ఇరాన్ ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా యువత నిరసనలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తుున్నారు. ఇప్పుడు ఈ నిరసన తెలపడానికి మరొక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నారు. స్త్రీపురుషులు అనే భేదం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఒకరినొకరు కౌగిలించుకుని అభివాదం చేసుకుంటున్నారు. తమ నిరసన తెలుపుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో స్త్రీపురుషులు కౌగిలించుకోవడం ఇరాన్ నిషేధం. అందుకే విద్యార్థులు, ప్రజలు ఇలా కౌగలించుకొని నిరసన తెలుపుతున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో స్త్రీపురుషులు కౌగలించుకోవడం విదేశీ సంస్కృతి అని... ఇరాన్‌లోని సంప్రదాయవాదులు భావిస్తున్నారు. అందుకే దేశ సంస్కృతిని భ్రష్టుపట్టించే ఇలాంటి విదేశీ కల్చర్ వద్దని భావించి కౌగిలింతను నిషేధించారు. ఇది ఇస్లామిక్ సమాజంలో నైతికతకు భంగం కలిగిస్తుందని వాళ్ల నమ్మకం.
ఏదేమైనా, కొంతమంది ఇప్పుడు వీటన్నింటికీ అతీతంగా పెరగడం ద్వారా పాత నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇరాన్‌లోని కరాజ్ నగరానికి చెందిన కొందరు వ్యక్తులు ఆలింగనం చేసుకోవడం, కరచాలనం చేయడం, బహిరంగంగా ఒకరినొకరు పలకరించుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో కనిపించింది.
ఈ వీడియోను ఇరాన్ జర్నలిస్ట్ మాసిహ్ అలినేజాద్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ఇరాన్‌లోని కరాజ్ నుంచి ఓ మహిళ ఈ వీడియో పంపించారని తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌లో బాలబాలికలు 7 ఏళ్ల తర్వాత నుంచి వేర్వేరుగా విద్యాభ్యసం చేస్తారు. పురుషులు, మహిళలు ఒకరినొకరు కౌగిలించుకోవడం, కరచాలనం చేయడం, పార్టీలకు హాజరు కావడం నిషిద్ధం. వీడియోలో కనిపించే వాళ్లంతా కౌగిలించుకొని చట్టాన్ని ఉల్లంఘించారు.