తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు (జూన్ 30) ఉదయం 11.30 గంటలకు పది పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం telugu.abplive.com లేదా bse.telangana.gov.in  వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 


ఈ ఏడాది 5,03,579 విద్యార్థులు పది పరీక్షలు రాయగా, 4,53,201 మంది పాసైనట్లుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఇందులో అబ్బాయిలు 2,55,433 మంది హాజరు కాగా.. 2,23,779 పాసయ్యారని వివరించారు. అమ్మాయిల్లో 2,48,146 మంది పరీక్షలు రాయగా, 2,29,422 మంది పాసైనట్లుగా వెల్లడించారు. 


పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో అబ్బాయిలు 87 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు. మొత్తం కలిపి  90శాతం మంది పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వివరించారు. 


జూన్‌ మొదటి వారంలో ముగిసిన పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం లక్షల మంది విద్యార్థులు ఎదురు చూశారు. మే 28న జరిగిన సాంఘిక పరీక్షతో 2021-22 సంవత్సరానికి చెందిన పరీక్షలు ముగిశాయి. మొత్తం 5,03,114 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులకు జూన్‌ 1 న చివరి పరీక్ష జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి అంటే జూన్‌ 2 నుంచి తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ ప్రారంభించారు. 


కరోనా కారణంగా చాలా మార్పులు 
గతేడాది వరకు పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్ల పరీక్షలు ఉండేవి. కరోనా వ్యాప్తి తర్వాత పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. అందుకే రెండేళ్లు నేరుగా విద్యార్థులను తర్వాత తరగతులకు ప్రమోట్ చేశారు. ఈ ఏడాది పదకొండు పేపర్లకు బదులుగా 6 పేపర్లకు పరిమితం చేయడంతో ఒకే వారంలో పరీక్షలు పూర్తయ్యాయి. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు.


ముందు చెప్పినట్టుగానే 
ఈ ఏడాది 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 99 శాతం మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 2,861 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేసి నెలాఖరులోగా ఫలితాలు విడుదల చేయనున్నట్టు మొదట్లోనే అధికారులు ప్రకటించారు. దాని ప్రకారమే ఇవాళ ఫలితాలు విడుదల చేశారు. 


తెలంగాణ SSC రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


తెలంగాణ ఫలితాలు ఎలా చూడాలి
ఏబీపీ దేశం వెబ్‌సైట్‌ telugu.abplive.comలోకి లేదా bse.telangana.gov.inవెళ్లాలి.
టాప్‌లో TS SSC Results 2022 కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి. లేదా ప్రభుత్వం సూచించిన ఏదైనా వెబ్‌సైట్‌నైనా క్లిక్ చేయాలి. 
అలా క్లిక్‌ చేసిన వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
మీ రిజిస్టర్ నెంబర్ అడుగుతుంది. అందులో మీ పరీక్ష రిజిస్టర్ నెంబర్ టైప్ చేయాలి. 
తర్వాత రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి. 
వెంటనే మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. 
అందులో ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఫలితాన్ని సేవ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. 
తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని మీ వద్దే ఉంచండి.