ఆయన నాకే కావాలంది పెద్ద భార్య, కాదు నాకూ వాటా కావాలన్నది ప్రేయసి. మీ ఇద్దరి ఇష్టం.. మీరు ఏం చెప్తే అది చేస్తానన్నాడు అతడు. చివరకు ముగ్గురూ రెండు రోజులపాటు తర్జన భర్జన పడ్డారు. ఒకేమాటపైకి వచ్చారు. ఆయన్ను పంచుకోవడానికి ఇష్టపడ్డారు. అయితే ఆ ఇష్టంలో పెద్ద భార్య చాలా కష్టపడినట్టు తెలుస్తోంది. భర్తను త్యాగం చేయడానికి ఆమె ససేమిరా అన్నా, భర్త ప్రేయసి ఆమెను ఒప్పించిన తీరు మాత్రం మెచ్చుకోతగినదే. ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోకపోయినా ధైర్యంగా ముగ్గురూ పెళ్లికి ఏర్పాట్లు చేశారు. చివరకు పెద్దలు కూడా ఒప్పుకోక తప్పలేదు. సభ్యసమాజం ఏమనుకుంటుందోనన్న భయం ఓవైపు వెంటాడుతున్నా భార్య తన భర్తకు దగ్గరుండి మరీ రెండో పెళ్లి చేసింది.




భర్త మనసు తెలుసుకుని రెండో వివాహం జరిపించిన భార్య.. 
భర్తకు ప్రేమ వివాహం జరిపించిన మొదటి భార్య. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడిదో హాట్ టాపిక్. ఈ పెళ్లి జరిగిన తర్వాత ఆ ముగ్గురు ఎవరికీ అందుబాటులో లేరు. పెళ్లి తర్వాత జరగాల్సిన తంతుకోసం గ్రామంలో కూడా లేకుండా వెళ్లిపోయారు. అయితే ఈ పెళ్లి వెనక చాలా పెద్ద కథ నడిచినట్టు తెలుస్తోంది. భర్తను త్యాగం చేయడానికి భార్య అంత తేలిగ్గా ఒప్పుకోలేదు. శుభలగ్నం సినిమాలో లాగా ఇక్కడ డబ్బు వ్యవహారం కూడా నడవలేదు. కేవలం సెంటిమెంట్ తో మొదటి భార్యను పడేసింది రెండోభార్య. ఎట్టకేలకు ఆమె సమక్షంలోనే తన ప్రియుడితో తాళి కట్టించుకుంది.




ఉమ్మడి నెల్లూరు జిల్లా డక్కిలి మండలం అంబేద్కర్ నగర్ కి చెందిన కల్యాణ్ కు, విశాఖకు చెందిన నిత్యశ్రీతో సెల్ ఫోన్ లో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ టిక్ టాక్ అలవాటు ఉండటంతో అలా అడ్రస్ లు మార్చుకుని ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ దూరం అయ్యారు. ఇంతలో కడపకు చెందిన విమల అనే మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కల్యాణ్. ఈ విషయం తెలియడంతో నిత్యశ్రీ కూడా డక్కిలికి వచ్చింది. అయితే కల్యాణ్ కుటుంబం అక్కడ లేకపోవడంతో కడపకు వెళ్లి వారిని తీసుకొచ్చింది. తన సంగతేంటని నిలదీసింది. తనకు కూడా న్యాయం చేయాలంది.


ఆ ముగ్గురూ ఒక్కటయ్యారు.. 
అక్కడి నుంచి అసలు ఎపిసోడ్ మొదలైంది. కల్యాణ్ నాకు కావాలంటే నాకే కావాలంటూ నిత్యశ్రీ, విమల మొదట గొడవ పడ్డారు. ఆ తర్వాత అలకలు, బుజ్జగింపులు, విరహ వేదనలు.. ఇలా చిత్రమైన ఎపిసోడ్ లన్నీ అయిపోయిన తర్వాత నిత్యశ్రీ, విమల ఒకమాటపైకి వచ్చి ఇద్దరూ ఆయనకు భార్యలుగా ఉంటామని ఒప్పుకున్నారు. కల్యాణ్ కి కూడా ఇది ఓకే. అయితే కల్యాణ్ కుటుంబ సభ్యులు కుదరదన్నారు. దీంతో ఈ ముగ్గురూ కలసి కుటుంబ సభ్యులను ఒప్పించి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. మీడియాలో ఈ విషయం రచ్చగా మారే సరికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.


ఈ విచిత్ర పెళ్లిలో ముగ్గురూ టిక్ టాక్ అలవాటు ఉన్నవారే కావడం విశేషం. సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, వాటితో ప్రచారం పొందడం, ఇలా ముగ్గురి ఇష్టాఇష్టాలు ఒకేరకంగా ఉన్నాయి. దీంతో ముగ్గురి మధ్య ఓ అవగాహన రావడానికి పెద్దగా సమయం పట్టలేదు. గతంలో రెండు పెళ్లిళ్లు, ఇద్దరు భార్యలు, గుట్టు చప్పుడు కాకుండా రెండు కాపురాలు అనే వ్యవహారాలు ఉండేవి. ఇప్పుడు ఇలాంటి వ్యవహారాల్లో విడాకుల సంఖ్య  పెరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత స్వేచ్ఛగా తమకు నచ్చినవారితో కలసి ఉండే అవకాశముంది. కానీ ఇక్కడ పెద్ద భార్య పెద్ద మనసు చేసుకోవడం, చిన్నభార్య అతడే కావాలని అనడంతో.. కల్యాణ్ ఇద్దరు భార్యల ముద్దుల మొగుడుగా మారాడు.