ఇండియాలోని ఆలయాలు.. ఈజిప్టు పిరమిడ్ కంటే గొప్పవా అని ఓ హిందీ విలేఖరి అడిగిన ప్రశ్నకు హీరో విక్రమ్ దిమ్మతిరిగే జవాబు ఇచ్చారు. ముంబయిలోని విలేకరుల సమావేశంలో ఆయన ఇండియాలోని ఆలయాల గొప్పతనం గురించి చెప్పారు. ముందుగా భారత చరిత్ర గురించి తెలుసుకోవాలని సున్నితంగా చురకలు అంటారు. ఈ సందర్భంగా ఆయన కనీసం నీడ కూడా నేలపై పడని ఓ ఆలయం గురించి చెప్పారు. మరి, అదేంటో చూసేద్దామా!
విక్రమ్ చెప్పిన ఆ ఆలయం మరేదో కాదు.. తమిళనాడులోని తంజావూరులో గల బృహదీశ్వరాలయం. తంజావురు ను తమిళనాడు కల్చరల్ హబ్ గా చెప్పుకోవచ్చు. ఈ పట్టణాన్ని చాలా రాజ వంశాలు పాలించాయి. శతాబ్ధాలుగా ఈ పట్టణం కళలకు, భారతీయ వాస్తు శాస్త్రీయతకు, హిందు సంస్కృతికి ప్రతీకగా నిలిచింది.
తంజావూరు పట్టణంలోని బృహదీశ్వరాలయం భారతీయ పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయ సందర్శనకు రోజూ వేలాదిగా పర్యాటకులు తంజావూరు వస్తుంటారు. మన దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఈ పురాతన ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అక్కడికి వెళ్లి ఆలయాన్ని సందర్శిస్తే కానీ దీని వైశిష్ట్యం అర్థం కాదు. బృహదీశ్వర ఆలయంలోని విశేషాలలో కొన్నింటిని గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.
ఈ దేవాలయం వైశాల్యంలో చాలా పెద్దది. ఇంత పెద్ద ఆలయానికి నీడలేని దేవాలయంగా ప్రతీతి. రోజులో ఏ సమయంలోనూ ఈ దేవాలయం నీడ నేల మీద పడదు. అంతే కాదు ఈ ఆలయానికి ఎన్నో రహస్య మార్గాలు ఉన్నాయి. బృహదీశ్వర ఆలయంలోని మూల విరాట్టు శివుడు. రామేశ్వరం, మధుర వంటి ఇతర దక్షిణ బారత ఆలయాల మాదిరిగానే ఇతర దేవతల ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి. వీటిలో నంది, పార్వతి, కార్తికేయ, గణేశ, సభాపతి, దక్షిణామూర్తి, చండేశ్వర, వారాహి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. యునెస్కో ఈ ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేర్చింది. ఈ ప్రాంతంలోని ఇతర ఆలయాలన్నింటిని కలుపుకొని ‘‘ది గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్’’ గా పిలుస్తారు. దీని గురించి మీరు త్వరలో విడుదల కానున్న ‘పొన్నియిన్ సెల్వన్’లో మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు.
దీని నిర్మాణం 11 శతాబ్ధంలో జరిగినట్టుగా చెబుతారు. అంటే ఇది దాదాపుగా వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం. మధుర మీనాక్షీ ఆలంయం కంటే కూడా పురాతనమైనదిగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది ద్రవిడ వాస్తు, శిల్ప కళా నైపుణ్యానికి నిలువుటద్దం వంటింది. ఎత్తైన గోపురము, విశాలమైన కోటను తలపించే ప్రాంగణం, పెద్ద ప్రధాన ఆలయం, దాని చుట్టూ నిర్మించిన అనేక మందిరాలు, శాసనాలతొ చాలా భారీ కట్టడం. ఈ కట్టడంలో ఉన్న చెక్కనాల అలంకరణ వాస్తు శిల్పం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ఈ ఆలయానికి మూడు ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాటిలో రెండు భారీ నిర్మాణాలు. వీటి గుండా ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఆలయం చుట్టూ ఉన్న భారీ ప్రహరీ కోట గోడలను తలపింప జేస్తాయి. రెండో ద్వారాన్ని కేరళాంతకన్ తిరువాల్ అని, మూడో ద్వారాన్ని రాజరాజన్ తిరువాసల్ అని పిలుస్తారు. కేరళాంతకన్ తిరువాల్ అనే ద్వారాన్ని రాజ రాజ చోళుని విజయ స్మారకంగా నిర్మించారు. ఈ ద్వారం శివుడు, పార్వతి, గణేశుడు, విష్ణుమూర్తి సహా అనేక హిందూ దేవతల చిన్నచిన్న మూర్తులతో అలంకరించబడి ఉంటుంది. ఈ ద్వారం దాటగానే చెప్పులు విడిచి నడవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చే ద్వారం మరింత సంక్లిష్ట చెక్కడాలతో ఉంటుంది. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలక రాతి విగ్రహాలు పహరాగా ఉంటాయి. ఇక్కడి శిల్పాలలో అనేక పురాణ గాథలు కథా వస్తువులుగా కనిపిస్తాయి.
