Diabetic Retinopathy: ప్రపంచవ్యాప్తంగా మధుమేహ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అనారోగ్యపు జీవనశైలి కారణంగా తక్కువ వయసులోనే మధుమేహం బారిన పడుతున్న యువత సంఖ్య పెరుగుతోంది. అమెరికా యువతలో టైప్2 డయాబెటిస్ విపరీతంగా వస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మనదేశంలో కూడా ప్రతి ఏటా డయాబెటిక్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక వ్యక్తి రక్తంలో చక్కెర అధికంగా ఉండడమే డయాబెటిస్. అలా ఉండడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలి. అధికంగా ఉంటే శరీరంలోని ఇతర అవయవాలకు సమస్యలు తప్పవు. అలా కంటికి కూడా డయాబెటిస్ వల్ల సమస్యలు వస్తాయి. కంటి చూపు పోగొట్టే పరిస్థితి రావచ్చు. దీన్నే డయాబెటిక్ రెటినోపతి అంటారు.
డయాబెటిక్ రెటినోపతి అనేది రెటీనాలోని వెనుక ఉన్న నరాలకు వచ్చే వ్యాధి. కంటిలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఇలా రక్తనాళాలు సరిగా పనిచేయకపోవడం వల్ల దృష్టి మందగిస్తుంది. సకాలంలో వైద్య చికిత్స తీసుకోకపోతే అంధత్వం వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో మధుమేహం ఉన్న వారిలో దాదాపు 26% మంది డయాబెటిక్ రెటినోపతి సమస్యను ఎదుర్కొంటున్నారు. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా మధుమేహాన్ని ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవడం అవసరం. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కంటి చూపు పూర్తిగా మందగించే అవకాశం ఉంది. చివరికి అంధత్వమే మిగులుతుంది.
డయాబెటిక్ రెటినోపతి వచ్చిన ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత కొన్ని లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. కంటి చూపు మసకగా మారుతుంది. ఒకసారి క్లియర్ గా కనిపించడం, మరొకసారి మసకగా కనిపించడం వంటివి జరుగుతాయి. అలాగే చీకటి ప్రాంతాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే సగం ప్రాంతం చీకటిగా, సగం ప్రాంతం కనిపించడం వంటివి జరుగుతాయి. అలాగే మచ్చలు, గీతల్లా కూడా కంటి చూపు కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణాలు బయట పడుతూ ఉంటాయి. దీన్ని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుంది. ముదిరిపోతే కంటిచూపును కోల్పోవాల్సి రావచ్చు. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడడం చాలా అవసరం.
కంటి చూపు కోసం కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తినాలి. కాలీఫ్లవర్, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, నట్స్, పచ్చిమిరపకాయలు వంటివి తరచూ తినాలి. రోజుకో పచ్చి క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
Also read: గర్భాశయ క్యాన్సర్ రాకుండా అందుబాటులోకి దేశీ వ్యాక్సిన్ Cervavac, దీని ధర ఎంతంటే...
Also read: అనూరిజమ్‌తో చిన్న వయసులోనే మరణించిన ప్రఖ్యాత బాడీబిల్డర్, ఏమిటి అనూరిజమ్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.