Golconda Bonalu 2023:  తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. ఆషాఢ మాసం ఆరంభం నుంచి  ఊరూరా మొదలయ్యే సందడి  నెల రోజుల పాటూ సాగుతుంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో మహానగరం నుంచి మారుమూల పల్లెవరకూ హోరెత్తిపోతుంది. ఉత్సవాల్లో భాగంగా మహిళలు తలపై బోనాలతో అమ్మవార్ల ఆలయాలకు తరలివెళ్లి పూజలు చేస్తారు. ఆదివారం, బుధవారాల్లో బోనాల జాతర జరుగుతుంది. గ్రామ దేవతలైన పోశమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ, వీరికి తోడుగా గ్రామాన్ని కాపాడే పోతురాజు అనుగ్రహంకోసం  బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాది (2023) జూన్ 22 నుంచి బోనాలు ప్రారంభమయ్యాయి.


బోనమెత్తిన గోల్కొండ


గోల్కొండ కోట బోనమెత్తింది. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు ఘనంగా అంకురార్పణ జరిగింది. లంగర్‌హౌజ్‌ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు  ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌మూద్ అలీ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. అనంతరం  తొట్టెల‌కు స్వాగతం పలికారు. ఆ తర్వాత  శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ్రస్తాలు సమర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రుల ఇంద్రకరణ్ రెడ్డి,  తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్ అలీ సహా పలువురు ప్రజాప్రతినిథులు,అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో నెలరోజుల పాటు జరగనున్న బోనాల జాతరను అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది.


మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 


భారతదేశంలోని హిందువుల గురించి అందరూ మాట్లాడతారు. కానీ, హిందువుల పండుగలకు అండగా నిలిచేది సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. యాదాద్రిని దేశం మొత్తం చెప్పుకునే విధంగా సీఎం కేసీఆర్ 1200 కోట్లతో అభివృద్ధి చేశారన్నారు. బోనాల పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని మంత్రి తలసాని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోల్కొండ జగదాంబిక అమ్మవారి జాతర చాలా తక్కువ మందితో జరిగేది. కానీ, ఇప్పుడు లక్ష మందికి పైగా పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. పట్టువస్త్రాలు సమర్పించి ఆషాడ మాసం మొత్తం బోనాల జాతర కొనసాగుతుందని, వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ బోనాలకు తరలివస్తారని తెలిపారు. 


Also Read: వెయ్యి పున్నములు చూడడం అంటే ఏంటి!


మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి


 మన భాగ్యనగరంలో బోనాల పండుగ ప్రారంభమైందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మహంకాళి అమ్మవారి బోనాలలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.  బోనాల పండుగకు 15 కోట్ల బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ కేటాయించారని చెప్పారు. 


Also Read:  ఆరుద్ర కార్తె ఆరంభం - ఎర్రటి ఈ పురుగులు కనిపిస్తే వానలు మొదలైనట్టే!


బోనంతో పాటూ సాక
కొందరు అమ్మవారికి బోనంతో పాటు సాక సమర్పిస్తారు. చిన్న మట్టిపాత్రలో నీళ్లుపోసి చక్కెర, బెల్లం కలిపి పానకాన్ని తయారు చేస్తారు. ఆ తీర్థంలో వేపకొమ్మలు ఉంచి ,బోనంపై పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.


పోతురాజులు, శివసత్తులు ప్రత్యేక ఆకర్షణ
బోనాల పండుగ  ఊరేగింపులో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గ్రామ దేవతలైన ఓరుగంటి రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఏడుగురు అక్కచెల్లెల్లకు ఒక్కగానొక్క తమ్ముడు పోతురాజు. ఏడుగురు అక్కచెల్లెళ్లకు ఒక్కో పండుగ ఏర్పాటు చేసిన ఎల్లమ్మ తమ్ముడి కోసం ఏమీ చేయలేదని బాధపడగా.. మీరు వెలిసిన గ్రామాల్లో దుష్టశక్తులు చొరబడకుండా పొలిమేరల్లో కాపలా ఉంటానని చెప్పాడట పోతురాజు. 


కాకతీయుల కాలం నుంచే జాతర
గోల్కొండ బోనాల తర్వాత లష్కర్, లాల్ దర్వాజ, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాల్లో బోనాలు జరుగుతాయి. గోల్కొండ కోట నుంచి ఆరంభమైన బోనాలు.. చివరకు లాల్‌దర్వాజ అమ్మవారి వద్ద పూర్తవుతాయి. తెలంగాణకు ప్రత్యేకమైన బోనాల జాతరను కాకతీయుల కాలంనుంచే  నిర్వహిస్తున్నట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే పారిశుద్ధ్య లోపంతో కలరా, ప్లేగు లాంటి అంటురోగాలతో అల్లాడేవారు. ఈ రోగాల బారి నుంచి కాపాడాలని శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని కొలిచేవారు. బోనం అంటే ఆహారం, భోజనం అని అర్థం. అమ్మవారికి నైవేద్యం వండి కుండను పసుపు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరించి దానిపై దీపం వెలిగిస్తారు. ఆ కుండను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. విస్తారంగా వర్షాలు కురిపించాలని, అంతా ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటారు.