గుండె గట్టిగా పనిచేసినంత కాలం దాన్ని పట్టించుకోం. ఏదో ఒక్కసారి గుండెలో కలుక్కుమంటే, చిన్నగా నొప్పి వస్తే కలవరపడిపోతాం. గుండె నీరసిస్తే శరీరం మొత్తం మూలన పడిపోతుంది. గుండెకు ఏదో అయ్యే వరకు వేచి ఉండకుండా ముందు నుంచే దానికి మేలు చేసే ఏదో ఒక ఆహారాన్ని తినడం ఉత్తమం. కింద చెప్పిన ఆహారాలలో ఏదో ఒకటి కచ్చితంగా మీరు తినే ఆహారంలో రోజూ ఉండేట్టు చూసుకోండి. ఓరోజు ఒకటి తింటే, మరుసటి రోజు మరొక ఆహారపదార్థాన్ని తినేలా ప్లాన్ చేసుకోండి.
పెరుగు
గుండె జబ్బులున్న వాళ్లకి పాలకన్నా పెరుగు చాలా మేలు చేస్తుంది. అయితే ఆ పెరుగును వెన్న తీసిన పాలతో చేసినదై ఉండాలి. వెన్న తీయకపోతే కొవ్వుశాతం అధికంగా ఉండి కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. పెరుగులో పొటాషియం, మెగ్నిషియం, క్యాల్షియం వంటివి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. భోజనం తినేప్పుడు చివరలో పెరుగును, మజ్జిగను తినడం ముఖ్యం.
చిక్కుళ్లు
చిక్కుడ జాతి కూరగాయలను రెండు రోజులకోసారైనా కచ్చితంగా తినాలి. వీటిలో రెండు రకాల పీచు పదార్థాలు ఉంటాయి. ఈ పీచు రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటుంది. చిక్కుళ్లు తినడం వల్ల పీచు పొట్టలో చేరి నిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు కూడా పెరగరు. కొలెస్ట్రాల్ చేరకపోవడం, బరువు పెరగకపోవడం రెండూ గుండెకు మేలు చేసేవే.
చేపలు
చేపలు గుండెకు మేలు చేసే ఆహారం. రక్తపోటు తగ్గటానికి, శరీరంలో వాపు తగ్గటానికి, రక్తనాళాల్లో రక్త సరఫరా సరిగా జరగడానికి, గుండె చక్కగా కొట్టుకోవడానికి ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అవసరం. ఇవి చేపల్లో అధికంగా ఉంటాయి. గుండెకు ఆరోగ్యాన్నందించే మెగ్నిషియం, పొటాషియం ఇందులో ఉంటాయి.
పాలకూర
గుండె కోసం పాలకూరను ప్రతి రెండు రోజులకోసారి తినడం చాలా అవసరం. రక్త పోటు తగ్గడానికి పాలకూరలోని పోషకాలు సహకరిస్తాయి.దీని వల్ల గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. పాలకూరలో పీచు అధికంగా ఉంటుంది. అలాగే ఫోలేట్ అధికంగా లభిస్తుంది. ఇవి రక్తం గడ్డలు కట్టకుండా కాపాడుతాయి. కాబట్టి గుండెకు అంతా మంచే జరుగుతుంది.
వాల్‌నట్స్
మెదడు ఆకారంలో ఉండే వాల్ నట్స్ మెదడుకే కాదు, గుండెకు బలాన్నిస్తాయి. రోజుకు గుప్పెకు వాల్ నట్స్ తినేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి కనుక ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు రావు. రక్తంలో కొలెస్ట్రాల్ చేరనివ్వదు, అంతే రక్తంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు. ఫలితంగా గుండె పోటు వంటివి కలగవు.
Also read: భవిష్యత్తంతా బంగాళాదుంప పాలదే, చెబుతున్న ఫుడ్ ట్రెండ్స్ రిపోర్టు
Also read: వింత వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ, ఇది వారసత్వంగా వస్తుందట!