rishi sunak :  బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు రిషి సునాక్ సిద్దమయ్యారు. బంకింగ్ హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్ త్రీతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.  లిజ్ ట్రస్ రాజీనామా చేసినందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చార్లెస్ సునాక్‌ను ఆహ్వానించారు. 



రిషి సునాక్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన లిజ్ ట్రస్ 


బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ చివరి ప్రసంగం చేశారు. బ్రిటన్ కష్టకాలంలో ఉందని అయితే అతి త్వరలోనే మళ్లీ కోలుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు బ్రిటన్ పౌరులపై నమ్మకముందని చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా కొత్తగా ఎన్నికైన రిషి సునాక్‌కు ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. బ్రిటన్ రాణికి జాతి అంతిమ వీడ్కోలు పలికిన సమయంలో తాను బ్రిటన్ ప్రధానిగా ఉండటం తనకు గౌరవనీయమని విషయమని లిజ్ ట్రస్ చెప్పుకున్నారు.   బ్రెగ్జిట్ వల్ల సొంతంగా ప్రయోగాలు చేసి ప్రయోజనాలు పొందాలని ఆమె రిషి సునాక్‌కు సలహాఇచ్చారు. 



నెలన్నరకే రాజీనామా చేసిన లిజ్ ట్రస్ 


బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక లిజ్ ట్రస్ అధికార కన్సర్వేటివ్ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. కన్సర్వేటివ్ పార్టీ తరపున రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్యే పోటీ జరిగింది. చివరకు లిజ్ ట్రస్ విజేతగా నిలిచారు. కానీ ఆమె తీసుకు వచ్చిన మధ్యంతర బడ్జెట్ బ్రిటీష్ వారి ఆర్ధిక వ్యవస్థను మరింత అస్తవ్యస్తం చేసింది. లిజ్ ట్రస్ ఆర్ధిక విధానాలతో బ్రిటన్ మరింత కష్టాల్లో చిక్కుకుంది. ఈ తరుణంలో అధికారం చేపట్టిన 45 రోజులకే ఆమె యూ టర్న్ తీసుకున్నారు. ప్రధానిగా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కన్సర్వేటివ్ పార్టీ రిషి సునాక్‌ను ప్రధానిగా ఎన్నుకుంది.


రాజకీయంగా వేగంగా ఎదిగిన సునాక్ 



రిషి సునాక్ తాతలు బ్రిటిష్ పాలనలోని భారతదేశంలో, పంజాబ్ ప్రావిన్సుకు చెందినవారు. తదనంతరకాలంలో వారు తూర్పు ఆఫ్రికా ప్రాంతానికి వలసవెళ్లారు. 1960ల్లో వీరి కుటుంబాలు బ్రిటన్‌ చేరుకున్నాయి.2009లో రిషి సునాక్ అక్షతా మూర్తిని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడైన ఎన్.ఆర్.నారాయణమూర్తి కుమార్తె. రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. కృష్ణ, అనౌష్క. 2015 నుంచి యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా రిషి సునాక్ ఉన్నారు. థెరిసా మే ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా, బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి అవుతున్నారు.