మనిషి తనలోని చెడు గుణాలను తొలగించుకునేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమ మార్గం శరన్నవరాత్రుల్లో అమ్మవారి పూజ అని చెబుతారు పండితులు. విజయదశమి రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాదు పాండవులు జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం సంప్రదాయం. 


మహిషాసుర సంహారం: బ్రహ్మదేవుని నుంచి వరం పొందిన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకోగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజస్సుగా  మారింది. త్రిమూర్తుల తేజమంతా కలసి స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజస్సు ముఖంగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదాలగా కలసిన మంగళమూర్తి 18 చేతులతో అవతరించింది. శివుడి శూలం, విష్ణువు చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు పాశం, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం.. హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది ఆ శక్తి. మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడని చంపి తర్వాత మహిషాసురునిని సంహరించింది. అప్పటి నుంతి మహిషుని సంహరించిన రోజున దసరా పర్వదినంగా పిలుస్తారు.  ఈ నవరాత్రులలో ఆలయాల్లో అమ్మవారికి విశేష అంలకరణలు పూజలు చేస్తారు.



వరాహ పురాణం పేర్కొన్న నవదుర్గలు  శైల పుత్రీతి, బ్రహ్మచారిణీ, చంద్ర ఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రీ, మహాగౌరీ, సిద్ధిధాత్రి అని 9 రూపాలుగా ఆరాధిస్తారు. 
వరాహ పురాణంలో ఉన్న నవదుర్గల శ్లోకం
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది


ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలు-ఆ అలంకారం వెనుకున్న విశిష్టత 



7-10-2021: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం  శ్రీ స్వర్ణకవచాలంకరణ దుర్గాదేవి: ఈ అలంకారంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటే స‌క‌ల ద‌రిద్రాలూ తొల‌గి శుభాలు కలుగుతాయంటారు.


8-10-2021: విదియ శుక్రవారం శ్రీ బాలా త్రిపురసుందరి దేవి: మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి.. పూజించి కొత్త బ‌ట్ట‌లు పెడ‌తారు.శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం


9-10-2021: తదియ శనివారం శ్రీ గాయత్రీ దేవి: సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం.


10-10-2021: చవితి ఆదివారం శ్రీ లలితా త్రిపురసుందరి దేవి:  సాక్షాత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా... చిరుమందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. 


11-10-2021: పంచమి, షష్ఠి సోమవారం శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి: అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం.  ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 


12-10-2021: శుద్ధ సప్తమి మంగళవారం శ్రీ సరస్వతీ దేవి అలంకారం: సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి వరకూ మరింత పుణ్యదినాలుగా భావిస్తారు భక్తులు. 


13-10-2021: శుద్ధ అష్టమి బుధవారం శ్రీ దుర్గాదేవి: లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వకంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. 


14-10-2021: శుద్ధ నవమి గురువారం శ్రీ మహిషాసురమర్దిని:  దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని రూపంలో  ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే... భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి. 


15-10-2021: శుద్ధ దశమి శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి: వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు.


అక్టోబరు 11  సోమవారం శుద్ధ పంచమి, షష్ఠి తిధులు రావడంతో అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుంది. 


Also Read: ఉదయం బాలిక రూపంలో మధ్యాహ్నం యువతిగా.. సాయంత్రం వృద్ధురాలిగా కనిపించే అమ్మవారు


Also Read: రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి