హిందువుల పవిత్ర మాసాల్లో శ్రావణం కూడా ఒకటి. శివుడికి ప్రీతిపాత్రమైన నెలగా పరిగణిస్తారు. శ్రావణంలో ఆల్కహాల్, పచ్చి ఆకుకూలు, ఉల్లి, వెల్లుల్లి తినకూడదని నియమం. అయితే ఈ నెలలో జుట్టు కూడా కత్తిరించకూడదట. మరి దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఏమిటో తెలుసా?


శ్రావణ మాసం శివుడికి ఇష్టమైన మాసంగా ప్రతీతి. ఈ నెలలో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సారి శ్రావణ మాసం 59 రోజుల పాటు ఉంటుంది. అంటే అధిక శ్రావణ మాసం వచ్చింది ఈ ఏడాది. అందువల్ల 8 సోమవారాలు వస్తాయి. శ్రావణ మాసంలో కొన్ని పనులు చెయ్యకూడదని శాస్త్రం చెబుతోంది. అటువంటి వాటిలో జుట్టు కత్తిరించుకోవడం కూడా ఒకటి.


జుట్టు ఎందుకు కత్తిరించకూడదు?


శ్రావణ మాసంలో జుట్టు కత్తిరించకూడదు అనేది ఒక నియమం. ఈ ఆచారం అనాదిగా ఉంది. శతాబ్దాల క్రితం తగినంత వెలుతురు, సురక్షితమైన పరికరాలు అందుబాటులో లేని రోజుల్లో జుట్టు కత్తిరించే సమయంలో ఏదైనా గాయం అయ్యే ప్రమాదం ఉంటుందనేది కూడా ఒక కారణం. శ్రావణం వర్షాకాలం కనుక ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువగా వస్తుంటాయి. గాయాలు త్వరగా మానకపోవచ్చు లేదా ఇన్ఫెక్ట్ కావచ్చు. అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు కనుక శ్రావణ మాసంలో గాయం మానడానికి ఎక్కువ సమయం పడుతుందనే కారణంతో జుట్టు కత్తిరించవద్దనే నియమం అమలులో ఉంది. అయితే, సురక్షిత విధానాలు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అవేవీ పట్టించుకోవడం లేదు.


శ్రావణ మాసం అనే సెంటిమెంటుతో ఇప్పుడు కూడా జుట్టు కత్తిరించేందుకు వెనకాడితే జుట్టు చివర్లు చిట్లిపోవడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రావణ మాస వ్రతం ఆచరించే వారు క్షవరం చేసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం నిషిద్ధం. వారు మాత్రం తప్పని సరిగా ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. కాబట్టి జుట్టు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.


⦿ వర్షంలో తడిస్తే తప్పకుండా తలస్నానం చెయ్యాలి. తప్పకుండా గాలిలో ఆరబెట్టాలి.


⦿ వర్షాకాలంలో స్నానానికి 15 నిమిషాల ముందుగానే కొబ్బరి నూనె రాయాలి.


⦿ జుట్టు బలంగా పెరిగేందుకు ప్రొటీన్, విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.


⦿ తల దువ్వేందుకు మందపాటి దంతాలతో కూడిన చెక్క దువ్వెనను మాత్రమే ఉపయోగించాలి. చెక్క దువ్వెన వల్ల జుట్టు ఎక్కువగా తెగి పోదు, రాలదు కూడా.


⦿ వర్షాకాలంలో పసుపు, వేపకు కలిపిన మాస్క్ ఉపయోగంచడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా సురక్షితంగా పెరుగుతుంది.


Also read : బాలీ ద్వీపంలో అబ్బురపరిచే ఆధ్యాత్మిక సాధనలు ఇవే, ఇక్కడ దేవుడిని ఇలా ప్రసన్నం చేసుకుంటారు


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.