మాతృత్వం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొంతమంది తమ కెరీర్ కి గర్భం అడ్డుగా వస్తుందని భావించి గర్భధారణను వాయిదా వేసుకుంటారు. అంతే కాదు తాము ఎప్పుడు పిల్లల్ని కనాలనేది కూడా వాళ్ళే నిర్ణయించుకుంటారు. అలా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే.. మోడల్, మాజీ ఫెమినా మిస్ ఇండియా నటాషా సూరి ఏం చేసిందో తెలుసుకోవల్సిందే.


భవిష్యత్ లో గర్భధారణ కోసం ఆమె తన అండాలను దాచిపెట్టింది. ఒత్తిడి లేకుండా తన దృషి అంతా కెరీర్ పై ఉంచేందుకు తను ఇలా చేస్తున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అండాలను స్థిరీకరించుకోవడం గురించి ఆమె మాట్లాడారు. ప్రస్తుతం తన వయసు 33 సంవత్సరాలని పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం గురించి ఆలోచించేటప్పుడు వాటిని వినియోగించుకోవాలని భావిస్తున్నానని ఆమె పేర్కొంది. దీంతో ఈ విషయంపై పెద్ద చర్చే నడుస్తోంది. మరి, ఇది సురక్షిత విధానమేనా?


అసలు ఈ అండాలను ఫ్రీజింగ్ చెయ్యడం ఏంటి?


ఆడపిల్ల పుట్టుకతోనే లక్షల కొద్దీ అపరిపక్వ అండాలతో పుడుతుంది. పది పన్నేండేళ్ల వయసు వచ్చాక ప్రతి నెల ఒక గుడ్డు విడుదల అవ్వడం మొదలవుతుంది. దీన్నే అండోత్సర్గము (ఒవులేషన్) అంటారు. ఆడపిల్లలకి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసు మధ్యలో విడుదలయ్యే అండాలు నాణ్యంగా ఉంటాయి. 30 దాటిన తర్వాత విడుదలయ్యే అండాలు బలహీనంగా మారతాయి. అందుకే అటువంటి వయసులో గర్భధారణ చెయ్యడం అది నిలబడటం కష్టంగా ఉంటుందని వైద్యులు చెప్తారు. శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగిన తర్వాత చాలా మంది గర్భం ధరించడం చాలా సులువుగా మారిపోయింది. పిల్లల్ని కనలేని వాళ్ళు కూడా ఐవీఎఫ్ ద్వారా మాతృత్వాన్ని పొందగలుగుతున్నారు.


అధునాతన ఫ్రీజింగ్ టెక్నిక్ ఉపయోగించి అండాలను ఎన్ని సంవత్సరాలైనా ఎటువంటి నష్టం జరగకుండా భద్రపరచవచ్చు. భవిష్యత్ లో పిల్లల్ని కనేందుకు ఈ పద్ధతిని వినియోగించుకుంటారు. నటాషా కూడా అదే విధంగా చేశారు. ప్రత్యేకమైన పద్ధతి ద్వారా ఎగ్ సేకరించి దాన్ని ఘనీభవించేలా చేసి నిల్వ చేస్తారు. అవసరం అయినప్పుడు ఆ ఎగ్ ని కరిగించి ల్యాబ్ లో స్పెర్మ్ తో కలిపి గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఇలా చెయ్యడం వల్ల మనకి నచ్చినప్పుడు పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది. కానీ ఇలా చెయ్యడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.


దాని వల్ల వచ్చే దుష్పరిణామాలు


అండోత్సర్గము ప్రేరేపించడానికి అనేక రకాల మందులు ఉపయోగిస్తారు. వాటి వల్ల అండాశయాలు వాపు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా బాధ కలిగిస్తుంది. దీని వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, వికారం, వాంతులు, విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. ఫ్రీజింగ్ చేసిన అండాలను ప్రవేశపెట్టడం వల్ల బిడ్డను కనే అవకాశం విజయవంతం అవుతుంది అనేది చెప్పలేరు. ఒక్కోసారి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. అది అండం ప్రవేశపెట్టిన వారి వయసు మీద ఆధారపడి ఉంటుంది.


గర్భాశయంలో ఇలా అండాన్ని ప్రవేశపెట్టిన తర్వాత శృంగారానికి కొద్ది రోజుల పాటు దూరంగా ఉండాలి. జ్వరం రావడం, తీవ్రమైన కడుపులో నొప్పి, విపరీతమైన రక్తస్రావం, మూత్ర విసర్జన చెయ్యడంలో ఇబ్బంది తలెత్తే అవకాశం కూడా ఉంది. ఇంప్లాంటేషన్ తర్వాత గర్భవతి అయ్యే అవకాశాలు దాదాపు 30 నుండి 60 శాతం వరకు ఉంటాయని అంటున్నారు వైద్య నిపుణులు. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: తక్కువ సేపు నిద్రపోతున్నారా? ఇక జీవితం మీద ఆశలు వదిలేసుకోవల్సిందే!


Also Read: మహిళా సమానత్వ దినోత్సవం ఎలా మొదలైంది? ఆగస్టు 26నే జరిపేందుకు కారణం ఏమిటీ?


.