Ganesh Chaturthi 2022
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవా..సర్వ కార్వేషు సర్వదా!
వినాయకుడు అంటే అద్వితీయుడు ,ఆనంద స్వరూపుడని అర్దం. సకల దేవతాగణములకు అధిపతి గణపతి . అలాంటి మహా శక్తి సంపన్నుడైన ఆగణపతిని పూజిస్తే విఘ్నాలు లేకుండా శుభాలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. వినాయకుడు అంటే నాయకుడు లేనివాడు తనకు తానే నాయకుడు అని అర్దం. అందుకేఏ పని మొదలుపెట్టాలన్నా, అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని వేడుకుంటారు. విఘ్నాలు అంటే ఆటంకాలు...ఆటంకాలు లేకుండా తలపెట్టిన పని పూర్తయ్యేలా చేయమని గణపతిని ఇలా వేడుకుంటారు.
శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాంతయే
అనే శ్లోకంతో ప్రారంభిస్తారు. తలపెట్టిన కార్యంలో ఎలాంటి విఘ్నాలు ఎదురవకుండా ఆశీర్వదించాలని కోరుకుంటారు. మరి ఇంత చిన్న శ్లోకంలో ఉన్న భావం ఏంటో తెలుసా..
Also Read: విఘ్నాధిపతిగా గణపతినే ఎందుకు పూజించాలి, వినాయక చవితి ప్రత్యేకత ఏంటి!
శుక్లాంబరధరం- తెల్లటి వస్త్రాలను ధరించినవాడని అర్థం. తెలుపు పవిత్రతకు, స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి ఆ గుణాలనే తన వ్యక్తిత్వంగా కలిగినవాడు అని చెప్పుకోవచ్చు.
అంబరం - ‘వస్త్రం’ అనీ ‘ఆకాశం’ అనీ రెండు అర్థాలు ఉన్నాయి. అంటే ఆకాశాన్నే ధరించినవాడు అన్న అర్థం కూడా వస్తుంది. సర్వవ్యాప్తి అయిన ఈశ్వరుని తత్వాన్ని ఆకాశంతోనే కొలవగలం
విష్ణుం - విశ్వమంతా వ్యాపించినవాడు అని అర్థం
శశివర్ణం - చంద్రుని వంటి వర్చస్సు కలిగినవాడు అని భావం.
చతుర్భుజం- నాలుగు చేతులు కలవాడు. ఇక్కడ చతుర్భుజాలు ఆ గణేశుడు పాలించే నాలుగు దిక్కులు కావచ్చు; తాను స్వయంగా అర్థం చేసుకుని వేదవ్యాసునికి రాసిపెట్టిన నాలుగు వేదాలు కావచ్చు; మనుషులను తరింపచేసే ధర్మార్థకామమోక్షాలనే నాలుగు పురుషార్థాలు కావచ్చు.
ప్రసన్నవదనం ధ్యాయేత్- ఆ ప్రసన్న ముఖుడిని నేను ధ్యానిస్తున్నానని అర్థం.
Also Read: ఇలాంటి వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి పూజిస్తే ఇంట్లో వాస్తుదోషాలుండవ్, అన్నింటా సక్సెస్ అవుతారు!
ప్రకృతిని కలుషితం చేయకండి!
వినాయకచవితి సందర్భంగా పరిగణలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే..ప్రాకృతికమైన పదార్థాలతో చేసిన గణేశుని ప్రతిమలనే ప్రతిష్ఠించాలి. మట్టి, కొన్నిరకాల పిండి, పసుపు ఇలా రకరకాల పదార్థాలతో వినాయకుడి విగ్రహాలు తయారుచేయవచ్చు. అంతేకానీ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ పదార్థాలతో విగ్రహాన్ని తయారుచేయకూడదు. ఎందుకంటే అవి నీటిలో కరగవు. పైగా రసాయన రంగులు, ప్లాస్టిక్ నీటిని కలుషితం చేసి పర్యావరణానికి నష్టం చేస్తాయి. దేవుణ్ని స్వయంగా తయారుచేసుకుని, మనసారా ప్రతిష్ఠించి కొలుచుకునే వెసులుబాటు ఉన్నప్పుడు దానిని వినియోగించుకోవాలి. మట్టి, పిండి, పసుపు లాంటి నీటిలో కరిగిపోయే పదార్థాలతో గణేశుని ప్రతిమను తయారుచేయండి. రంగులు వాడాలనుకుంటే ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడండి. అవి గణపతిని అందంగా తీర్చిదిద్దడంతోపాటు పర్యావరణానికీ ప్రయోజనం చేకూరుస్తాయి. అంతేకానీ పండుగ పేరుతో పర్యావరణాన్ని కలుషితం చేయడం నిజమైన భక్తి అనిపించుకోదు. మన ఇంట్లో నిత్యం చేసుకొనే పూజలకు బొటనవేలికి మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి. వినాయక చవితి పూజచేసేటప్పుడు మాత్రం అరచేతిని మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవడం మంచిది. ఎంతపెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహం పరిమాణం ప్రకారంగా రోజూ ఆ స్థాయిలో ధూపదీప నైవేద్యములు జరగాలి గనక సాధారణంగా ఇంట్లో చేసుకొనే పూజకు అరచేతికి మించకుండా విగ్రహం వాడటం మంచిది.