Varanasi History and Origin of Banaras: ఒకప్పుడు విశ్వమొత్తం నీరే ఉండేది. మరో వస్తువుకి తావులేదు. అంతటా ఉన్న పరమేశ్వరుడు సాకారంగా( ఒక రూపంతో) కనిపించాలి అనుకున్నాడు. అప్పటికి సృష్టిలో రుషులు లేవు, మునులు లేరు, బ్రహ్మ లేడు. అప్పుడు కొంత భాగాన్ని సృష్టించి విష్ణువును తలుచుకుని విష్ణువును ఇక్కడి నుంచి సృష్టిచేయి అని చెప్పాడు. విష్ణువు సృష్టి కార్యం కోసం తపస్సు చేస్తున్నాడు. విష్ణువు తపస్సు వల్ల పాదాల నుంచి గంగాదేవి పుట్టింది. సృష్టించిన కొద్ది భాగాన్ని కప్పేస్తోంది. అప్పుడు ఈశ్వరుడు చూసి త్రిశూలంతో ఆ భాగాన్ని పైకి తీశాడు. ఆ త్రిశూలం నాటిన భాగం కాబట్టి కాశీగా పిలుస్తారు. కాశిక అంటే త్రిశూలం... కాశిక తీసినది కాబట్టి కాశిగా పిలుస్తారు. అంటే సృష్టిలో మొదట పుట్టిన భాగమే కాశీ. ఆ తర్వాత విష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. బ్రహ్మ ద్వారా ఈ సృష్టి అంతా మొదలైంది. 


Also Read: గంగా పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, పుష్కరాలు ఎలా ప్రారంభమయ్యాయి!


మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరం వారణాసి
త్రిశూలంపై శివుడు సృష్టించిన భాగంలో కూర్చునే బ్రహ్మదేవుడు భూమినీ సృష్టించాడు. దేవతలు, రుషుల విన్నపం మేరకు శివుడు త్రిశూలం మీద ఉన్న భూఖండాన్ని అలాగే దించి నేలమీద నిలబెట్టాడనీ అదే కాశీ పట్టణమనీ శివపురాణం పేర్కొంటోంది. అందుకే బ్రహ్మదేవుడి సృష్టి ప్రళయకాలంలో నశించినా కాశీపట్టణం మాత్రం చెక్కుచెదరదట. అంతేకాదు, దీన్ని మనిషిని విశ్వంలో ఐక్యం చేసే నగరంగానూ చెబుతారు. అందుకే అక్కడికి వెళ్లినవాళ్లకి తిరిగి రావాలనిపించదు. 


మరో కథనం
కైలాసంలో సన్యాస జీవితాన్ని గడిపే పరమేశ్వరుడు పార్వతిని కళ్యాణం చేసుకున్న తర్వాత కాశీని నివాసంగా చేసుకున్నాడట. కొంతకాలానికి అక్కడ ఉన్న దేవతలంతా ఈ నగరాన్ని చక్కగా తీర్చిదిద్దేందుకు దివోదాసును రాజుగా ఉండ మన్నారు. ‘శివుడు ఇక్కడ ఉంటే దేవగణం ఆయన చుట్టూనే ఉంటారు కాబట్టి పాలించలేను’ అన్నాడట దివోదాసు. అప్పుడు ఈశ్వరుడు పార్వతితో సహా మందర పర్వతానికి తరలివెళ్లాడు. కానీ అక్కడ మనసు లగ్నంకాక..తిరిగి కాశీకి రావాలనుకుని దూతలని పంపితే వాళ్లంతా ఆ పట్టణాన్ని చూసిముగ్ధులై అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత గణేషుడిని, బ్రహ్మనీ ... ఇలా ఒకరి తరవాత ఒకరిని పంపిస్తే వాళ్లంతాకూడా వెనక్కు రాలేదు. చివరకు తన గణాలను పంపిస్తే అవికూడా అక్కడ ద్వారపాలకులులా స్థిరపడిపోయాయి. దీంతో స్వయంగా శంకరుడే దిగివచ్చి... దివోదాసుకి ముక్తిని ప్రసాదించి కాశీలో కొలువయ్యాడన్నది ఓ పౌరాణిక గాథ. వీళ్లంతా కాశీ పట్నంలో ఉండాలనుకున్నది సౌఖ్యంకోసం కాదు అన్ని బంధాలనీ దాటి విశ్వంలో కలిసే అనుబంధం కోసం మాత్రమే. 


వేదాల్లో ఇతిహాసాల్లో కాశీ ప్రస్తావన
ఐదువేల సంవత్సరాలక్రితమే కాశీ నగరం ఉందనీ.. అందుకే వేదాల్లోనూ ఇతిహాసాల్లోనూ కాశీ నగరం ప్రస్తావన ఉందనేది పండితుల అభిప్రాయం. మూడు వేల సంవత్సరాలనాటిదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ స్పష్టత లేదు. పూర్వం ఇక్కడ 72 వేల గుడులు ఉండేవనీ యోగశాస్త్రం ప్రకారం ఇది మనిషి శరీరంలోని నాడుల సంఖ్యతో సమానమనీ అంటారు. దేశవిదేశీ శాస్త్రవేత్తలు కాశీకి వచ్చి పరిశోధనలు చేయగా శక్తి చలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించినట్లు గుర్తించారు.


Also Read: గంగా పుష్కరాలకు కాశీ వెళుతున్నారా - టెంట్ సిటీలో రూమ్స్ ఇలా బుక్ చేసుకోండి


కాశీ ముందు స్వర్గం సరితూగదు
శ్రీనాధుడు చెప్పినట్టు స్వర్గాన్ని కాశీని పోలిస్తే...కాశీ ముందు స్వర్గం సరితూగదు. ఈశ్వరుడు మొదటిసారిగా తన మనస్సుతో సృష్టించిన నగరం, విశ్వానికి ఆది నగరం కాబట్టి ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు విశ్వనాథుడిగా వెలిశాడు. అందుకే కాశీ అంత గొప్ప క్షేత్రం. ప్రళయాంతకంలో కూడా .. అంటే స్వర్గం, బ్రహ్మ, సమస్త విశ్వం పడిపోయిన తర్వాత కూడా కాశీ నగరం మిగిలిపోతుందని స్కంద పురాణంలో ఉంది.