Swiggy - Zomato: మన దేశ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) గట్టి ఘనత సాధించాయి. ప్రపంచంలోని 10 అత్యుత్తమ ఈ కామర్స్ ఆధారిత ఫుడ్ డెలివరీ కంపెనీల జాబితాలో ఇవి చోటు సంపాదించాయి. 


స్విగ్గీ 9, జొమాటో 10
కెనడాకు చెందిన గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఈటీసీ గ్రూప్ (ETC Group) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ అగ్రిగేటర్ల మీద రీసెర్చ్‌ చేసింది. అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తున్న కంపెనీలతో ఒక లిస్ట్‌ను రూపొందించి, విడుదల చేసింది. ఈ లిస్ట్‌ ప్రకారం, స్విగ్గీ 9వ స్థానంలో, జొమాటో 10వ స్థానంలో నిలిచాయి.


చైనా ఫస్ట్‌
చైనాకు చెందిన మెయిటువాన్ (Meituan), బ్రిటన్‌కు చెందిన డెలివెరూ ‍‌(Deliveroo), అమెరికాకు చెందిన ఉబర్ ఈట్స్‌ (Uber Eats - ఇది ఉబర్ అనుబంధ సంస్థ) వరుసగా మొదటి 3 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎలె.మీ, డోర్‌డ్యాష్‌, జస్ట్‌ ఈట్‌ టేక్‌అవే/గ్రబ్‌హబ్‌, డెలివరీ హీరో, ఐఫుడ్‌ సంస్థలు నాలుగు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.


ఈ ఏడాది జూన్‌లో, రూ.4,447.5 కోట్లకు ($570 మిలియన్లు) క్విక్ కామర్స్ స్టార్ట్-అప్ బ్లింకిట్‌ను (Blinkit) కొనుగోలు చేసేందుకు జొమాటో బోర్డ్‌ ఆమోదించింది. ఆల్-స్టాక్ డీల్‌ పద్ధతిలో ఈ డీల్‌ జరుగుతోంది. బ్లింకిట్‌లో (గత పేరు గ్రోఫర్స్ - Grofers) జొమాటోకు ఇప్పటికే 9 శాతం పైగా వాటా ఉంది.


బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Bundl Technologies Private Ltd) అనుబంధ సంస్థ అయిన స్విగ్గీ.. రెస్టారెంట్లు వండిన ఆహారం డెలివరీ, క్లౌడ్ కిచెన్, స్విగ్గీ గో (Swiggy Go) ద్వారా కిరాణా సరుకుల డెలివరీ బిజినెస్‌లు చేస్తోంది.


యూనికార్న్‌
మన దేశంలో 100కు పైగా ఉన్న యూనికార్న్‌ కంపెనీల్లోనూ (రూ.8000 కోట్లు లేదా 1 బిలియన్‌ డాలర్ల విలువ దాటిన కంపెనీలు) ఈ రెండూ ఉన్నాయి.


ఇప్పటికీ నష్టాలే
వెంచర్‌ క్యాపిటల్‌, టెక్నాలజీ పెట్టుబడులు ఫుడ్‌ డెలివరీ సంస్థలను నడిపిస్తున్నాయి. కొవిడ్‌ కష్టకాలం భారీగా పెరిగిన ఆహార డెలివరీలు, ఇప్పుడు ఒక అవసరంగా మారాయి. చిన్న పట్టణాలకు కూడా స్విగ్గీ, జొమాటో విస్తరించాయి. అయితే ఈ కంపెనీలు ఇప్పటికీ లాభాల్లో లేవు. కేవలం ఫుడ్‌ డెలీవరీ మీదే లాభాలు సంపాదించలేమని గ్రహించిన ఈ సంస్థలు ఇతర మార్గాల మీదా దృష్టి పెట్టాయి. అందుకే, ఆహార డెలివరీతో పాటు కిరాణా సరకులు, ఔషధాలనూ సరఫరా చేస్తున్నాయి.


మన స్టాక్‌ మార్కెట్లలో స్విగ్గీ ఇంకా లిస్ట్‌ కాలేదు. జొమాటో, గతేడాది జులై 27న లిస్ట్‌ అయింది. ఈ స్టాక్‌ గత నెల రోజుల్లో 3 శాతం, గత ఆరు నెలల్లో 23 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) ఏకంగా 56 శాతం నష్టపోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.