Garuda Purana In Telugu: మరణాన్ని అడ్డుకోవ‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు. అయితే మరణం తర్వాత ఆత్మ ఏమవుతుంది..? లేదా మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందనే దానిపై చాలా మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. హిందూ మత గ్రంథమైన గరుడ పురాణంలో మరణం గురించి స‌మ‌గ్రంగా వివరించారు. జీవి పుట్టుక‌- మరణం, పాపం - పుణ్యం, స్వర్గం - నరకం గురించి ఈ గ్రంథం పూర్తిగా తెలియజేస్తుంది.


మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..?


మరణించిన వ్య‌క్తి ఆత్మ కదలిక గురించి మనం ఎవరిని అడిగినా, మనకు భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. హిందూ మతంలో కూడా దీని గురించి అనేక నమ్మకాలు ఉన్నాయి. సాధారణంగా, కుటుంబ సభ్యుల మరణం తర్వాత, వారి వస్తువులను జ్ఞాప‌కంగా, గుర్తుగా ఉపయోగిస్తారు, అయితే కొందరు మరణించిన వారి వస్తువులను నాశనం చేస్తారు. గరుడ పురాణంలో.. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కొన్ని విషయాలు ప్రస్తావించారు. మృతి చెందిన వారికి సంబంధించిన వ‌స్తువుల‌ను మనం తప్పుగా ఉపయోగించకూడదు. ఇది చనిపోయిన వారి ఆత్మను ఆకర్షిస్తుందని, ఫ‌లితంగా ఇంట్లో ప్రతికూలతను వ్యాప్తి చేస్తుందని నమ్ముతారు.


Also Read: గ‌రుడ పురాణం ప్ర‌కారం వీరి నుంచి ఆహారం తీసుకుంటే నరకానికే


1. ఆభరణాలు లేదా బంగారం


ప్రతి వ్యక్తికి తాను ధ‌రించే ఆభరణాల పట్ల ఎంతో అనుబంధం ఉంటుంది. ఇది చనిపోయిన వ్యక్తి ఆత్మకు కూడా వర్తిస్తుంది. గరుడ పురాణం ప్రకారం, మరణించిన వ్యక్తికి సంబంధించిన‌ నగలు ధరించకూడదు. వాటిని ధ‌రిస్తే మరణించిన వ్యక్తి శక్తి లేదా ఆత్మ అతని ఆభరణాలను ధరించిన వ్యక్తిని ఆవ‌హిస్తుంది. అలా జ‌ర‌గ‌కూడ‌ద‌నుకుంటే ఏం చేయాలో కూడా గ‌రుడ పురాణంలో సూచించారు. మీరు వారి ఆభరణాలను ఉపయోగించాలనుకుంటే, ఆ నగలను క‌రిగించి, వాటితో కొత్త న‌గ‌లు చేయించుకుని ధరించండి. కొత్త నగలను తయారు చేయించుకుని మీరు ఉపయోగించవచ్చు. అయితే య‌ధాత‌థ స్థితిలో నగలు ధరించడం మానుకోవాలి. మరోవైపు, మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు తన ఆభరణాలను మీకు బహుమతిగా ఇస్తే, మీరు దానిని ఉపయోగించుకోవచ్చు, వాటిని పవిత్రంగా ఉంచవచ్చు. అలా కాకుండా మరణించిన వ్యక్తి వాడిన ఆభరణాలను ధరించి తప్పు చేయవద్దు.


2. దుస్తులు


ఒక వ్యక్తికి ఆభరణాల కంటే తను వేసుకునే దుస్తులంటే చాలా ఇష్టం. గరుడ పురాణం ప్రకారం, మరణించిన తర్వాత కూడా, మరణించిన వ్యక్తి ఆత్మ ప్రాపంచిక అనుబంధాన్ని విడిచిపెట్టదు. అటువంటి పరిస్థితిలో, మీరు వారి దుస్తులను ధరించడం వ‌ల్ల‌ వారి ఆత్మను ఆకర్షించవచ్చు. అందుకే చనిపోయిన వారి దుస్తులు ధరించడం మానుకోవాలి. ఒక వ్యక్తి మరణించిన తరువాత, అతని వస్త్రాలు దానం చేయాలి. అలా చేయ‌డం వల్ల చ‌నిపోయిన వ్య‌క్తి ఆత్మకు శాంతిని, మోక్షాన్ని ఇస్తుంది.


3. చేతి గడియారం


గరుడ పురాణం ప్రకారం, కుటుంబ సభ్యుల మరణం తరువాత, వారి చేతి గడియారాన్ని కూడా ఉపయోగించకూడదు. చనిపోయినవారి సానుకూల, ప్రతికూల శక్తి వాచ్‌లో నివసిస్తుందని నమ్ముతారు. చనిపోయిన వారి చేతి గడియారాన్ని ధరించిన వ్యక్తి ప్రతికూల శక్తితో ప్రభావితమవుతాడు. ఫ‌లితంగా అతను చనిపోయిన వారి గురించి మళ్లీ మళ్లీ కలలు కంటాడు. ఈ కారణాల వల్ల మనం చనిపోయిన వ్యక్తి చేతి గడియారాన్ని ఉపయోగించకూడదు.


Also Read: విజ‌యం మీ వెంటే ఉండాలంటే మీకు ఈ ల‌క్ష‌ణాలు ఉండాలి..!


గరుడ పురాణంలో చెప్పినట్లుగా, మరణానంతరం మనం ఆ వ్యక్తితో ముడిపడి ఉన్న ఈ 3 వస్తువులను ఉపయోగించడం వల్ల మరణించిన ఆత్మకు విముక్తి లభించదు. ఆ వస్తువులను మళ్లీ మళ్లీ తమ సొంతం చేసుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. పైన పేర్కొన్న‌ 3 విషయాలు మాత్రమే కాదు. చనిపోయిన వ్యక్తి ఎక్కువగా ఇష్టపడే వాటిని మనం ఉపయోగించకూడదు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధ్రువీకరించడం లేదని గమనించగ‌లరు.