Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఎట్టకేలకు ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని గహ్లోత్ స్పష్టం చేశారు.
రాహుల్ ఒప్పుకోలేదు
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని తాను చాలా సార్లు రాహుల్ గాంధీని కోరానని, అయితే ఆయన తన విజ్ఞప్తిని తిరస్కరించారని గహ్లోత్ అన్నారు.
రాహుల్ సలహా
'భారత్ జోడో యాత్ర'లో ఉన్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అత్యున్నత పదవికి ఎవరు పోటీ చేసినా అది కేవలం సంస్థాగత పదవి కాదని.. చారిత్రక స్థానమని అర్థం చేసుకోవాలన్నారు. ఆ పదవిలో ఎవరు ఉన్నా బాధ్యతగా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని రాహుల్ అన్నారు.
ఎర్నాకుళంలో మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ చీఫ్‌కి ఇవ్వబోయే ఒక సలహా గురించి మీడియా అడిగినప్పుడు.. ఇలా అన్నారు.
" కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే వ్యక్తులు దేశ నిర్దిష్ట దృక్పథాన్ని ప్రతిబింబించే చారిత్రక స్థానాన్ని తీసుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి వెనుక ఓ చరిత్ర ఉంది. మీరు యావత్ దేశ ఆలోచనలు, నమ్మకం, విశ్వాసాలకు ప్రాతినిథ్యం వహించవలసి ఉంటుంది. "