జూన్ 23 శుక్రవారం నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం
ఎర్రటి ఎండకు మండి మండి నెర్రలిచ్చిన నేల తొలకరి చినుకుల కోసం తపించిపోతుంది. మేఘం ఉరిమి చినుకు కురియగానే నేలతల్లి తన ఆనందాన్ని మట్టి పరిమళంగా వెదజల్లుతుంది. ఆ చినుకుతడి తగిలిన వెంటనే నేలలోపల నుంచి బిలబిల మంటూ ఎర్రటి పురుగులు బయటకొచ్చేస్తాయి. వీటినే ఆరుద్ర పురుగులు అంటారు. ఆరుద్ర కార్తె ప్రారంభం కాగానే ఇవి కనిపిస్తే ఆ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం. అందుకే ఆరుద్ర పురుగులను తమకు శుభవార్త తీసుకొచ్చే నేస్తాలుగా భావిస్తారు రైతులు. ఎర్రగా బొద్దుగా మెరుస్తూ చూడముచ్చటగా కనిపించే ఇవి బయట కనిపించగానే రైతులంతా ఇక వ్యవసాయ పనులు మొదలెట్టుకోవచ్చని ఫిక్సైపోతారు. ఎందుకంటే ఇవి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తాయి అదికూడా వానలు జోరందుకునే ముందు మాత్రమే భూమిలోంచి బయటకొస్తాయి. అందుకే రైతన్నలకు ఇవి కనిపిస్తే అంత ఉత్సాహం.
ఆరుద్ర పురుగులు వచ్చేశాయ్
ఏటా ఆరుద్ర కార్తె ప్రారంభం కాగానే ఈ పురుగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు రెండు మూడు రోజుల ముందే కనిపిస్తే మరికొన్నిసార్లు ఆరుద్ర కార్తె వచ్చిన రెండుమూడు రోజుల తర్వాత కనపిస్తాయి. వాస్తవానికి అప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ పురుగులు కనిపించడం తగ్గింది. ఒకప్పుడు ఏ వ్యవసాయ క్షేత్రంలో చూసినా ఆరుద్ర పురుగులు కనిపించేవి . కానీ రాను రాను ఫెస్టిసైడ్స్ వాడకం ఎక్కువై పుడమి తల్లి కాలుష్య కాసారంగా మారుతోంది. దీంతో ఏటికేడు ఆరుద్ర పురుగుల ఉనికి తగ్గిపోతోంది.
Also Read: జూన్ 22 రాశిఫలాలు - ఈ రాశివారు మాటతీరు, ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు
అందమైన ఈ పురుగులు ప్రకృతిని కాపాడుతాయి
అందంగా కనిపించే ఆరుద్ర పురుగును కొన్నిచోట్ల పట్టు పురుగు, చందమామ పురుగు , లేడీ బర్డ్ , ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా ఈ పురుగు చూడటానికి ఎర్రని మఖ్మల్ క్లాత్ తో చేసిన బొమ్మలా ఉంటాయి. ముట్టుకోగానే అత్తిపత్తి ఆకుల్లా ముడుచుకుపోతాయ్. ఇంగ్లీష్ లో Red Velvet Mite అని పిలిచే ఈ ఆరుద్ర పురుగులు పర్యావరణ నేస్తాలు.ఇవి నేలను గుల్లబారకుండా చేసి పంటలకు పోషకాలు అందిచడంలో సహకరిస్తాయి.
ఇంతకీ కార్తెలు అంటే ఏంటి - అవెలా వచ్చాయి!
జోతిష్యులు 27 నక్షత్రాలు, గ్రహాల ఆధారంగా జాతకాలు,పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగం తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుచుకుంటున్నారు. అయితే వీరి లెక్కల ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. అలా సంవత్సరానికి 27 కార్తెలు. జూన్ 22 తో మృగశిర కార్తె పూర్తై...జూన్ 23 నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం...
Also Read: మీరు ఈ టైమ్ లో జన్మించినట్టైతే మీ వ్యక్తిత్వం చాలా మంచిది!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.