Which tree the Camphor used in pujas is Made
ఈ పూజ నిర్వహించిన కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడంతోనే పూజ పూర్తవుతుంది. ఇంతకీ ఆ కర్పూరం ఎలా వచ్చింది? ఏ చెట్టు నుంచి తయారవుతుంది? ఎందుకు మంట తగిలిన వెంటనే ఠక్కున వెలిగి ఆవిరైపోతుంది. కనీసం బూడిద కూడా లేకుండా ఎలా ఆవిరైపోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..
మార్కెట్లో రెండు రకాలైన కర్పూరం దొరుకుతుంది
1. సహజ కర్పూరం
2. ఫ్యాక్టరీలో కృత్రిమంగా తయారుచేసే కర్పూరం
సహజకర్పూరం ఓ ప్రత్యేకమైన చెట్టునుంచి తయారవుతుంది. ఈ చెట్టు శాస్త్రీయ నామం Cinnamomum Camphora..అయితే అంతా కర్పూరం చెట్టు అనేస్తారు. ఈ చెట్టు ఎత్తు 50 నుంచి 60 అడుగులు. ఈ చెట్టు ఆకులు గుండ్రగా 4 అంగుళాల వెడల్పుతో ఉంటుంది. ఈ చెట్టు బెరడు నుంచి కర్పూరం తయారు చేస్తారు.
కర్పూరం చెట్ల ఆకులు, కొమ్మల నుంచి తయారు చేస్తారు..తులసి సహా కొన్ని రకాల మొక్కల నుంచి కూడా కర్పూరం తయారు చేస్తారు. కర్పూరం చెట్ల కాండంపై గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాల నుంచి కర్పూరం తయారవుతుంది.
ఈ చెట్టు ఆకులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పూలు చాలా చిన్నవిగా ఉంటాయి, పంజడ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అక్టోబరులో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు జపాన్, చైనా దేశాల్లో పెరుగుతాయి..మన దేశంలో నీలగిరి కొండల్లో విరివిగా పెంచుతారు. మైసూర్, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.
ఈ కర్పూరం చెట్లు తూర్పు ఆసియాలో..ప్రత్యేకంగా చైనాలో ఉద్భవించిందని చెబుతారు, మరికొందరు ఇది జపాన్ కి చెందిన మొక్క అని భావిస్తారు. ఒకప్పుడు ఐస్ క్రీమ్ ని కర్పూరం చెట్టునుంచి తయారు చేసేవారట. చైనాలో టాంగ్ రాజవంశం కాలంలో ఈ చెట్టు బాగా ప్రాచుర్యం పొందింది. చైనీయులు తయారు చేసే వివిధ రకాల ఔషధాల్లో ఈ చెట్టు బెరడుని ఉపయోగించేవారట.
కర్పూరాన్ని భారతదేశంలో ఉత్పత్తి చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగాయి. 1932లో ప్రచురితమైన ఓ ఆర్టికల్ లో.. కోల్‌కతాలోని స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ R.N. చోప్రా , బి. ముఖర్జీ 1882-83 టైమ్ లో లక్నోలో ఓ ఉద్యానవనంలో కర్పూరం ఉత్పత్తి చేసే చెట్లు పెంచారని రాశారు కానీ ప్రయత్నం ఎక్కువ కాలం సక్సెస్ అకాలేదు.
కర్పూరం చెట్టును నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. దీన్నుంచి కేవలం పూజ కోసం ఉపయోగించే కర్పూరం మాత్రమే కాదు చాలా వస్తువులు తయారీలో ఉపయోగిస్తారు. కొన్ని ఆయిల్స్‌తో పాటు వివిధ రకాల మందులు, పెర్ఫ్యూమ్‌లు, సోప్స్ కూడా తయారు చేస్తారు. ఈ చెట్టులో ఆరు రకాల రసాయనాలుంటాయి. కర్పూరంలో అధిక మొత్తంలో కార్బన్ , హైడ్రోజన్ ఉండడం వల్ల దహన ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే కొంచెం వేడి తగిలినా మండుతుంది. వేడిచేసిన వెంటనే గాలిలో వ్యాపించి ఆక్సిజన్ తో కలసిపోతుంది.
కర్పూరం అనగానే హారతి కర్పూరం అని మాత్రమే అనుకుంటారు...అయితే వీటిలో 15 రకాలున్నాయి. అవే... ఘన సారం, భీమసేనం, ఈశావాసం, ఉదయ భాస్కరం, కమ్మ కర్పూరం, ఘటికం, తురు దాహం, తుషారం, హిమ రసం, హారతి, శుద్ధం, హిక్కరి, పోతాశ్రయం, పోతాశం, సితాభ్రం.
హారతి కర్పూరాన్ని కొన్ని రసాయనాలు ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. టర్పంటైన్ ను కలిపి రసాయనిక పద్ధతిలో దీన్ని తయారు చేయడం వల్ల ఇది తినే పదార్థాల్లో కలిపేందుకు ఉపయోగపడదు. వీటిని తింటే ప్రమాదకరం కూడా. ఇక తినే కర్పూరంలో ఔషధ గుణాలుంటాయి. వీటిని పదార్థాలు పాడవకుండా నిల్వఉంచేందుకు వినియోగిస్తారు. ఆహారంలో పచ్చ కర్పూరాన్ని భాగంగా చేస్తే వంటకాలకు ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తాయి.