Ganesh Nimajjanam 2022: ఒక్కో తత్వానికి ఒక్కొక్కరు ప్రతీకలు... జల తత్వానికి ప్రతీక వినాయకుడు. అందుకే ‘గంగాసుతాయ నమః’ అని వినాయకుణ్ని పూజిస్తాం.


ఆకాశస్యధిపో విష్ణుః అగ్నిశ్చైవ మహేశ్వరః
వాయో సూర్యః క్షితిరీశః జలరూపో వినాయకః


మహాగణపతి ఆరాధనతో పకృతి పులకిస్తుంది. ప్రకృతి ధర్మాన్ని మానవాళి మరచిపోకుండా ఉండేందుకే ఏడాదికొకసారి మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు.  గణపతి పండుగలోని అంతరార్థం...ఆయనకు ఉండ్రాళ్లు పెట్టడం, భారీ విగ్రహాలను ప్రతిష్టించడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం కాదు..ఏ మట్టిని సస్యశ్యామలం చేయడంలో ప్రేరణశక్తిగా ఉన్నాడో ఆ గణపయ్యని శ్రద్ధతో పూజించడమే ముఖ్య ఉద్దేశం. మహాగణపతి అంటే పెద్ద పెద్ద రంగు రంగుల విగ్రహాలు కాదు.. మట్టితో తయారు చేసిన స్వచ్ఛమైన రూపం. 


Also Read: అక్టోబరు, నవంబరులో ఈ రోజుల్లో తిరుమల శ్రీవారి దర్శనం రద్దు


జలసిరులు పెంచేందుకు
మట్టి అంటే భూమాతకు చిహ్నం. ఏ పదార్థమైనా ఆమె స్వరూపమే. భూదేవికి మనసారా నమస్కరించి, ప్రేమపూర్వకంగా కాస్తంత మట్టిని తీసుకుని గణపతి ప్రతిమచేయాలి. వానాకాలం మొదలవడానికి ముందే చెరువులు, కుంటల్లో క్రమపద్దతిలో మట్టి తీయడంతో కాలవలు, కుంటలు, చెరువుల్లో నీటినిలువ సామర్థ్యం పెరిగేది. అంటే వినాయకుని ప్రతిమల తయారీ వెనుకున్న ఓ అంతరార్థం చెరువులు, కాల్వల పూడికతీయడం. అంటే వినాయకుడు ఇంట్లో అడుగుపెట్టక ముందే జలసిరులతో చెరువులు,కుంటలు కళకళలాడాలి. మరోవైపు మట్టి పూడికతీత పనుల వల్ల భూగర్భజల మట్టం పెరిగేది.  


మొక్కలకు ఎరువుగా…
ఇంట్లో మట్టి ప్రతిమలు పూజాదికాలు పూర్తయ్యాక...పత్రి, నవధాన్యాలతో కలిపి ఇంటి పెరట్లో చెట్టుకింద ఉంచేవారు. తద్వారా ఎంత బలహీనంగా ఉండే చెట్టు అయినా ఏపుగా పెరిగేది. ఎందుకంటే పూజాద్రవ్యాల్లోని పోషకవిలవలు, పత్రిలోని విశిష్టగుణాలు ఉండటమే ఇందుకు కారణం. 


నిమజ్జనం వెనుక
నవరాత్రుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలో చెరువులోనో,  కుంటలోనూ నిమజ్జనం చేస్తారు. కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక...  ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ ను జలంలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బాక్టీరియా నశిస్తుంది. అంతేకాదు, ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగున్న పర్యావరణ పరమ రహస్యం.


Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!


గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ! స్వస్థాన పరమేశ్వర
యత్ర బ్రహ్మాదయో దేవ! తత్ర గచ్ఛ గణాధిపా॥


‘పరమేశ్వర స్వరూపుడవైన ఓ గణనాయకా ! మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి, మా పూజలు అందుకొని మమ్మల్ని అనుగ్రహించిన ఓ దైవమా! ఏ దేవలోకం నుంచి అయితే వచ్చావో, బ్రహ్మాది దేవతలు ఉండే నీ స్వస్థలమైన ఆ దేవలోకానికి వెళ్లిరమ్మ’ని ప్రార్థిస్తూ గణేశుడిని నిమజ్జనం చేస్తారు. 


మట్టిలో కలవాల్సిందే
భగవంతుడు తయారుచేసిన ఈ శరీరం ఉన్నన్ని రోజులు ఎంత వైభోగం అనుభవించినా చివరకు పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే తప్ప శాశ్వతం కాదన్న సత్యాన్ని తెలియజేస్తాడు గణనాథుడు. గణపతి జలరూపానికి ప్రతినిధి కనుక నీళ్లలో లయం చేయడం ద్వారా వచ్చిన చోటుకే చేరుకుంటాడన్నది తాత్వికార్థం.