ప్రథమం శైల పుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్ర ఘంటేతి కూష్మాండేతి చతుర్థకం
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్తా
నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా
ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని పురాణాలు చెబుతాయి. 
శైలపుత్రి దుర్గ
సతీదేవి యోగాగ్నిలో తనువును విడిచిపెట్టి ఆ తర్వాత పర్వతరాజైన హిమవంతుని ఇంట్లో శైలపుత్రిగా అవతరించింది. వృషభ వాహనంపై ఉండే ఈ అమ్మవారి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం, తలపై చంద్రవంక ధరించి ఉంటుంది. పార్వతి, హైమవతి అనేవి ఆమె పేర్లే. 
బ్రహ్మచారిణి దుర్గ
కుడి చేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలం ధరించి పరమేశ్వరుడిని పతిగా పొందేందుకు ఘోరతపస్సు చేసి ఉమగా పూజలందుకుంటోంది. బ్రహ్మచారిణి అనుగ్రహం వల్ల సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. 
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
చంద్రఘంట దుర్గ
చంద్రఘంట అమ్మవారు తలపై  అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండడంతో  'చంద్రఘంట' అని పిలుస్తారు. సింహవాహనంపై బంగారు కాంతితో మెరిసిపోయే అమ్మవారి పదిచేతుల్లో ఖడ్గం,  శస్త్రాలు, బాణం సహా పలు అస్త్రాలు ధరిస్తుంది. అమ్మవారు ఎంతో సౌమ్యంగా, ప్రశాంతంగా దర్శనమిస్తుంది.  ఈ దేవిని ఆరాధించడం వల్ల సకల కష్టాలు తీరిపోతాయని చెబుతారు. 
కూష్మాండ దుర్గ
దరహాసంతో  బ్రహ్మాండాన్ని సృజించేది కావడంతో  'కూష్మాండ' అను పేరు వచ్చింది.  బ్రహ్మాండంలో  సకల వస్తువులలో, ప్రాణుల్లో తేజస్సు అంతా ఈమె ఛాయే.  'అష్టభుజాదేవి' అని పిలిచే ఈ చల్లని తల్లి ఏడు చేతుల్లో  కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలం, చక్రం, గద ఉంటాయి. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులు, నిధులను ప్రసాదించు జపమాల ఉంటుంది. కూష్మాండ దుర్గ వాహనం కూడా సింహవాహనమే. ఈ దుర్గును పూజిస్తే బాధలు నశించిపోతాయని, ఆయు ఆరోగ్యం వృద్ధి చెందతుందని చెబుతారు. 
Also Read: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
స్కందమాత దుర్గ
కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి  దుర్గాదేవిని 'స్కందమాత'పేరుతో  నవరాత్రులలో ఐదో రోజు  ఆరాధిస్తారు. ఒడిలో  బాలస్కందుడిని చేతపట్టుకుని కుడిచేత పద్మం ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలం ధరించి సింహవాహనంపై కూర్చుని ఉంటుంది. స్కందమాతను ఉపాసించడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని , సుఖ శాంతులు ఉంటాయని పండితులు చెబుతారు.



కాత్యాయని దుర్గ
"కాత్యాయనీ మాత" బాధ్రపదబహుళ చతుర్దశి రోజు  బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయని మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది. కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుడి కోసం గోపికలంతా యమనానది  తీరంలో ఈమెను పూజించారు.  నాలుగు భుజాలతో విరాజిల్లే  కాత్యాయని కుడిచేతిలో అభయ ముద్ర, వరముద్రను కలిగిఉంటుంది. ఎడమచేతిలో ఖడ్గం, పద్మం పట్టుకుని  సింహవాహనంపై కొలువై సేవలందుకుంటుంది. ఈ దేవిని భక్తితో సేవించినవారికి  చతుర్విధ పురుషార్ధాల ఫలం లభిస్తందని చెబుతారు.
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
కాళరాత్రి దుర్గ
"కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారంలా నల్లగా ఉంటుంది.  తలపై కేశాలు చెల్లాచెదురుగా ఉంటాయి. ఈమె త్రినేత్రాలు బ్రహ్మాండంలా  గుండ్రంగా ఉంటాయి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరమైన అగ్నిజ్వాలలు కక్కుతూ ఉంటుంది. కాళరాత్రి వాహనం గార్ధభం.  కుడిచేతిలో వరముద్ర, అభయముద్ర...ఎడమ చేతిలో ఇనపముళ్ల ఆయుధం, ఖడ్గం ధరించి ఉంటుంది.  కాళరాత్రి స్వరూపం చూసేందుకు భయంకరంగా ఉన్నప్పటికీ ఈ అమ్మ ఎప్పుడూ శుభాలే ప్రసాదిస్తుంది. అందుకే శుభంకరీ అని అంటారు. కాళరాత్రి దుర్గను స్మరిస్తే  శత్రుభయం ఉండదని పండితులు చెబుతారు. 
మహాగౌరి దుర్గ
అష్టవర్షా భవేద్గౌరీ - "మహాగౌరి" అష్టవర్ష ప్రాయము గలది.  మహాగౌరి ధరించే వస్త్రాలు, ఆభరణాలు తెల్లని కాంతులు వెదజల్లుతాయి. ఈమె చతుర్భుజాలతో  వృషభవాహనంపై కొలువై ఉంటుంది. కుడిచేతుల్లో అభయముద్ర, త్రిశూలం..ఎడమచేతుల్లో  ఢమరుకం, వరముద్ర కలిగి ఉంటుంది.  ఈ తల్లి దర్శనం ప్రశాంతతనిస్తుంది. పార్వతి అవతారంలో పరమశివుడి కోసం ఘోర తపస్సు చేయడంతో నలుపెక్కిన అమ్మవారికి పరమశివుడు గంగాజలంలో అభిషేకం చేయడంతో  శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముతోందని చెబుతారు.  మహాగౌరిని ఉపాసించిన భక్తుల్లో కల్మషాలు ఉండవు.  పూర్వ జన్మ పాపాలు కూడా పూర్తిగా నశిస్తాయని చెబుతారు.


సిద్ధిధాత్రి దుర్గ
సర్వవిధ సిద్ధులను ప్రసాదించే తల్లిని సిద్ధి ధాత్రి అంటారు.  పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవీ కృపవల్లే పొందాడని దేవీపురాణం చెబుతుంది.   కుడిచేతల్లో చక్రం, గద... ఎడమచేతుల్లో శంఖం, కమలం ఉంటాయి. నిష్ఠతో సిద్ధిధాత్రిని ఆరాధిస్తే సకలసిద్ధులు కలుగుతాయంటారు. 


Also Read: శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి