దేశ ప్రధాన మంత్రికి వడ్డించే ఆహార పదార్థాలు, అవి వండే తీరు సామాన్యమైన విషయం కాదు. నిపుణులైన చెఫ్‌లు, ఆయన ఆరోగ్యానికి తగ్గట్లుగా వండి ప్రత్యేకంగా వడ్డిస్తుంటారు. ప్రధాని ఎక్కడికి వెళ్లినా ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ఆయన ఆహార అలవాట్లు, ఆరోగ్యం, నచ్చే రుచులు, న్యూట్రీషియన్ అన్నీ బేరీజు వేసుకొని ఆహారాన్ని ప్రధాని కోసం ప్రత్యేకంగా వండుతుంటారు. కానీ, జులై 2న హైదరాబాద్‌కు రానున్న ప్రధాన మంత్రికి మాత్రం ఓ అతి సామాన్యురాలి చేతి వంటను రుచి చూపించబోతున్నారు. ప్రధానికి తెలంగాణ రుచులను తినిపించేందుకు గానూ రాష్ట్ర బీజేపీ అధిష్ఠానం ఆమెను ఏరికోరి ఎంపిక చేసింది.


ఆమెనే ఎందుకు?
కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మ అనే మహిళ గత మూడు దశాబ్దాలుగా వంటలు చేస్తూ జీవిస్తున్నారు. ఈమె సొంతూరు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామం. ఈమెకు 15 ఏళ్లప్పుడే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహం అయింది. దీంతో కరీంనగర్‌ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. అప్పటి నుంచి వంటలు చేయడమే జీవనాధారంగా వీరి కుటుంబం ఉంటోంది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు జిల్లాలో బాగా ఫేమస్ అయ్యాయి. 


ఏకంగా 10 వేల మందికి సైతం సులువుగా చాలా రుచికరంగా వండి పెట్టేయగల నేర్పరిగా యాదమ్మ పేరు తెచ్చుకున్నారు. గతంలో కరీంనగర్ లో మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌ కార్యక్రమాలతో పాటు బండి సంజయ్‌ నిర్వహించిన సమావేశాల సందర్భంగా ఈమెనే వంటలు చేసి పెట్టేది. ఆమె చేతి తెలంగాణ రుచులను తిన్న వారి ద్వారా ప్రశంసలు దక్కాయి. అలా మంచి గుర్తింపు వచ్చింది. 


ఆ గుర్తింపుతోనే ప్రధాని పర్యటన సందర్భంగా యాదమ్మ వంటలను పరిచయం చేయాలనే ఉద్దేశంతో బండి సంజయ్‌ బుధవారం (జూన్ 30) ఆమెను హైదరాబాద్‌ పిలిపించారు. మళ్లీ కొన్ని వంటకాలు చేయించి రుచి చూశారు. చెఫ్‌లు, ఈ సమావేశాలకు ఫుడ్ కమిటీ హెడ్‌గా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, బండి సంజయ్ కలిసి యాదమ్మతో మాట్లాడారు. మొత్తానికి నోవాటెల్ హోటల్‌లో చెఫ్‌లతో కలిసి వంటలు చేయాల్సిందిగా యాదమ్మను కోరారు. సమావేశాల్లో రెండో రోజు పూర్తి శాఖాహార వంటకాలు చేయాలని యాదమ్మతో చెప్పారు. పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి ఐదారు రకాల వంటలు, గంగవాయిలి కూర పప్పు, పచ్చిపులుసు, సాంబారు, గుత్తి వంకాయ వంటి కూరగాయలు వండుతాం. సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్షాలు, పాయసం, పప్పుగారెలు లడ్డు వంటకాలను యాదమ్మ చేయనున్నట్లు తెలుస్తోంది.


ఈ సందర్భంగా యాదమ్మ మాట్లాడుతూ.. మోదీ సారు నేను చేసే వంట తింటారంటే అంతకంటే గొప్ప ఏముంటుందంటూ ఆమె ఉబ్బితబ్బిబ్బు అయ్యారు.