Ganesh Chaturthi 2024 Famous Ganesh Temples In India:  ఏటా భాద్రపద మాసంలో వచ్చే నాలుగోరోజు...అంటే చవితి రోజు వినాయకచతుర్థి జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం వినాయకచవితి జరుపుకోనున్నారు. వాడవాడలా బొజ్జగణపయ్య కొలువుతీరనున్నాడు. ప్రతి ఇంట్లోనూ మట్టి వినాయకుడు పూజలందుకోనున్నాడు. బొజ్జగణపయ్య ఆశీస్సులు ఉంటే చాలు..సకల కార్యాలల్లో విజయం తథ్యం అని భావిస్తారు భక్తులు. అయితే చాలామంది వినాయకచవితి రోజు ఇంట్లోనే పూజలు చేసుకుంటే..కొందరు ఆలయాలను సందర్శించాలి అనుకుంటారు. అలా అయితే మీరు ఈ ఆలయాలకు వెళ్లడం మంచిది. ఇప్పటివరకూ ఎన్ని దర్శించుకున్నారో ఏవి దర్శించుకోలేదో చూసుకుని ప్లాన్ చేసుకోండి..
 
కాణిపాకం


తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడి ఆలయం అనగానే అందరకీ గుర్తొచ్చే క్షేత్రం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకుడు. కాణిపాకంలో వెలసిన స్వామికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారు నిత్యం పెరుగుతూ ఉంటారని చెబుతారు. అందుకు నిదర్శనంగా వినాయకుడికి  50 సంవత్సరాల క్రితం తొడిగిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. ఇక్కడ స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి విగ్రహం తుది మాత్రం తెలియలేదు. సత్యప్రమాణాలకు నెలవైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధం చెప్పేవారు అస్సలు సిద్ధం కారు. వినాయక చతుర్థి సందర్భంగా కాణిపాకంలో బొజ్జ గణపయ్యకి ప్రత్యేక పూజలు , అభిషేకాలు నిర్వహిస్తారు. సాధారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు కాణిపాకం వెళ్లి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటారు.


so Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?


సిద్ధి వినాయక దేవాలయం 


 సిద్ధి వినాయక దేవాలయం ముంబైలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఒకటి. గణేషుడి అష్టరూపాలు లోపల చెక్కి కనిపిస్తాయి. గర్భగుడి లోపల పైకప్పు బంగారు పూతలో వెలిగిపోతుంటుంంది. 1801 లో నిర్మించిన ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. వినాయకచవితి పర్వదినాల్లో మరింత రద్దీగా ఉంటుంది.  


మనకుల వినాయగర్ దేవాలయం


పుదుచ్చేరి లో ఉన్న ఈ ఆలయం పుణ్యక్షేత్రం మాత్రమే కాదు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కూడా. అప్పట్లో బ్రిటీష్ వారు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారట. బీచ్ రోడ్ కి సమీపంలో ఉండే ఈ ఆలయంలో నిత్యం భక్తుల సందడి ఉంటుంది. వినాయకచవితి పర్వదినాల్లో మరింత రద్దీ ఉంటుంది.  


కురుడుమలై శక్తి గణపతి


బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరం కోలూరు జిల్లా ముళబాగిలు సమీపంలో కొలువయ్యాడు కురుడుమలై శక్తి గణపతి. చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో వినాయకుడిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. గర్భగుడిలో  14 అడుగుల ఎత్తున్న వినాయక విగ్రహం ఏక సాలగ్రామ శిలతో తయారు చేశారు. ఈ విగ్రహాన్ని స్వయంగా బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుడు ప్రతిష్టించారని ప్రతీతి.  


చింతమన్ గణేష్ ఆలయం 


మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉన్న అతిపెద్ద గణేశ దేవాలయం చింతమన్ గణేష్ ఆలయం. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధిలో మూడు వియాక విగ్రహాలుంటాయి..వాటిలో ఒకటి చింతామన్, రెండోది ఇచ్చమన్ మూడోది సిద్ధి వినాయక విగ్రహం. పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి ముందే చింతామన్ వినాయక ఆలయాన్ని దర్శించుకోవాలంటారు. 


Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!


గణేష్ టోక్ టెంపుల్


 గాంగ్టక్ లో ఉన్న ఈ ఆలయం చాలా ఫేమస్. సాధారణంగా హనుమాన్ దేవాలయంలో జెండాల సందడి ఉంటుంది. కానీ ఇక్కడ వినాయకుడి ఆలయానికి వెళ్లే మార్గం మొత్తం తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు , ఊదా రంగు జెండాలతో దారంతా ఇంద్రధనస్సు విరిసినట్టు కనిపిస్తుంది. ప్రతి జెండాపైనా ఓ సందేశం రాసి ఉంటుంది.  
 
గణపతి పూలే ఆలయం 


మహారాష్ట్ర కొంకణ్‌లోని రత్నగిరి జిల్లాలో ఉన్న గణపతి పూలే ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. సముద్రతీరాన ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులతో పాటూ పర్యాటకులు వస్తుంటారు. సుమారు 400 సంవత్సరాల నాటి చరిత్రకలిగిన ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రచారంలో గాథ ప్రకారం ఇక్కడ వినాయకుడు..అగస్త్య మహామునికి ప్రత్యక్షమయ్యాడని.. ఆ తర్వాత విగ్రహాన్ని ప్రతిష్టించి ఆయన తపస్సు ప్రారంభించారని చెబుతారు. గర్భుగుడిలో ఉన్న వినాయకుడి విగ్రహం తెల్లటి ఇసుకతో నిర్మించారు . వినాయకనవరాత్రుల సమయంలో ఆలయాన్ని అత్యద్భుతంగా అలంకరిస్తారు


త్రినేత్ర దేవాలయం
  
రాజస్థాన్  రణతంబోర్‌లో ఉన్న త్రినేత్ర దేవాలయం దేశంలోనే అత్యంత పురాతన ఆలయంగా చెబుతారు. ఇక్కడ గణనాథుడు తన కుటుంబంతో సహా కొలువయ్యాడు. వినాయకుడు త్రినేత్రుడిగా భక్తులకు దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇదే..


మోతీ డుంగ్రీ


రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఈ ఆలయం 500 సంవత్సాల క్రితంది అని చెబుతారు. జైపూర్ వెళ్లిన భక్తులు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రముఖ పర్యాటక ప్రదేశం ఇది. బిర్లాటెంపుల్ పక్కనే ఈ గణేషుడి ఆలయం ఉంటుంది. వినాయకచవితి వేడుకలు ఘనంగా జరిగే టాప్ 10 ఆలయాల్లో ఇదొకటి. 


Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి! 
  
దగ్దుషేత్ హల్వాయి గణపతి 


పూణేలో ఉన్న దగ్దుషేత్ హల్వాయి గణపతి ఆలయం చాలా ఫేమస్. ఇక్కడ వినాయక విగ్రహాన్ని నిత్యం బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఏడుఅడుగులపైనే ఉండే ఈ భారీ విగ్రహం నాలుగు అడుగుల వెడల్పుతో ఉంటుంంది. దేశంలో అత్యంత సంపన్నమైన ట్రస్టులలో ఇదొకటి. శ్రీమంత్ దగ్దుషేక్ అనే స్వీట్స్ వ్యాపారి..ప్లేగు వ్యాధితో మరణించిన తన కుమారుడి జ్ఞాపకార్థం ఈ ఆలాయన్ని నిర్మించాడు.