బోనమెత్తిన గోల్కొండ
గోల్కొండ కోట బోనమెత్తింది. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు ఘనంగా అంకురార్పణ జరిగింది. లంగర్‌హౌజ్‌ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు  ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌మూద్ అలీ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. అనంతరం  తొట్టెల‌కు స్వాగతం పలికారు. ఆ తర్వాత  శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ్రస్తాలు సమర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్,  దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ సహా పలువురు ప్రజాప్రతినిథులు,అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో నెలరోజుల పాటు జరగనున్న బోనాల జాతరను అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రెండేళ్లుగా కరోనా కారణంగా సందడి కాస్త తగ్గినా ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తోంది.   


Also Read:  అమ్మవారికి ఆషాడమాసంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తారు, అసలు బోనం అంటే ఏంటి!


రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  
బోనాలను అత్యంత వైభవంగా  నిర్వ‌హించేందుకు సీయం కేసీఆర్  రూ. 15 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేర‌కు   బోనాల ఉత్సవాలను ఘ‌నంగా  నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశాం. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించాం


రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ 
గోల్కొండ బోనాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. బోనాల పండుగను వైభవంగా నిర్వహించాలని  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బోనాల పండుగకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నారు. భక్తులంతా జాగ్రత్తగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి


రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
బోనాల అత్యంత సంతోషకరమైన పండుగ. మొదటి బోనం గోల్కొండ జగదాంబికా అమ్మవారికి సమర్పించాం. వందల ఏళ్ల నుంచి బోనాల జాతర జరుగుతోందం. నగరంలోని ప్రతి ఆలయానికి ఆర్థిక సాయం అందించిన ఘనత కేసీఆర్‌ది. అన్ని శాఖల సమన్వయంతో బోనాల ఉత్సవం ముందుకు సాగుతోంది.


గోల్కొండ బోనాల తర్వాత లష్కర్, లాల్ దర్వాజ, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాల్లో బోనాలు జరుగుతాయి. గోల్కొండ కోట నుంచి ఆరంభమైన బోనాలు.. చివరకు లాల్‌దర్వాజ అమ్మవారి వద్ద పూర్తవుతాయి.


Also Read:    జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!


కాకతీయుల కాలం నుంచే జాతర
తెలంగాణకు ప్రత్యేకమైన బోనాల జాతరను కాకతీయుల కాలంనుంచే  నిర్వహిస్తున్నట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే పారిశుద్ధ్య లోపంతో కలరా, ప్లేగు లాంటి అంటురోగాలతో అల్లాడేవారు. ఈ రోగాల బారి నుంచి కాపాడాలని శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని కొలిచేవారు. బోనం అంటే ఆహారం, భోజనం అని అర్థం. అమ్మవారికి నైవేద్యం వండి కుండను పసుపు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరించి దానిపై దీపం వెలిగిస్తారు. ఆ కుండను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. విస్తారంగా వర్షాలు కురిపించాలని, అంతా ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటారు.