మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు ఆయనాలున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలానికి మాఘమాసం ఎంత పవిత్రమైనదో దక్షిణాయన పుణ్యకాలానికి కార్తీకమాసం అంత పవిత్రమైనదని పురాణాలలో చెప్పబడింది. కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధివిధానాలన్ని కార్తీక పురాణంలో పేర్కొన్నారు. కానీ మనలో చాలామందికి కొన్ని కారణాలవల్ల కార్తీకమాస వ్రతాన్ని చేయడానికి వీలు కుదరదు. అలాంటి వారు కార్తీక మాసంలో వచ్చే ఈ ఐదురోజులలో తప్పనిసరిగా వ్రతాన్ని ఆచరిస్తే కార్తీక మాసం మొత్తం వ్రతం చేసిన పుణ్యఫలం లభిస్తుందట.
కార్తీక శుద్ద ఏకాదశి నుంచి కార్తీక పూర్ణమి వరకు గల ఈ ఐదు రోజులను పంచ పర్వాలు అంటారు. కార్తీకమాసంలో ఉన్న అన్నీ రోజులు విశేషమైనవే అయినా ప్రత్యేకించి ఈ ఐదు రోజులు కార్తీక మాసంలో ఎక్కువ విశేషమైనవి. కార్తీక శుక్ల ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు. అంటే ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు నెలలను చాతుర్మాస్య వ్రతంగా చెప్తారు. శ్రీ మహా విష్ణువు ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు.. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉండి, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి ఈ ఏకాదశిని ”ఉత్థాన ఏకాదశి” అని పిలుస్తారు
ఇక ఏకాదశి మర్నాడు ద్వాదశి తిథిని ఉత్థాన ద్వాదశి గా పిలుస్తారు. దీన్నే చిలుకు ద్వాదశి అని కూడా అంటాం. కృతాయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని ఈరోజునే మధించారు. కనుక దీన్ని చిలుకు ద్వాదశి లేదా, క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఉసిరిక కొమ్మ విష్ణువు అవతారంగా, తులసీదేవిని లక్ష్మీదేవిగా భావిస్తాం కనుక ఈరోజున ఉసిరిక కొమ్మను, తులసి మొక్కను కలిపి తప్పకుండా పూజించాలి. కార్తీక ద్వాదశి నుంచి పూర్ణిమ లోపల నిర్వహించే తులసీ కళ్యాణం కూడా ఈరోజే జరిపిస్తారు. యతీశ్వరులు, సాధువుల చాతుర్మాస్య వ్రత దీక్ష కూడా ఈరోజుతో ముగుస్తుంది.
కార్తీక శుద్ద త్రయోదశి రోజున కార్తీక విధులను అనుసరిస్తూ, వీలయితే సాలగ్రామం దానం చేయాలి. ఈరోజున కూడా ఉపవాసం ఉండాలి రాత్రి పూట భోజనం చేయరాదు. త్రయోదశి తిథికి శనిదేవుడు అధిపతి కాబట్టి ఈరోజున చేసే పుణ్య కార్యక్రమాల వల్ల శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది.
కార్తీక శుద్ద చతుర్ధశిని వైకుంఠ చతుర్ధశిగా పిలుస్తారు. శివకేశవులకు బేధం లేదని తెలియజేయడానికి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు ఈరోజున కాశీ క్షేత్రానికి వచ్చి, శివుడిని అర్చిస్తాడట. ఈరోజున లింగ వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయాలి. ఈరోజు శివకేశవులని ఆరాధించి దీపదానాన్ని చేయాలి.
ఇక కార్తీక పూర్ణమి చాలా విశేషమైన తిథి. దీన్నే దేవదీపావళి అని, కైశిక పౌర్ణమి అని, తెలంగాణ పరిభాషలో జీటికంటి పున్నమి అని కుమార దర్శనమనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈరోజున జ్వాలాతోరణం, దీపాలను వెలిగించడం, దీపదానాలు, నదీస్నానాలు, తులసీ, ఉసిరి చెట్లను పూజించడంలాంటి పనులను తప్పకుండా నిర్వహించాలి.
Also Read: సర్పదోషాలు తొలగాలంటే నాగుల చవితి రోజున ఇలా చేయండి