Vaali In ramayana: పురాణ ఇతిహాసం రామాయణం ప్రకారం, వాలి ఆరు నెలల పాటు బలవంతుడైన రావణుడిని బంధించాడు. రామాయణంలో రావణుడిలాగే వాన‌ర వీరుడైన వాలిని కూడా ఒక ముఖ్యమైన పాత్రగా పరిగణిస్తారు. అసలు వాలి ఎవరు? రావణుడిని ఎందుకు బంధించాడో తెలుసుకుందాం.


1. మహాబలుడు ఎవరు..?
 రామాయణంలో గొప్ప యోధుడిగా పేర్కొన్న వాలి కిష్కింధ రాజ్యానికి వానర రాజుగా ఉండే పాత్ర. రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లినప్పుడు, శ్రీరాముడు సీతను వెతుకుతూ తిరుగుతున్నాడు. ఈ సమయంలో రాముడు, హనుమంతుడు కలుసుకుంటారు. శ్రీరాముడు, సుగ్రీవుడు ప‌ర‌స్ప‌రం స్నేహితులయ్యేలా చేసింది హనుమంతుడే. సుగ్రీవుడు త‌న అన్న వాలి కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. వాలి అత్యంత‌ శక్తిమంతుడైనందువ‌ల్ల‌ అతన్ని మహాబలి అని కూడా అంటారు. మహాబలి వాలి తన శక్తితో సుగ్రీవుని రాజ్యాన్ని, అతని భార్యను కూడా స్వాధీనం చేసుకుంటాడు. ఈ కార‌ణంగానే శ్రీ‌రాముడు వాలిని వ‌ధించాడు.


2. వాలి చేతిలో రావణుడి ఓట‌మి
రావణుడిని శ్రీరాముడు వ‌ధించాడ‌ని మనందరికీ తెలుసు. కానీ రామాయణంలో శ్రీరాముడి కంటే ముందు రావణుడిని ఓడించిన వాడు వాలి. అతను సర్వశక్తిమంతుడు, పరాక్రమవంతుడు అందువ‌ల్లే లంకాధిపతి రావణుడిని క్షమించి వ‌దిలేశాడు.


3. వాలి- రావణుడి మధ్య యుద్ధం
యుద్ధంలో తనని ఎదిరించేవాడు, త‌న‌తో యుద్ధం చేసేవారి శక్తిలో సగభాగాన్ని పొందుతాడని వాలి బ్రహ్మ నుంచి వరం పొందాడు. ఈ వరం కారణంగా, అత‌ను త‌న‌ను ఎదిరించి పోరాడే వారి బలాన్ని సగం పొందడంతో బలవంతుడయ్యాడు. బ్ర‌హ్మ వ‌ర బ‌లం కార‌ణంగా ఎవరైతే యుద్ధానికి సవాలు చేసినా లేదా అతనితో పోరాడినా, వారి బ‌లంలో స‌గం వాలి పొందుతాడు. అటువంటి పరిస్థితుల్లో, అప్పటికే గొప్ప యోధుడిగా ఉన్న వాలి తన ప్రత్యర్థుల నుంచి సగం బలం పొందడంతో మరింత శక్తిమంతుడ‌య్యాడు. వాలి శక్తి గురించి తెలిసిన వెంటనే, రావణుడు అతనిపై అసూయ చెందాడు. కిష్కింధ‌కు వెళ్లి యుద్ధానికి ర‌మ్మ‌ని, త‌న‌తో యుద్ధం చేయమని వాలిని సవాలు చేస్తాడు. ఆ తరువాత రావణుడు-వాలి మధ్య భీకర యుద్ధం జరిగింది. వర ప్ర‌భావం కారణంగా, రావణుడి శక్తిలో సగం వాలిలోకి ప్రవేశించింది. అది అతన్ని మరింత బలవంతుడిని చేసింది, ఫ‌లితంగా వాలి శక్తి రావణుడి ఓటమికి దారితీసింది. వాలి రావణుని బంధించి రోజూ అవమానించడం ప్రారంభించాడు.


4. రావ‌ణుడిని బంధించిన వాలి
యుద్ధంలో ఓట‌మి పాలైన రావణుడిని వాలి చంపలేదు, కానీ ప్రతిరోజూ అతన్ని అవమానించాడు. ప్రతిరోజు రావణుడిని తన చేతుల్లో ఎత్తుకుని నాలుగు దిక్కులు చుట్టి అందరికీ చూపేవాడు. అలా సుమారు 6 నెలల పాటు రావణుడిని వాలి తన బందీగా ఉంచుకున్నాడు.


5. వాలి-రావణుడి మధ్య స్నేహం
వాలి శ‌క్తిని గ‌మ‌నించిన రావణుడు అత‌నికి క్షమాపణలు చెప్పి తన ఓటమిని అంగీకరించాడు. వాలి కూడా రావణుడిని క్షమించాడు. రావణుడు వాలిని స్నేహితుడిగా ఉండాల‌ని కోర‌గా.. వాలి అందుకు అంగీకరించాడు. అలా యుద్ధం తరువాత వాలి, రావణుడు స్నేహితులు అయ్యారు. ఈ స్నేహం తరువాతే లంక- కిష్కింధ‌ మధ్య రాజకీయ ఒప్పందం కుదిరింది. రావణుడు చాలాసార్లు అవమానాల పాల‌యిన‌ప్పటికీ, అతను తన రాజ్య శ్రేయస్సు కోసం వాలి స్నేహాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే వాలి ఎంత శక్తిమంతుడో రావణుడికి ముందే తెలుసు. 


Also Read : రావణాసురుడికి పది తలలు ఎందుకు ఉంటాయి? అది ఎవరి వరం?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.