ఇదో విచిత్రమైన ప్రేమకథ. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయానన్న బాధతో ఉన్న భర్త కోర్కెను తీర్చింది ఆ భార్య. ఆమెది ఆదర్శం అనాలో, లేక అనాలోచితంగా చేసిన పిచ్చి పని అనాలో తెలియదు. కానీ ఆ ముగ్గురు మాత్రం ఇప్పుడు హ్యాపీగా ఉంటామంటున్నారు. తమ మధ్య మనస్పర్థలేవీ లేవంటున్నారు. ఇంతకీ ఏంటా కథ..? ఆ ఇద్దరు ఎవరు, వారిలోకి వచ్చి చేరిన మూడో మనిషి ఎవరు..? మీరే చదవండి.
నెల్లూరు జిల్లా డక్కిలి అంబేద్కర్ నగర్ కు చెందిన కల్యాణ్ కు ఇటీవలే విమలతో వివాహం అయింది. వారిద్దరూ టిక్ టాక్ లో మంచి ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఇద్దరూ బాగా టిక్ టాక్ లు చేసేవారు. ఇప్పుడది బ్యాన్ కావడంతో ఇతర సోషల్ మీడియా యాప్ లలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే పెళ్లి తర్వాత భర్త కాస్త మూడీగా ఉండటం గమనించింది విమల. కారణం అడిగితే చెప్పేవాడు కాదు, కానీ ఒకరోజు నిత్యశ్రీ ఎంట్రీతో విమలకు సీన్ అర్థమైంది.
ఎవరీ నిత్యశ్రీ..?
కల్యాణ్ ప్రేయసి నిత్యశ్రీ. నిత్యశ్రీ కూడా టిక్ టాక్ తో పాపులర్. అప్పట్లో టిక్ టాక్ తోనే వీరి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల కలవడం కుదర్లేదు. ఫోన్ కాంటాక్ట్ కూడా తెగిపోయింది. చివరకు ఆమెను మరచిపోయి విమలను పెళ్లి చేసుకున్నాడు కల్యాణ్. కాపురం చేస్తున్నాడు. సడన్ గా ఇప్పుడు నిత్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. మేటర్ నేరుగా విమలతోనే చెప్పింది. తామిద్దరం గతంలో ప్రేమించుకున్నామని, ఆయన్ను వదిలి ఉండలేనని ఏడ్చేసింది. ఎలాగైనా తామిద్దర్ని ఒకటి చేయాలని వేడుకుంది.
ఇద్దరెందుకు.. ముగ్గురం కలిసే ఉందాం..
ఇక్కడ విమల రియాక్షన్ విచిత్రంగా ఉంది. తన భర్త కల్యాణ్ కి ఆయన ప్రేయసి నిత్యశ్రీని ఇచ్చి పెళ్లి చేసేందుకు విమల రెడీ అయింది అయితే తాను కూడా వారితోనే కలసి ఉంటానంది. ఈ ప్రపోజల్ నిత్యశ్రీకి నచ్చింది. కల్యాణ్ కూడా డబుల్ బొనాంజా కావాలనే అనుకున్నాడు. మొదటి పెళ్లాం చేతుల మీదుగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ముగ్గురూ కలిసి హ్యాపీగా ఉంటామంటున్నారు. పెళ్లి ఏర్పాట్లన్నీ మొదటి భార్యే చూసుకోవడం ఇక్కడ విశేషం. తన భర్త రెండో పెళ్లికి ఆమె పెళ్లి పెద్దగా వ్యవహరించింది. తన భర్తను, ఆయన ప్రేయసిని గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసింది. వారిద్దరితో కలసి ఫొటోలు కూడా దిగింది.
సోషల్ మీడియాలో వైరల్..
కల్యాణ్-విమల-నిత్యశ్రీ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య విమల అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు హొరెత్తాయి. అందరూ ఆ ఆదర్శ జంటకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ముగ్గరూ కలసి కాపురం సజావుగా చేసుకోవాలని కోరారు. నిత్యశ్రీ అదృష్టవంతురాలని, విమల త్యాగమూర్తి అని, కల్యాణ్ అంతకంటే అదృష్టవంతురాలని అన్నారు. అయితే ఈ రెండో పెళ్లి ఎక్కడ జరిగిందనేది మాత్రం బయటకు రాలేదు. డక్కిలిలో ఈ వ్యవహారం కలకలం రేపినా ఆ తర్వాత ఈ ముగ్గురూ కలసి ఎక్కడికి వెళ్లారనేది తేలడంలేదు.