Hanuman Jayanti 14th May 2023: కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. హైదరాబాద్ కు దాదాపు 160 కిలోమీటర్ల దూరం,  కరీంనగర్‌ జిల్లాకేంద్రం నుంచి 35 కిలోమీటర్లు, వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కిలోమీటర్ల దూరం. ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. రోగగ్రస్థులు, సంతాన హీనులు అంజన్న సన్నిధిలో 41 రోజులు గడిపితే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం.


Also Read: సూర్యాంజనేయం అంటారెందుకు - సూర్యుడు-ఆంజనేయుడు మధ్య ఉన్న బంధం ఏంటి!


పశువులకాపరికి కలలో కనిపించిన ఆంజనేయుడు


దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. వెతికి వెతికిన సంజీవుడు ఓ చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు ఆంజనేయస్వామి కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్లు తెరచి చూడగానే ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికికి అవధుల్లేకుండాపోయాయి. భక్తిభావంతో కోరంద ముళ్లపొదలను తొలగించి చూడాగా అక్కడ స్వామివారు కనిపించారు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రాస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. 


Also Read: కుజుడు-శుక్రుడు సంయోగం, ఈ రాశులవారికి అన్నీ శుభఫలితాలే!


సంజీవని పర్వతం నుంచి రాలిన ముక్కే కొండగట్టు


లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ సమయంలో పర్వతం నుంచి చిన్న ముక్కరాలిందని అదే కొండగట్టుగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. నారసింహస్వామి ముఖం, ఆంజనేయస్వామి ముఖం..ఇలా రెండు ముఖాలతో హనుమంతుడు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం. కనుక కొండగట్టు ఆంజనేయస్వామి వారు స్వయంగా నారసింహవక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉన్నాడు. 300 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్‌ముఖ్‌ తిరిగి నిర్మించారు.


సంతానయోగం


కొండగట్టు ఆంజనేయుడిని దర్శించుకుంటే సంతానయోగం ఉంటుందని భక్తుల విశ్వాసం. పండగల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కొండగట్టు ఆలయంలో ముఖ్యమైన రోజులివే



  • ఏటా చైత్ర పౌర్ణమిరోజు హనుమాన్‌ చిన్నజయంతి, వైశాఖ బహుళదశమినాడు వచ్చే పెద్ద హనుమాన్‌ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంజ‌నేయ‌స్వామి దీక్ష తీసుకున్న ల‌క్ష‌ల మంది భ‌క్తులు స్వామిని ద‌ర్శించుకుని  ముడుపులు కట్టివెళ్తుంటారు

  • పెద్ద హనుమాన్‌ జయంతి సందర్భంగా మూడు రోజుల పాటూ హోమం నిర్వహిస్తారు

  • ఉగాది పండుగ రోజు స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది

  • చైత్ర శుద్ధనవమి రోజు శ్రీరావమనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరుగుతుంది

  • శ్రావణమాసంలో సప్తాహ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు

  • ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నెల రోజులపాటు తిరుప్పావై, గోదారంగనాయకుల కల్యాణం జరుగుతుంది

  • వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి ఉత్తరద్వార దర్శనం ఉంటుంది

  • దీపావళి సందర్భంగా సహస్ర దీపాలంకరణతో ఆలయాన్ని తీర్చిదిద్దుతారు.

  • లోక కల్యాణం కోసం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు

  • జగత్‌కల్యాణ సిద్ధికి ఏటా మూడు రోజులపాటు శ్రీ సుదర్శన మహాయాగం జరుపుతారు