ఈ ద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే కనిపించేది పెద్ద నంది విగ్రహం. ఇది దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద ఏక శిలా నంది విగ్రహం. నంది వెనుకగా కొద్ది దూరంలో ప్రాంగణం మధ్యలో కుడి భాగాన ప్రధాన ఆలయం ఉంటుంది. ఈ గర్భ గుడిలో శివ, శ్రీ విమాన మూర్తులు ఉంటాయి. ఈ ప్రధాన ఆలయ గోడలపై శివ పార్వతుల వివిధ రూపాలు శిల్పాలుగా ఉంటాయి.
⦿ తూర్పు గోడ మీద నిలబడి ఉన్న లింగోద్భవ శివుడు, పాశుపత మూర్తి ఉంటారు. అర్థ మండపం వైపు దారికి అనుకొని రెండు ద్వార పాలక మూర్తులు ఉంటాయి.
⦿ దక్షిణ గోడ మీద భిక్షాటన, వీరభద్ర, ధక్షిణామూర్తి, కాలంతక నటరాజ మూర్తులతోపాటు రెండు ద్వారపాలక మూర్తులు కూడా ఉంటాయి
⦿ పశ్చిమ గోడ మీద హరిహర (సగం శివుడు, సగం విష్ణువు), లింగోద్భవ, ప్రభావళి లేని చంద్రశేఖరుడు, ప్రభావళితో కూడిన చంద్రశేఖరుడితో పాటు రెండు ద్వారపాలక మూర్తులు ఉంటాయి.
⦿ ఉత్తర గోడ మీద అర్థనారీశ్వరుడు, గంగాధరుడు, పాశుపత మూర్తి, శివలింగాన మూర్తితో పాటు రెండు ద్వార పాలక మూర్తులు ఉంటాయి.
⦿ గుడి లోపల పెద్ద శివలింగం ఉంటుంది. బృహదీశ్వర దేవాలయం ప్రాంగణం పొడవునా అనేక దేవతా క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో కుండ్య చిత్రాలు, పేయింటింగ్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు మరాఠా రాజు సరభోజి నిర్మించిన నూట ఎనిమిది శివలింగాలు కూడా ఉన్నాయి.
⦿ ఈ ఆలయం నిర్మాణం చాలా సార్లు జరిగింది. ఎన్నో సార్లు దాడులకు గురయింది, మరెన్నో సార్లు పునరుద్ధరించబడిందని చెప్పవచ్చు.
⦿ చోళులు, మరాఠాలు, నాయకులు రకరకాల రాజవంశీయులు ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. అందుకే రకరకాల వాస్తు శిల్పం ఇక్కడ కనిపిస్తుంది.
ఈ ఆలయం ‘నీడ’ ఓ అద్భుతం
ఈ ఆలయ నిర్మాణంలో అనేక వాస్తు రహస్యాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అందులో ముఖ్యమైంది, ఈ ఆలయం నీడ. ఈ ఆలయపు నీడ నేలమీద పడనే పడదని అంటారు. ఇందులో మహిమలేవీ లేవు. కేవలం నిర్మాణంలో వాడిన టెక్నిక్ అటువంటింది. దీన్ని డిజైన్ చేసిన నిపుణుల నైపుణ్యం అటువంటిది. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ల అరేంజ్మెంట్ ఆలయ నీడ నేలమీద పడదేమో అనిపించేలా బ్రమింపజేస్తుంది.
ఈ ఆలయ నిర్మాణ సమయంలో దీన్ని నిర్మిస్తున్న రాజరాజ చోళుడు ఈ ఆలయం నేల కూలే ప్రమాదం ఉందా అని ప్రశ్నించినపుడు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ప్రధాన శిల్పి ఆలయం కాదు మహారాజ దీని నీడ కూడా నేలమీద పడడం సాధ్యం కాదు అని సమాధానం చెప్పినట్టు చెప్పుకుంటారు.
ఈ ఆలయ నిర్మాణంలో రాళ్లను జోడించడానికి మట్టి, సున్నం, సిమెంట్ వంటి ఏ బైండింగ్ ఏజెంట్ ను వాడలేదు. ఇంత పెద్ద నిర్మాణాన్ని కేవలం రాళ్లను ఉపయోగించి మాత్రమే నిర్మించడం ఈ కట్టడం ప్రత్యేకత. ఆలయ అలంకరణలో ఉపయోగించిన రంగులు కూడా సహజమైనవి. పూవ్వులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, ఆకుల వంటి సహజ సిద్ద ముడి పదార్థాలను ఉఫయోగించి తయారుచేసిన రంగులతో ఇక్కడి గోడల మీద చిత్రాలు గీశారు.
