ప్రముఖ టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన హీరోగా ‘ది కానిస్టేబుల్’ అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలోని ఒక యాక్షన్ సీన్ చిత్రీకరణలో ప్రమాదవశాత్తూ వరుణ్ సందేశ్ కాలికి తీవ్ర గాయం అయింది. దీంతో వెంటనే వరుణ్ సందేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు మాడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చిందని సినిమా డైరెక్టర్ ఎస్.కే.ఆర్యన్ శుభన్ పేర్కొన్నారు. ఒక కానిస్టేబుల్ జీవిత కథ ఇదని, పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో ఈ సినిమా తెరకెక్కనుందని ఆర్యన్ చెప్పారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత రెండో షెడ్యూల్ ప్రారంభిస్తామని నిర్మాత బలగం జగదీష్ తెలిపారు. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది.
మరోవైపు వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘ఢీ’ షోలో ఒక టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 'హ్యాపీ డేస్' సినిమాతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత 'కొత్త బంగారు లోకం', 'ఏమైంది ఈవేళ', 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' వంటి కొన్ని హిట్ సినిమాలు చేశారు. ఆయనతో సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల, సంపత్ నంది, శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. కనీసం వాళ్ళ సినిమాల్లో మంచి క్యారెక్టర్లు కూడా వరుణ్ సందేశ్ దగ్గరకు రావడం లేదు.
సందీప్ కిషన్ హీరోగా నటించిన 'మైఖేల్'లో వరుణ్ సందేశ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే అతని కెరీర్ మరో టర్న్ తీసుకునేదేమో! కానీ ఫ్లాప్ కావడంతో ఆ పాత్రను ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం 'ది కానిస్టేబుల్', 'చిత్రం చూడర' అనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వరుణ్ సందేశ్ సినిమాలకు కనీసం సరైన బజ్ రావడం లేదు. ఆయన కంటే ప్రదీప్ మాచిరాజు, 'సుడిగాలి' సుధీర్‌లపై ప్రేక్షకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇంతకు ముందు 'బిగ్ బాస్' రియాలిటీ షోలో కూడా వరుణ్ సందేశ్ పార్టిసిపేట్ చేశారు. అయితే హీరో కనుక ఆయన్ను బిగ్ బాస్ షోలో తీసుకున్నారని ప్రేక్షకులు భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా డ్యాన్స్ రియాలిటీ షోలో గ్రూప్ ప్రతినిధి, డ్యాన్సర్లను పరిచయం చేయడం కోసం వచ్చారనే సరికి ఆయన ఫ్యాన్స్‌తో పాటు కొందరు ఫీలవుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వెండితెరపై ఓ వెలుగు వెలిగిన వరుణ్ సందేశ్ స్థాయి ఇప్పుడు బుల్లితెరకు పడిపోవడం ఆయన్ను అభిమానించిన ప్రేక్షకులను బాధ పెడుతోంది. సరైన ప్లానింగ్ లేకపోవడం, చేసిన సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో వరుణ్ సందేశ్ కెరీర్ అనుకున్న విధంగా సాగలేదు.