ఆయుర్వేదం పురాతన వైద్య విధానాలలో ఒకటి. సహజ సిద్ధంగా దొరికే వివిధ మూలికలతో చికిత్సను అందించే వైద్య విధానం ఆయుర్వేదం. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి వివిధ మూలికలను ఉపయోగించేవారు. జీర్ణక్రియ ఆరోగ్యం నుంచి మానసిక ఆరోగ్యం వరకు అన్ని రకాల సమస్యలను తీర్చే మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఆయుర్వేదమే ప్రజలకు తెలిసిన వైద్య విధానం. ఇప్పుడు అలోపతి అంటే ఆంగ్ల వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అవి చాలా తక్కువ కాలంలోనే పరిష్కారాలను చూపించడంతో వాటినే ఇప్పుడు అందరూ వినియోగిస్తున్నారు. ఆయుర్వేదాన్ని పాటించే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అయితే ఆయుర్వేదంలో మెదడు ఆరోగ్యాన్ని పనితీరును మెరుగుపరిచే ఒక అద్భుతమైన మూలిక ఉంది.
అరుదైన మూలికలలో ఒకటి జటామాన్సి. దీనినే బల్చాద్ అని కూడా అంటారు. ఈ మూలికలో చర్మం, జుట్టు సమస్యలను తీర్చే అద్భుతమైన గుణం ఉంది. అలాగే మానసిక ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడమే కాకుండా మెదడు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు జటామాన్సిని వాడితే ఎంతో మంచిది. జ్ఞాపకశక్తిని కూడా ఇది పెంచుతుంది. దీనిలో అడాప్టర్ జెనిక్ లక్షణాలు అధికం. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ప్రశాంతంగా ఉంచుతాయి.
జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి జటామాన్సిని ఉపయోగించవచ్చు. ఇది మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ సంకేతాలను పంపడానికి, నాడీ సంబంధిత కనెక్షన్లను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. విద్యార్థులు తరచూ ఈ మూలికను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో న్యూరో ప్రొటెక్టివ్ ఏజెంట్లు ఉన్నాయి. ఇవి మెదడు దెబ్బతినకుండా, జ్ఞాపకశక్తి కోల్పోకుండా కాపాడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థం చేయడానికి సహాయపడతాయి. జటామాన్సిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. వృద్ధాప్యంలో కూడా మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతుంది.
జటామాన్సి మెదడు కణాల నిర్మాణం, మరమ్మత్తు ప్రక్రియలను అద్భుతంగా నిర్వహిస్తుంది. కొత్త న్యూరాన్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల టెన్షన్లు తగ్గుతాయి. దీన్ని ప్రతిరోజూ వినియోగిస్తే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
జటామాన్సి పొడి రూపంలో మార్కెట్లో సులువుగానే దొరుకుతుంది. దీన్ని రాత్రిపూట పాలు లేదా నీటిలో కలుపుకొని తాగితే ఎంతో మంచిది. దీన్ని టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. రెండు కప్పుల నీటిని గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అవి మరుగుతున్నప్పుడు ఒక స్పూను జటామాన్సి పొడి వేయాలి. ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి. తర్వాత వడకట్టి వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఇది మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
Also read: డయాబెటిస్ ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి ఈ కంటి సమస్య, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.