మటన్ కూర, వేపుడు, బిర్యానీ... ఇవేగా ఎక్కువగా మటన్ తో వండుకునే వంటలు. ఇక కీమా బిర్యానీ చాలా మంది చేసుకుంటారు. మటన్ తో టేస్టీ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. కీమా ముట్టీలు నాన్ వెజ్ ప్రియులకు చాలా నచ్చే స్నాక్స్. కరకరలాడుతూ తినే కొద్దీ ఇంకా తినాలపిస్తుంది. వీటివి చేసుకోవడం కూడా చాలా సులువు. సమయం కాస్త ఎక్కువ పడుతుంది కానీ ప్రాసెస్ మాత్రం ఈజీ. కీమా ఉడకబెట్టడానికే సమయం పడుతుంది. కీమా ఉడికిపోతే మిగతాదంతా పకోడీలు వేసినంత ఈజీగా వీటిని వేసేయచ్చు. 


కావాల్సిన పదార్థాలు
శెనగపప్పు - ఒక కప్పు
మటన్ కీమా - అరకిలో
ఉల్లిపాయ - ఒకటి
కొత్తిమీర - ఒక కట్ట
పచ్చి మిర్చి - నాలుగు 
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకు తగినంత 


తయారీ ఇలా
1. శెనగపప్పును ముందే నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే ఉదయానికి బాగా నానుతాయి. 
2. కీమాను నీళ్లు పోసి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. కాస్త పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. 
3. శెనగపప్పును మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ రుబ్బులో కీమాను కూడా బాగా కలుపుకోవాలి. 
4. కొంతమంది శెనగపప్పు, కీమా కలిపి గ్రైండ్ చేసుకుంటారు. అలాగే అయితే ఆ రెండు బాగా కలుస్తాయని వారి ఉద్దేశం.మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. 
5. ఆ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు అన్నీ వేసి కలపాలి. 
6. ఒక పావుగంట సేపు ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. 
7. ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి వేడెక్క దాకా వెయిట్ చేయాలి. 
8. నూనె వేడెక్కాక కీమా మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకుని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. 
9. బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించి తీసి సర్వ్ చేసుకోవాలి. ఇవి పుదీనా చట్నీతో తింటే అదిరిపోతాయి. స్పైసీ కావాలనుకునేవారు మరికొన్ని పచ్చిమిర్చిలను కలుపుకోవచ్చు. 


మటన్ కూరలు తిని బోర్ కొట్టినవారు కీమా ముట్టీలను ఆస్వాదించవచ్చు. మధుమేహులు అధికంగా మటన్ ను తినకూడదు కానీ, మిగతావారంతా తినవచ్చు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. బి విటమిన్లు, విటమిన్ ఇ, కె, అమినో యాసిడ్స్, కాల్షియం, జింక్, కాపర్, సెలీనియం, పొటాషియం, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి, దెబ్బతిన్న కణాలు సరిచేయడానికి మటన్లోని పోషకాలు అవసరం. ముఖ్యం గర్భిణులు కచ్చితంగా మటన్ తినాలి. దీనివల్ల పుట్టే బిడ్డలకు న్యూరస్ ట్యూబ్ వంటి సమస్యలు రావు. 


Also read: మీ గుండె కోసం వీటిలో ఒక్కటైనా రోజూ తినండి


Also read: భవిష్యత్తంతా బంగాళాదుంప పాలదే, చెబుతున్న ఫుడ్ ట్రెండ్స్ రిపోర్టు