'శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.
శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ,
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే."


‘ఓ శమీ వృక్షమా! పాపాలను పోగొట్టి, శత్రువులను పరాజయం పాల్చేయడం నీ విశిష్టత. అర్జునుడు ధనుస్సు దాచింది నీ దగ్గరే! రాముడికి ప్రియం చేకూర్చిందీ నువ్వే. శ్రీరాముడు పూజించినట్లే నేనూ నిన్ను పూజిస్తున్నాను. ఎలాంటి విఘ్నాలూ లేకుండా నా విజయ యాత్రను సుఖమయం చెయ్యవలసిందిగా ప్రార్థన.’


రామాయణం, మహాభారతంలో జమ్మిచెట్టు 
పాపాలను నాశనం చేసే మహిమ, శత్రువులను నాశనం చేసే శక్తి శమీ వృక్షానికి ఉంది. రావణ వధకు ముందు శ్రీరాముడు శమీ పూజ చేశాడని పురాణ కథనాలు ఉన్నాయి. మహా భారతంలో అజ్ఞాతవాసం చెయ్యబోయే ముందు పాండవులు వారి ఆయుధాలను శమీ వృక్షం మీద భద్రపరుస్తారు. అజ్ఞాతవాసానంతరం, ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు శమీ వృక్షాన్ని పూజించి, తన ధనుస్సయిన గాండీవాన్ని తీసుకుంటాడు. ఆ రోజు విజయదశమి!


Also Read: ఆ ముగ్గురిని నమ్మొద్దని లక్ష్మణుడికి చెప్పి కన్నుమూసిన రావణుడు!


క్షీరసాగర మథనంలో ఉద్భవించిన జమ్మిచెట్టు
క్షీర సాగర మథనంలో పాల సముద్రం నుంచి ఉద్భవించిన దేవతా వృక్షాల్లో జమ్మి చెట్టు ఒకటని చెబుతారు. యజ్ఞయాగాల్లో అగ్ని సమీకరణ కోసం అరణిని మథించడానికి శమీవృక్షం కలపనే ఉపయోగించేవారట! దుష్టత్వంపై దైవత్వం, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా పురాణ కాలం నుంచి నేటి వరకు ఏటా విజయదశమి రోజున శమీపూజ చేయడం సంప్రదాయం.
 
ఔషధ గుణాలున్న జమ్మిచెట్టు
పట్నం వాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాలవారికీ జమ్మి అంటే ప్రాణం. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి. దీని వేళ్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి. ఈ చెట్టులోని ప్రతిభాగాన్నీ నాటువైద్యంలో ఔషధాలుగా వాడతారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అందుకే వినాయక చవినినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమీపత్రాన్ని కూడా చేర్చారు.


Also Read: దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!


పాలపిట్టను ఎందుకు చూడాలి
దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది. పాలపిట్ట‌ మ‌న‌శ్శాంతికి, ప్ర‌శాంత‌త‌కు, కార్య‌సిద్ధికి సంకేతంగా భావిస్తారు. చాలామంది ఈ ప‌క్షిని ప‌ర‌మేశ్వ‌రుడి స్వ‌రూపంగా భావిస్తుంటారు. ద‌స‌రా రోజు పాలపిట్ట‌ చూస్తే అన్ని శుభాలే జ‌రుగుతాయ‌ని విశ్వసిస్తారు. న‌మ్మ‌కం వెనుక పురాణ‌గాథ‌లు ఉన్నాయి. త్రేతా యుగంలో రావ‌ణాసురుడితో శ్రీరాముడు యుద్ధానికి బ‌య‌లుదేరిన‌ సమయంలో విజ‌య ద‌శ‌మి పాలపిట్ట‌ ఎదురుగా క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత జ‌రిగిన యుద్ధంలో రాముడు విజ‌యం సాధిస్తాడు. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా, వారికి పాలపిట్ట కనిపించిందనీ… అప్పటి నుంచీ వారికి సకల విజయాలూ సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకనే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ మారింది.