్సలు అలసటే అనిపించదంటారు భక్తులు. ఎందుకంటే మనసులో ఎంతో భారంతో, కష్టంతో అక్కడకు వెళ్లి అమ్మను దర్శించుకుని వచ్చాక ఆ సమస్యలు వాటంతట అవే తీరిపోతాయో లేదంటే వాటిని ఎదుర్కొనే శక్తే వస్తుందో కానీ ప్రశాంతతను మాత్రం పొందుతారు. అందుకే అమ్మవారిని ఇష్టకామేశ్వరి అని పిలుస్తారు. శ్రీశైలం మల్లన్నకు చేరువలో కొలువైంది ఈ అమ్మవారు.
Also Read: దిండుపై కూర్చోవడం, లేవగానే అద్దం చూసుకోవడం లాంటివి చేస్తున్నారా!
శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం ఉంది. దట్టమైన నల్లమల అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు భక్తులు. పక్షుల కిలకిలరావాలు, జలపాతాల సవ్వడి మధ్య సాగే ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తుంది. రెండు చేతులలో తామరపూలు, మిగిలిన రెండు చేతుల్లో జపమాల - శివలింగం ధరించి కనిపిస్తుంది. విష్ణుదర్మోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల, శివలింగాన్ని ధరించి ఉంటుందని వర్ణించబారు..అందుకే..ఇష్టకామేశ్వరిని పార్వతీ దేవి స్వరూపంగా కొలుస్తారు. ఇష్టకామేశ్వరి నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి మనసులో కష్టాన్ని, కోర్కెను చెప్పుకుంటే 41 రోజుల్లో నెరవేరుతుందట. ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టుపెట్టినప్పుడు విగ్రహం మామూలుగానే ఉన్నా... నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుందని చెబుతారు ఇష్టకామేశ్వరిని దర్శించుకున్న భక్తులు. ఇదే ఇక్కడి ప్రత్యేకత.
Also Read: ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుడుతుంది, మీకు ధైర్యం ఉందా
చిన్నగుహలో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే పాకుతూ వెళ్లాలి. గర్భగుడిలో కేవలం నలుగురు కూర్చునేందుకు మాత్రమే వీలుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు అధికసంఖ్యలో ఇక్కడకి వస్తుంటారు. ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరుగన్నం, పొంగలిని నివేదనగా సమర్పిస్తారు. ఈ ఆలయం గోపురం మెట్లరూపంలో కోలగా కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఎదురుగా భిన్నమైన సిద్ధుని విగ్రహం, మహిషాసురమర్ధని విగ్రహం, కాపాలికుని విగ్రహం కనిపిస్తాయి. ఒకప్పుడు సిద్దులకు తర్వాత కాపాలికులకు ఈ ఆలయం కేంద్రంగా ఉండేదని భక్తులు చెబుతుంటారు. ఇక ఇక్కడ ఉత్తర వాహినిగా ఓ వాగు నిరంతరం ప్రవహిస్తుంటుంది. శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామి, భ్రమరాంబదేవి వెలిసిన సమయంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా వెలిసిందని చెబుతారు. శ్రీశైలం వెళ్లే భక్తులు చాలామంది ఈ మహిమాన్విత ప్రదేశాన్ని దర్శించుకునే వెళుతుంటారు. ఆలయం అడవిలో ఉండడంతో సాయంత్రం 5 గంటలు దాటితే ఎవ్వరినీ అనుమతించరు...ఈ ఆలయానికి చెంచులే పూజారులు...
Also Read: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది