Agri Gold Supreme Court :    అగ్రిగోల్డ్ కేసులో తెలంగాణకు చెందిన డిపాజిటర్లు కూడా ఏపీలోని ఏలూరులో ఈ కేసు కోసం ఏర్పాటు చేసిన కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది.  ఏలూరు కోర్టులో ఈ కేసు పరిష్కారం కాని పక్షంలోనే హైకోర్టుకు గానీ, సుప్రీంకోర్టుకు గానీ వెళ్లేందుకు అవకాశం ఉంటుందని ధర్మాసనం తెలిపింది.  ఈ మేరకు తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.  అగ్రిగోల్డ్ సంస్థ ఏకంగా 32 లక్షల మంది డిపాజిట్లను నట్టేట ముంచిందని, ఈ వ్యవహారంలో ఆ సంస్థ రూ.6 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని సేకరించిందని.. తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు.  అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన కొన్ని ఆస్తులను వేలం వేయడం ద్వారా తెలంగాణ హైకోర్టు కేవలం రూ.50 కోట్లే రాబట్టిందన్నారు. అయితే   అయితే హైకోర్టు తీర్పును రద్దు చేయడం గానీ, మార్చడం గానీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.


ఏలూరు కోర్టుకు కేసులు బదిలీ చేసిన తెలంగాణ హైకోర్టు 


గతంలో ఈ కేసులపై విచారణ తెలంగాణ హైకోర్టులో జరిగేది. అగ్రిగోల్డ్ తో పాటు అక్షయ గోల్డ్ మోసాలపై పిటిషన్ల విచారణ కూడా జరిగేది. అయితే  అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల వివాదాలన్నీ ఫిబ్రవరిలో  ఏపీలోని ఏలూరు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు. అగ్రిగోల్డ్ వేలం ద్వారా వచ్చిన రూ.50 కోట్లు కూడా ఏలూరు కోర్టుకు బదిలీ చేసింది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ వివాదాలు ఏడేళ్లుగా హైకోర్టులో కొనసాగుతున్నాయి. విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్లు, బ్యాంకుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టును ఆదేశించింది. అప్పట్నుంచి ఏలూరు కోర్టులోనే విచారమ జరుగుతోంది. 


నాలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులు


అగ్రిగోల్డ్ డిపాజిటర్లు నాలుగు రాష్ట్రాల్లో ఉన్నారు.  న్యాయం చేయాలని  ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, ఒడిస్సా నాలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు ఆందోళనలు చేస్తున్నారు.  20015లో  మూతపడిన అగ్రిగోల్డ్‌ కంపెనీ వల్ల 32 లక్షల మంది కష్టమర్లు, ఏజెంట్లు ఆర్థికంగా, పూర్తిగా చితికిపోయారు. 32 లక్షల మంది బాధితులు ఉన్నట్లుగా చెబుతున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఏపీ, తెలంగాణల్లోనే ఎక్కువగా ఉన్నాయి.  ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే  ఉన్న ఆస్తులను  అమ్మితే వేల కోట్లు వస్తాయన్న ప్రచారం ఉంది.  హైదరబాద్ తో పాటుగా మహాబూబ్ నగర్ లో అగ్రి గోల్డ్ కు పెద్ద మొత్తంలో ఆస్తులున్నాయి. వాటిని అమ్మి తమకు ఇవ్వాలని అగ్రిగోల్డ్ బాధితులు కోరుతున్నారు. 


ఇప్పటికీ తేరుకోని అగ్రిగోల్డ్ బాధితులు


చాలా కాలం పాటు నమ్మకంగా ప్రజల వద్ద డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్ ఒక్క సారిగా మూతపడటంతో  డబ్బులు దాచుకున్న లక్షల మంది నష్టపోయారు.ఏజెంట్లు కూడా కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో కొంత మందికి గత ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది. రూ. పదివేలలోపు డిపాజిట్లు ఉన్న కొంత మందికి నగదు చెల్లించింది.  ఇంకా లక్షల మంది బాధితులు ఉండిపోయారు.