NTR Health University Name Issue: ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారంపై ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. పేరు మార్పుపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బతికుండగా దివంగత నేత ఎన్టీఆర్ ని హింసించారని, చివరకు ఆయన పార్టీ లాక్కొని, ఆయన మరణానికి కూడా కారణం అయ్యారని విమర్శించారు. ఇప్పుడు అలాంటి వారే ఆయన పేరు కోసం పాకులాడుతున్నారని వ్యాఖ్యానించారు అనిల్. అసలు టీడీపీ నేతలకు ఎన్టీఆర్ పేరెత్తే అర్హత ఏమాత్రం లేదని చెప్పారు. 


చంద్రన్న బీమా ఎందుకు..?
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలన్నిటికీ చంద్రన్న పేరు పెట్టుకున్నారని, చంద్రన్న బీమా, చంద్రన్న తోఫా, చంద్రన్న కానుక అంటూ హడావిడి చేశారని, అప్పుడు ఎన్టీఆర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు అనిల్. అన్న క్యాంటీన్ అని పేరు పెట్టారు కానీ, ఎవరా అన్న అనేది రాష్ట్రంలో ఎవరికి తెలుసని అన్నారు. 


ఎన్టీఆర్ అంటే మాకెంతో గౌరవం..
ఎన్టీఆర్ అంటే తమకెంతో గౌరవం అని అంటున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్. తమ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. తామెప్పుడూ ఎన్టీఆర్ ని గౌరవిస్తామని, అందుకే తమ పార్టీ హయాంలో జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టామని గుర్తు చేశారు. టీడీపీ నేతలకే ఎన్టీఆర్ అంటే గౌరవం లేదన్నారు. 104, 108 లను ఏర్పాటు చేసి, ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన వైఎస్ఆర్ పేరుని టీడీపీ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ నుంచి ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు అనిల్. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా ఎందుకు మార్చారని అడిగారు. ఇప్పుడు వారంతా హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఎందుకు గింజుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి అనిల్. 


జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్.. అనిల్ సెటైర్స్.. 
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పేరు మార్పుతో ఎన్టీఆర్ గొప్పతనం తగ్గిపోదని, అదే సమయంలో వైఎస్ఆర్ గొప్పతనం పెరగబోదంటూ జూనియర్ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి అనిల్ ఘాటుగా స్పందించారు. తాతపై చెప్పులు వేయించినప్పుడు, ఆయనకి వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఏం చేస్తున్నారని నిలదీశారు. పోనీ అప్పుడు ఆ హీరో (ఎన్టీఆర్) చిన్నపిల్లోడైతే.. ఇప్పుడు పెద్దోడయ్యాడు కదా, పార్టీని నారావారి చేతుల్లోనుంచి లాగేసుకుని, నందమూరి వారి చేతుల్లో ఉంచుకోవచ్చుకదా అని ప్రశ్నించారు.


ముందు తాత కోసం ఆయన తొడకొట్టాలని, సౌండ్ లేకుండా ట్వీట్లు ఎందుకని మండిపడ్డారు. అయితే అనిల్ ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదు. ఆయన మనవళ్లు, ట్వీట్లు.. అంటూ పరోక్షంగా తారక్ పై మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు పలికే అర్హత టీడీపీ నాయకులకు లేదన్నారు. ఎన్టీఆర్ కి తామెప్పుడూ గౌరవం ఇస్తామని చెప్పారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పని నోళ్లు, ఇప్పుడు హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చగానే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాయని మండిపడ్డారు అనిల్. 


అనిల్ కౌంటర్ పై ఇంకా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్ట్ కాలేదు. రియాక్ట్ అయితే ఇది మరో వార్ లా మారే అవకాశముంది. సోషల్ మీడియాలో వైరీసీ వర్సెస్ టీడీపీ బదులు, వైసీపీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనేలా సీన్ మారిపోతుంది.