బృహదీశ్వర ఆలయం రెండు సంస్కృత పదాల కూర్పు. బృహద్ అంటే పెద్ద, భారీ లేదా విశాలమైన అని అర్థం. ఈశ్వర అంటే దేవుడు లేదా ప్రభువు అని అర్థం. నిజానికి ఇది ఈ ఆలయపు కొత్త పేరు. ఈ పేరును మరాఠాలు పెట్టుకున్నారు. నిజానికి దీని మొట్ట మొదటి పేరు రాజరాజేశ్వర దేవాలయం. రాజరాజ చోళుడు దీన్ని నిర్మించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. అక్కడ కనిపించిన శాసనాలను బట్టి పెరియ ఉదయ నాయనార్ అనేది అక్కడి ఆలయ దేవత పేరు. అతి పెద్ద మూల విరాట్టు ఉండడం వల్ల ఈ ఆలయాన్ని పెద్ద ఆలయంగా వ్యవహరిస్తారు.
ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల పురాతనమైనప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అంత గొప్ప ఆర్కిటెక్చర్ నైపుణ్యం మన దేశంలో ఆరోజుల్లోనే అందుబాటులో ఉంది. గుడి పునాధి లోని నేలమాళిగ ఇసుకతో నిండి ఉంటుంది. దాని మీద ఏర్పాటు చేసిన తెప్పవంటి నిర్మాణం మీద మొత్తం కట్టడం నిలబడి ఉంటుంది. భారీ భూకంపాలు సంభవించినా కూడా కలిగే ప్రకంపనాలు ఈ కట్టడానికి నష్టం కలిగించలేవు.
బృహదీశ్వర ఆలయ నిర్మాణంలో వాడిన టెక్నిక్స్ ఒక్కోటి చూస్తూ పోతుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ ఆలయా ప్రాంగణానికి చెందిన బయటి గోడలో ఫిరంగి పట్టేంత విశాలంగా ఉంటాయి. మరాఠాల కాలంలో ఈ ఆలయం కోటగా కూడా ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి. బయటి ప్రహరిలో ఉన్న సన్నని దారి గుండా ప్రయాణం చేస్తే తిరిగి ఆలయం లోపలికి మరో ద్వారం ద్వారా ప్రవేశించే వీలు ఉంటుంది.
ఈ ఆలయం గురించి మరికొన్ని విశేషాలు
⦿ బృహదీశ్వర ఆలయం వెలుపలి గోడలపై ఎనభై ఒక్క రకాల భరతనాట్య భంగిమల శిల్పాలు ఉంటాయి. భరతనాట్యం తమిళ సంప్రదాయ నృత్యం అనేది మనందరికి తెలిసిన విషయమే
⦿ గర్భ గుడిలోని మూల విరాట్టు శివలింగం మనదేశంలోనే అతి పెద్ద లింగ రూపం. దీని బరువు 20 టన్నులు
⦿ ఈ ఆలయానికి అనేక రహస్య సొరంగ మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలు ఈ ప్రాంతంలోని ఇతర ముఖ్యమైన దేవాలయాలను అనుసంధానం చేస్తాయి.
⦿ ఆలయ ప్రవేశంలో అతి పెద్ద ఏకశిలా నంది ఉంటుంది. ఇది కూడా భారతదేశంలోనే అతి పెద్ద నంది విగ్రహం.
⦿ గ్రానైట్ రాయి వాడి చెక్కిన ఆలయ గోపురం బరువు సుమారు 80 టన్నులు ఇంతటి భారీ నిర్మాణాన్ని ఇన్ని సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉండడం భారతీయ ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటి.
⦿ ఇక్కడ ఉన్న ఇత్తడి నటరాజ మూర్తి ఈ ప్రాంతపు మొదటి శివ తాండవ మూర్తిగా చెప్పుకుంటారు.
⦿ ఈ ఆలయం ప్రత్యేకతల్లో ఒకటి ఇక్కడి ప్రాంగణ ద్వారాలు ప్రధాన గోపురం కంటే ఎత్తుగా నిర్మితమై ఉంటాయి. దక్షిణ భారత ఆలయనిర్మాణ శైలి కి భిన్నమైందని చెప్పవచ్చు.
ఈ ఆలయం సందర్శనకు వెళ్లే వారికి కొన్ని చిట్కాలు
⦿ ఈ ఆలయ వైశిష్ట్యాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే ఇక్కడ కనీసం ఒక గంట పాటైనా సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలి.
⦿ ఉదయాన్నే లేదా సాయంత్రం పూట ఈ ఆలయ సందర్శనకు వెళ్లడం మంచిది. సంవత్సరం పొడవునా తంజావూరు చాలా వేడిగా ఉంటుంది. మధ్యాహ్నపు ఎండ తట్టుకోవడం కష్టం.
⦿ అంతేకాదు సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వర్షం ఎప్పుడు కురిసేది మనం ఊహించడం కష్టం. కాబట్టి ఒక గొడుగు వెంట ఉంచుకోవడం మంచిది.
Also Read: దసరాల్లో పిల్లలకు పూజ చేస్తుంటారు కదా - ఏ వయసు పిల్లల్ని పూజిస్తే ఎలాంటి ఫలితం!
Also Read: శరన్నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకూ అమ్మవారికి రోజుకో రంగు ప్రత్యేకం