Story Behind Arundhati Nakshatram: మహా పతివ్రతల్లో అరుంధతి ఒకరు. వశిష్టమహర్షి భార్య. పెళ్లిసమయంలో పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తెకు ఆకాశంలో నక్షత్ర రూపంలో ఉన్న అరుంధతిని చూపిస్తారు. అయితే ఎందరో మహా పతివ్రతలుండగా అరుంధతినే ఎందుకు చూపిస్తారు. నూతన దంపతలకు అరంధతిని చూపించడం వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా?


అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసతీ
తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం!!


 అరుంధతీ, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది. ఈ అయిదుగురు స్త్రీ మూర్తులు సదా పూజ్యనీయులు. వీరిలో అరుంధతి మహాపతివ్రతల్లో అగ్రగామి.


అగ్ని నుంచి ఉద్భవించిన అరుంధతి


బ్రహ్మదేవుని కుమార్తె పేరు సంధ్యాదేవి. తనకు ఉపదేశం చేయగల బ్రహ్మచారి కోసం ముల్లోకాలు వెదకడం ప్రారంభించింది సంధ్యాదేవి.  వశిష్ఠుడే తనకు ఉపదేశం చేసేందుకు తగినవాడని తెలుసుకుని ఆయన్న ఆశ్రయించింది. బ్రహ్మచారి అయిన వశిష్ఠుడు ఆమెకు ఉపదేశం చేయడానికి అంగీకరించాడు. ఉపదేశ అనంతరం సంధ్యాదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంది. ఆ అగ్ని నుంచి వెలువడిన అందమైన స్త్రీ రూపమే  అరుంధతి..


Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది - రాముడు నవమి తిథిరోజే ఎందుకు జన్మించాడు!


అందుకే అరుంధతి మహా పతివ్రత


గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్న వశిష్ఠ మహర్షి తగిన వధువు కోసం అన్వేషణ ప్రారంభించాడు. తనను పెళ్లిచేసుకునే స్త్రీకి ఓ పరీక్ష పెట్టాడు వశిష్టుడు. అదేంటంటే...ఇసుకతో అన్నం వండటం. అందుకే ఓ  ఇసుక మూటను పట్టుకుని దాన్ని అన్నంగా వండగలిగినవారు ఎవరంటూ సంచారం చేశారు. ఆ సందర్భంలో అరుంధతి..వశిష్టుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించింది. తనకున్న దైవబలంతో ఇసుకను బియ్యంగా మార్చి వండి వడ్డించింది. సంతోషించిన వశిష్ఠుడు ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే తన చేతి కమండలం అరుంధతికిచ్చి తాను తిరిగివచ్చేవరకూ దాన్ని చూస్తూ ఉండమని చెప్పి వెళ్లాడు. ఏళ్ల తరబడి అరుంధతి ఆ కమండలాన్నే చూస్తూ ఉండిపోయింది. అయినా వశిష్ఠుడు తిరిగి రాలేదు. ఎందరో పండితులు,రుషులు ఆమెను చూపు మరల్చమని చెప్పినా చూపు తిప్పలేదామె. చివరకు బ్రహ్మాదిదేవతలు దిగివచ్చి ఆమెను కమండలము నుంచి చూపు మరల్చాలని చెప్పినా వినలేదు. ఇక చేసేది లేక విశిష్టుడిని వెతికి తీసుకొచ్చి ఆమెముందు నిలబెట్టారు. ఆయన రాకతో తన చూపును కమండలం నుంచి వశిష్టుడి వైపు మరల్చింది. అప్పుడు బ్రహ్మాదిదేవతల సమక్షంలో అరుంధతిని పెళ్లిచేసుకున్నాడు వశిష్టుడు. అప్పటి నుంచి మనసా, వాచా, కర్మణా వశిష్టుడిని అనుసరించి మహాపతివ్రతగా నిలిచిపోయింది అరుంధతి. 


Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!


ప్రతి భార్యా అరుంధతిలా ఉండాలని...


అరుంధతి తన సౌభాగ్య, పాతివ్రత్య దీక్షతో నక్షత్ర రూపంలో వెలుగుతూ ఆకాశంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందుకే  మూడుముళ్లు వేసిన తర్వాత వరుడు..వధువుకి అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అరుంధతిలా సహనం, శాంతం, ఓర్పు, పాతివ్రత్య లక్షణాలు కలగి ఉండాలని..ఆ బంధం అరంధతి, వశిష్టులులా చిరస్థాయిగా వెలగాలని, నిలవాలని దాని అర్థం. అరుంధతి వశిష్టుల కుమారుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. ఈ పరాశరుడు మత్సకన్యకు జన్మించినవాడే వ్యాసమహర్షి.  అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం. 


Also Read: శివుడికి 5 రూపాలు - మీరు ఏ రూపం పూజించాలో తెలుసా!