ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తినేది జీడిపప్పు. ఎంతో రుచిగా ఉండే వీటిని నెయ్యిలో వేయించుకుని తింటే వచ్చే ఆ రుచే వేరు. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెకి ప్రమాదమని కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందని చాలా మంది భయపడతారు. ఎన్నో పోషకాలు నిండి ఉన్నజీడిపప్పు గుండెకి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి తినడం వల్ల శరీరంలోని అవయవాల పనితీరుకే కాదు చర్మం, వెంట్రుకలకి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మృదువైన, ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది. అంతే కాదు మగవారిలో సంతనోత్పత్తికి అవసరమైన వీర్య కణాలు వృద్ధి చెయ్యడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీడిపప్పుని అనేక వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు. జీడిపప్పుతో పాలు, క్రీమ్ తయారు చేసి వంటల్లో వాడతారు. ఇవి వెయ్యడం వల్ల వంటకాలకు అదనపు రుచి వస్తుంది.


జీడిపప్పులు ఎక్కడ నుంచి వచ్చాయంటే?


కిడ్నీ ఆకారపు గింజగా కనిపించే ఈ జీడిపప్పు బ్రెజిల్ కి చెందినది. బ్రిటిష్ వారి దగ్గర నుంచి ఆఫ్రికా, భారత్ కి పరిచయం చెయ్యబడింది. వేరు శెనగ, బాదం పప్పుల మాదిరిగా ఇది కూడా బోలెడు కేలరీలను కలిగి ఉంటుంది. ఎన్నో పోషకాలను ఇస్తుంది. గర్భిణీలు రోజుకి కొన్ని జీడిపప్పులు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు.


రోజూ జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు


అధిక కేలరీలతో పాటు ఇందులో శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. విటమిన్స్ ఎ, ఇ, కే, రాగి, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్లు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. అనేక పోషకాలు ఉన్న ఈ జీడిపప్పుని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనలు పొందవచ్చు.


గుండె కి మేలు చేస్తుంది: జీడిపప్పు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ రక్త నాళాలు బలంగా తయారయ్యేందుకు దోహదపడతాయి. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు గుండెను ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా రక్షించడంలో సహాయపడుతుంది. అయితే ఇవి మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం కొవ్వు పేరుకుపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.


మధుమేహాన్ని నియంత్రిస్తుంది: జీడిపప్పులో ఆరోగ్యకరమైన సంతృప్త కొవ్వులు ఉన్నాయి. మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు జీడిపప్పును రోజుకు కేవలం 3-4 కి పరిమితం చెయ్యాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.


రోగనిరోధక శక్తిని పెంచుతుంది: జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కండరాలకు అవసరమయిన కొల్లాజెన్ ని ఇది అందించి ఎముకలు ధృడంగా ఉండేలా చేస్తుంది. అదే కాదు మెదడు పనితీరుని పెంచడంలో సహాయపడుతుంది. జ్ఞాపక శక్తిని మెరుగ్గా ఉండేలా చేస్తుంది.


పురుషుల సంతానోత్పత్తిని పెంచుతుంది: జీడిపప్పులో జింక్‌ పుష్కలంగా లభిస్తుంది. ఇది మగవారిలో స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుపరుస్తుంది, తద్వారా సంతానోత్పత్తిని పెంచుతుంది. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు, మధుమేహం కూడా అదుపులో ఉంటాయి. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. 


Also read: మీకు తెలుసా? ‘గర్భం’ వాయిదాకు అండాలను స్టోర్ చేసుకోవచ్చు, అది సురక్షితమేనా?


Also Read: తక్కువ సేపు నిద్రపోతున్నారా? ఇక జీవితం మీద ఆశలు వదిలేసుకోవల్సిందే!