Southwest Monsoon : నైరుతు రుతువనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ వారం ఏపీని రుతుపవనాలు తాకనున్నాయి. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, మరోవైపు కొన్నిచోట్ల 2 నుంచి 4 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది.  పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం వరకు సముద్రమట్టంపై 0.9 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని చోట్ల, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తెల్లవారుజామున ఆకాశం మేఘావృతమై కనిపిస్తున్నా.. మధ్యాహ్నానికి వేడిగా మారుతోంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ 40, 41 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో..
కోస్తాంధ్ర జిల్లాల్లో మరో మూడు రోజులు ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. యానాంలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురువనున్నాయి. విశాఖపట్నం నగరంతో పాటుగా అనకాపల్లి, సబ్బవరం, నర్సీపట్నంలలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సింహాచలం - అనకాపల్లి - వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరో గంట వరకు భారీ వర్షాలు కొనసాగుతాయి. ఎండకాలంలో ఒడిషాలో ఎక్కడైనా ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడ్డా, అది నేరుగా శ్రీకాకుళం జిల్లాను తాకుతుంది. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా మీదుగా విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లోకి భారీ పిడుగులు, వర్షాలు విస్తరిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల మేర నమోదు కావడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.



దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో జూన్ 6 వరకు తేలికపాటి వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు విజయవాడ లాంటి ప్రాంతాల్లో 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు, వడగాలులు వీస్తాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పొట్టి శ్రీరాములు నెల్లూరులతో పాటు రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి  కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాలి జల్లులు కురిశాయి. రుతుపవనాలు రాయలసీమను జూన్ 6 లేదా 7 న తాకుతాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. విజయవాడ, హైదరాబాద్, ఉభయ గోదావరి మీదుగా జూన్ 11 న తాకే ఛాన్స్ ఉంది. అప్పుడు ఉష్ణోగ్రత్త తగ్గుముఖం పడతాయి.






తెలంగాణలో వడగాల్పులు..
తెలంగాణలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచనుండగా, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్కడా వడ గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు.