Satwiksairaj Rankireddy Chirag Shetty Confirms Medal: సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టీ జోడీ అద్భుతం చేసింది. శుక్రవారం సరికొత్త చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌లో తొలి పతకం గెలిచిన భారత ద్వయంగా నిలిచింది. క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో ప్రపంచ నంబర్‌ 2 టకురో హోకి, యుగో కబయాషి (జపాన్‌)ని 24-22, 15-21, 21-14 తేడాతో ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో రెండు రౌండ్లు గెలిస్తే వారికి స్వర్ణ పతకం రావడం ఖాయం. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌ చేరితే కనీసం కాంస్యం ఇస్తారు.




నువ్వా నేనా అన్నట్టే!


శుక్రవారం గంటా 15 నిమిషాల పాటు జరిగిన పోరులో సాత్విక్‌, చిరాగ్‌ తిరుగులేని పోరాట పటిమను కనబరిచారు. లోకల్‌ ఫేవరెట్స్‌తో నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. తొలి గేమ్‌లో 12-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో 16-14తో ప్రత్యర్థులు పుంజుకోవడంతో పోటీ రసవత్తరంగా మారింది. రెండు జోడీలు సమానంగా పాయింట్లు గెలిస్తూ 22-22కు చేరుకున్నారు. ఈ క్రమంలో భారత ద్వయం వరుసగా రెండు పాయింట్లతో గేమ్‌ గెలిచింది. రెండో గేమ్‌లో టకురో, యుగో గట్టిపోటీ ఇచ్చారు. విరామానికి 9-9తో సమంగా నిలిచారు. భారత జోడీ కొన్ని తప్పులు చేయడంతో 15-21తో గేమ్‌ కోల్పోయారు. చివరిదైన మూడో గేమ్‌లో చిరాగ్‌, సాత్విక్‌ 16-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. 19-13తో ప్రత్యర్థి జోరుకు కళ్లెం వేశారు. వరుసగా రెండు పాయింట్లు గెలిచేసి గేమ్‌తో పాటు మ్యాచ్‌ గెలిచారు.


ప్రణయ్‌ ఓటమి


సెమీస్‌లో సాత్విక్‌, చిరాగ్‌ ఆరో సీడ్‌, మలేసియా ద్వయం ఆరోన్‌ చియా, సోహ్‌ వూయి యిక్‌తో తలపడనున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో డబుల్స్‌ విభాగంలో మొత్తంగా భారత్‌కు ఇది రెండో పతకం. 2011లో మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, జ్వాలా గుత్తా కాంస్యం గెలిచారు. అంతకు ముందు మరో క్వార్టర్‌ ఫైనల్లో భారత జోడీ ఎంఆర్‌ అర్జున్‌, ధ్రువ్‌ కపిల ఓటమి పాలయ్యారు. మూడు సార్లు స్వర్ణ పతక విజేతలు మహ్మద్‌ అహ్‌సన్‌, హేండ్రా సెతియావన్‌ వారిని ఓడించారు. పురుషుల సింగిల్స్‌లో భారత్‌ కథ ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఓటమి చవిచూశాడు. చైనా షట్లర్‌ జావో జున్ పెంగ్‌తో జరిగిన పోరులో 19-21, 21-6, 21-18 తేడాతో పరాజయం పొందాడు.