Dussehra 2022 : ఒక్కో దేవుడికి ఒక్కో ఆయుధం - కానీ పరాశక్తి చేతిలో అవన్నీ ఉంటాయ్ ఎందుకలా!

Dussehra 2022: శూలం, చక్రం, వజ్రాయుధం, పాశం, అక్షమాల, కమండలం...ఇలా శక్తి స్వరూపిణి చేతిలో ఎన్నో ఆయుధాలుంటాయి. అవన్నీ దుష్ట సంహారానికి మాత్రమే అనుకుంటే పొరపాటే...

Continues below advertisement

Dussehra 2022: అమ్మవారి చేతిలో సకల దేవతల ఆయుధాలు ఎందుకు కనిపిస్తాయంటే...బ్రహ్మదేవుని నుంచి వరం పొందిన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్రుడి సింహాసనం పై కూర్చున్నాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకోగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజస్సుగా  మారింది. త్రిమూర్తుల తేజమంతా కలసి స్త్రీరూపంగా మారింది. శివుని తేజస్సు ముఖంగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదాలగా కలసిన మంగళమూర్తి 18 చేతులతో అవతరించింది. శివుడి శూలం, విష్ణువు చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు పాశం, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం.. హిమవంతుడు సింహాన్ని ఇచ్చారు. అందుకే సర్వదేవతల ఆయుధాలు అమ్మవారి చేతిలో కనిపిస్తాయి.

Continues below advertisement

Also Read: ఎంగిలిపూల బతుకమ్మ అని ఎందుకంటారు, బతుకమ్మలకు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి

ఆయుధాల వెనకున్న ఆంతర్యం
శంఖం
శంఖం ప్రణవానికి,  ఓంకారానికి ప్రతీక. ఈ శబ్ద రూపంలో అమ్మవారు కొలువై ఉందని అర్ధం
ధనుర్భాణాలు
ఇవి శక్తి ని సూచిస్తాయి. ధనుర్భాణాలని ఒక చేతిలో ధరించిన దుర్గా మాత తాను స్థితి గతి శక్తులు రెండింటి మీదా అధికారం కలిగియున్నానని తెలియజేస్తుంది
ఈటె
దుర్గామాతకు అగ్నిదేవుడు సమర్పించిన  ఈటె మండుతున్న శక్తి, శుభానికి చిహ్నంగా భావిస్తారు. చెడు, మంచి వ్యక్తుల మధ్య బేధానికి ప్రతీక
గొడ్డలి
విశ్వకర్మ మహాముని ఇచ్చిన గొడ్డలిని  చెడుతో పోరాటానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఎలాంటి పరిణామాలకు భయపడకూడదని సూచిస్తుంది.

Also Read: శరన్నవరాత్రుల్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివి!
గద
ఆవిడ చేతిలో ఉండే చక్రం ధృడ సంకల్పానికి ప్రతీక. భక్తులు కూడా తమ నమ్మకాల పట్ల అంత ధృడం గా వ్యవహరించాలనీ, ఎలాంటి  ఆపద ఎదురొచ్చినా మొక్కవోని ధైర్యం తో ఎదుర్కోవాలని అర్ధం.
కమలం
దుర్గా మాత చేతిలో కమలం పూర్తిగా వికిసితమయ్యి ఉండదు. అంటే సఫలత అనివార్యమనీ కానీ అదే ఆఖరు మజిలీ కాదనీ అర్ధం. సంస్కృతంలో కమలాన్ని "పంకజం" అంటారు. అంటే బురద  నుంచి పుట్టినది అని అర్ధం. బురదలో కమలం వికసించినట్లు దురాశ, కోరికల మధ్యలో జీవిస్తున్న భక్తులు కూడా ఆధ్యాత్మికతని వికసింపచేసుకోవాలని సూచన.
సుదర్శన చక్రం
సుదర్శన చక్రం దుర్గా మాత  చూపుడు వేలు పైన వేలుకి తాకకుండా తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ విశ్వం అంతా ఆమె ఆజ్ఞకి లోబడి నడుస్తుందని అర్థం.
ఖడ్గం
అమ్మవారి చేతిలో ఉన్న ఖడ్గం..పదునైన జ్ఞానాన్ని సూచిస్తుంది. 
త్రిశూలం
మూడు గుణాలైన సత్వ ,రజో , తమో గుణాలకి ప్రతీక త్రిశూలం . శారీరక,మానసిక, ఆధ్యాత్మిక అవరోధాలని దుర్గా మాత తొలగిస్తుంది 
వజ్రాయుధం
ఇంద్రుడు ఇచ్చిన వజ్రాయుధ శక్తి...వేదాల ప్రకారం  ఆత్మ దృఢత్వానికి చిహ్నం, బలమైన సంకల్ప శక్తికి సూచన
అభయముద్ర
దుర్గమ్మ  నిర్భయంగా సింహం మీద నిలుచుని ఉంటుంది. ఇది అభయముద్ర. అంటే భయం నుంచి విమోచనని సూచిస్తుంది. ఈ ముద్రలో అమ్మవారు భక్తులనుద్దేశించి " మీ కార్యాలు, విధుల భారాన్ని నా మీద వెయ్యండి, మిమ్మల్ని అన్ని భయాల నుంచి విముక్తులని చేస్తాను" అని అర్థం.

 ఈ ఏడాది శరన్నవరాత్రులు సెప్టెంబరు 26 నుంచి ప్రారంభమవుతున్నాయి...అక్టోబరు 4న దసరా పండుగ జరుపుకుంటారు....

ఓం శ్రీ మాత్రే నమః

Continues below advertisement