YSRCP News :  వైఎస్ఆర్‌సీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది గడప గడపకూ వెళ్లడం లేదని.. వారికి చివరి చాన్స్ ఇస్తున్నానని.. వారిని పిలిచి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని సీఎం జగన్ సమీక్షలో హెచ్చరించారు. అయితే ఆ పద్దెనిమిది ఎవరు అన్నది బయట పెట్టలేదు. ఈ హెచ్చరికల తర్వాత  వైసీపీలో ఆ 18మంది ఎవరు అని ఏ ఇద్దరు నేతలు కలిసినా మాట్లాడుకుంటున్నారు.  


ఆ 18 మందికి టిక్కెట్ లేనట్లే ! 


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీ శాసన సభ్యులు, ఇంచార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రి స్వయంగా 18 మంది శాసన సభ్యుల తీరు పై అసహనం వ్యక్తం చేశారు. గడప గడప రివ్యూ చేస్తున్న ప్రతి సారీ చెబుతున్నామని, చాలామంది మెరుగు అయ్యారు కాని, మరో 18మంది మాత్రం ఇంకా స్లోగా ఉన్నారని సీఎం అన్నారని చెబుతున్నారు.అయితే  ప్రతి మీటింగ్ లో నేరుగా పేర్లు చెప్పే ముఖ్యమంత్రి , ఈ సారి చెప్పకపోవడానికి కారణం ఏంటి అనే ఉత్కంఠ  నేతల్లో ఏర్పడింది.  సీఎం చెప్పిన ఆ 18మందికి  సీట్లు గల్లంతేనా 18  తో  పాటు  ఇంకా  లిస్ట్  పెరిగే  అవకాశం  ఉందా అన్న చర్చ ప్రారంభమయింది. 


ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రులు కూడా !


గడప గడపకూ మన ప్రభుత్వం లో పెర్ఫార్మెన్స్ లేకుంటే సీట్లు ఇచ్చేదే లేదంటూ జగన్ తెగేసి చెప్పిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఒక రకంగా  సీఎం జగన్ చేసిన హెచ్చరికలుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అంతే కాదు 18 మంది ఎమ్మెల్యేలు పని తీరు అస్సలు బాగోలేదని తాను  పేర్లు చెప్పడం సరికాదని,  వ్యక్తిగతంగా వారితోనే డైరెక్ట్ గా  మాట్లాడతానన్నారు.  ఇప్పటికే సీఎంవో నుంచి సదరు 18 మంది రిపోర్టులు వ్యక్తిగతంగా చేరాయని అంటున్నారు. వారిలో ఇద్దరు మంత్రులు, కొందరు మాజీ మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారని టాక్ నడుస్తోంది.
ఉమ్మడి జిల్లాల వారీగా  నేతల పరిస్దితులను చూస్తే శ్రీకాకుళం నుంచి ఒక శాసన సభ్యుడి పని తీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని చెప్పారని అంటున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి మరో మాజీ మంత్రి, ఒక ప్రస్తుత మంత్రి ఉన్నారని  ప్రచారం ఉంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, పశ్చిమగోదావరి నుంచి ఇద్దరు  మాజీ మంత్రులు జాబితాలో ఉన్నారని, కృష్ణా జిల్లా నుంచి గతంలో పార్టీ పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఓ ఎమ్మెల్యే ఉన్నారని అంటున్నారు. ఇక గుంటూరు జిల్లా నుంచి మాజీ మహిళా మంత్రి కి కూడా ఐ ప్యాక్ టీమ్ నుంచి ఫోన్ వెళ్లిందని , ప్రకాశం జిల్లా నుంచి ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే ఉన్నట్లు  ప్రచారం.  నెల్లూరు జిల్లా నుంచి అధిష్టానం పై అసంతృప్తి తో ఉన్న ఒక మాజీ మంత్రి, మరో ఎమ్మెల్యే ఉన్నారని, అనంతపురం నుంచి ఒక మంత్రి,ఇద్దరు ఎమ్మెల్యేల పని తీరు పై  సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు  కేంద్ర కార్యాలయంలో ఉన్న సీనియర్ లీడర్ల లో చర్చ నడుస్తోంది.  కర్నూల్,చిత్తూరు జిల్లాల నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే కి ఇప్పటికే ఫోన్ కాల్స్ వెళ్ళాయని, వెంటనే అలర్ట్ కావాలని కూడ చెప్పేశారని అంటున్నారు. 


మరో మూడు నెలల గడువు 


జగన్  ఎమ్మెల్యేలకు  మరో  మూడు నెలలు  సమయం  ఇచ్చారు. ఈ లోపు  గ్రాఫ్  పెంచుకుంటే ఒకే, పరిస్దితుల్లో మార్పు రాకుంటే మాత్రం టికెట్స్  కష్టం అనేది  తెగేసి చెబుతున్నారని అంటున్నారు. ఈ  18 మందితో  పాటు  మరికొందరు  ఎమ్మెల్యేలు  కూడా  ఉండే  అవకాశం లేకపోలేదని అంటున్నారు. గతంలో ఈ  లిస్ట్ 35. ఉండేది  ఇప్పుడు  సగానికి  సగం  తగ్గింది... కానీ   ఈ  ముడునెలలో  జరిగే పరిణామాల  ఆధారంగా  కూడా  లిస్ట్  లో  మార్పులు  ఉంటాయి  అనే  అభిప్రాయాలు  వినిపిస్తున్నాయి..