Dussehra 2022:ఈ ఏడాది సెప్టెంబరు 26 సోమవారం నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి.. అక్టోబరు 5 బుధవారం దసరా. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. మనలో ఉండే చెడుని నాశనం చేయాలని మొదటి మూడు రోజులు, సంపదను ప్రసాదించాలని తర్వాతి మూడు రోజులు, జ్ఞానాన్నివ్వాలని చివరి మూడు రోజులు ప్రార్థిస్తారు. అయితే ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో రంగు వస్త్రం సమర్పిస్తారు.


ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
మొదటి రోజు  శ్రీ స్వర్ణకవచలాంకృత దుర్గాదేవిగా  అలంకరిస్తారు. ఈ రోజున అమ్మను ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎరుపు రంగు ఉత్తేజానికి సంకేతం. 


ఆశ్వయుజశుద్ధ విదియ
రెండో రోజు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. ఈ రోజు బంగారు వర్ణ వస్త్రంతో అలంకరిస్తారు. బంగారు రంగు చెడు శక్తులను తొలగిస్తుందని విశ్వాసం. 


Also Read:  ఒక్కో దేవుడికి ఒక్కో ఆయుధం - కానీ పరాశక్తి చేతిలో అవన్నీ ఉంటాయ్ ఎందుకలా!
ఆశ్వయుజ శుద్ధ తదియ
మూడో రోజు అమ్మవారి అవతారం గాయత్రీదేవి.  ఈ అమ్మవారిని జ్ఞానానికి ప్రతిరూపంగా చెబుతారు.  ఈ రోజు అమ్మవారిని పసుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఆటంకాలు తొలగించి సకల శుభాలనిచ్చే రంగు ఇది. కొబ్బరి అన్నాన్ని నివేదిస్తారు. కొబ్బరిని పూర్ణఫలం అంటారు..అందుకే పూర్ణ ఫలితం దక్కాలని కొబ్బరి అన్న నివేదిస్తారు. 


ఆశ్వయుజ శుద్ధ చవితి
ఈరోజు  శ్రీ లలితా దేవిగా దర్శనమిస్తుంది అమ్మవారు. లిలితా అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు.


ఆశ్వయుజ శుద్ధ పంచమి
ఈ రోజున శుద్ధ పంచమి రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శమిస్తుందిృ. గంధం రంగు వస్త్రంతో అలంకరిస్తారు.


ఆశ్వయుజ శుద్ధ షష్టి
ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాలక్ష్మీ దేవిని  గులాబీరంగు వస్త్రంతో అలంకరిస్తారు


Also Read: శరన్నవరాత్రుల్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివి!
ఆశ్వయుజ శుద్ధ సప్తమి
శ్రీ సరస్వతీ దేవి అలంకారం: మూల నక్షత్రం రోజున సరస్వతిదేవిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. హంస వాహనంపై కొలువై తెల్లని వస్త్రంతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం.  


ఆశ్వయుజ శుద్ధ అష్టమి
ఈ రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తుంది.  దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. ఈరోజు అమ్మవారిని  ఆకుపచ్చ రంగు వస్త్రంతో అలంకరించి...చక్కెరపొంగలి వైవేద్యంగా సమర్పిస్తారు.


ఆశ్వయుజ శుద్ధ నవమి
మహర్నవమి రోజు మహిషాసురమర్ధిని అలంకారంలో కనిపించే అమ్మవారికి  నీలం రంగు వస్త్రంతో అలంకరిస్తారు. నీలం రంగు యుద్ధానికి సంకేతం అని..ఈ రంగు వస్త్రం ధరించి మహిషాసురుడిని అమ్మవారు సంహరించారని చెబుతారు. ఈ రోజున శుభానికిసంకేతంగా పాయసం నివేదిస్తారు. 


ఆశ్వయుజ శుద్ధ దశమి
ఇదే విజయదశమి. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఇది శుభానికి సంకేతం. గారెలు, పాయసం అన్ని అమ్మవారికి పెట్టవచ్చు.


ఈ రంగు వస్త్రమే తప్పనిసరిగా సమర్పించాలని లేదంటారు పండితులు. ప్రాంతాన్ని బట్టి పద్ధతులు మారుతాయి.. అనుసరించే విధానాలు మారుతాయి. ఏదిఏమైనా భక్తి ప్రధానం...